ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 09, 2020 , 23:38:38

లౌకికత్వం బలి..

లౌకికత్వం బలి..
  • నాలుగో అధ్యాయం కొనసాగింపు...
  • పీవీ-అయోధ్య

ఏప్రజాస్వామిక విధానంలో అయినా రాజకీయ అధికారం చేతులు మారటం అనేది క్రమబద్ధంగా జరిగే ప్రయత్నం కావటం సహజం. కనుక భారతదేశం విషయంలో అయినా దానికి భిన్నంగా ఉండదనేది నిర్వివాదాంశం. అయితే ఈ దేశ పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన ఇబ్బంది లేదా సానుకూలత ఉంది- అది పరికించి చూచేవాళ్ల తీరుపై ఆధారపడి ఉంటుంది. భారత ప్రభుత్వ తొలితరం నాయకత్వం, భారతీయ ప్రజాస్వామికం నుండి ఉద్భవించలేదు; భారత స్వాతంత్య్ర  పోరాటం నుండి నీటి బుగ్గలా తన్నుకొచ్చింది. ఆ అంశమే భారతదేశంలోని సమస్త రాజకీయపక్షాల ధోరణుల్లో స్వాతంత్య్రానంతరం ఎంతో తేడా కన్పించేట్లు చేశాయి- మరీ ముఖ్యంగా అధికారం ఏమీ లేకుండా సమర్థులైనవారు అధిక కాలం ఓపిక బట్టవలసిరావటం. చాలాకాలం వరకు ఒక పార్టీయే ఎన్నిక తరువాత ఎన్నికలో అధికారాన్ని చేజిక్కించుకొని పరిపాలించుకుంటూ పోయింది. అలా జరగటం అది ఆ పార్టీ తప్పిదమూ కాదు; ఇతర పార్టీలది అంతకంటే కాదు.

అటు కాంగ్రెసు, ఇటు జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అజేయంగానూ, ఆ స్థానాలు వేరొకరితో భర్తీ చేసేందుకు వీలులేని విధంగానూ కనీసం కేంద్రంలో నయినా నిలిచిపోయారు. సిద్ధాంతపరంగా కాంగ్రెసు ఒక నిరుపమాన స్థితికి చేరుకుంది. మరో పార్టీ ఏదీ కూడా దానికి సాటివచ్చేట్లు లేదు. ప్రతి భారతీయునికీ అందులో స్థానం లభించటమే గాక లబ్ధి పొందటం కూడా సంభవిస్తూ వచ్చింది. లౌకికవాద, ఆర్థిక కార్యక్రమాలలో కాంగ్రెసును కొట్టే వాళ్లెవ్వరూ లేకుండాపోయారు. ప్రజలు ఏవయితే తగినవనుకున్నారో, సమయానుకూలమైనవనుకున్నారో, సముచితమైనవనుకోసాగారో అటువంటి పథకాలనే కాంగ్రెసు రూపొందించగలిగింది. కాంగ్రెసుకు ఎప్పుడైతే సోషలిజం సంప్రదాయమై కూర్చుందో అప్పుడు నలభై దశకం చివరిలో కాంగ్రెసును వదలివెళ్లిన సోషలిస్టు ఉత్సాహికులు యాభై దశకం మధ్యలో మెలమెల్లగా మళ్లీ కాంగ్రెసులోకి ప్రవేశించసాగారు. కాంగ్రెసు వ్యతిరేక రాజకీయ వేదిక కాంగ్రెసుకు ఒక రూఢియైన ప్రత్యామ్నాయాన్ని సమకూర్చగలదనే చివరి అవశేషం సైతం కనుమరుగు కావటంతో అది మరింత వ్యతిరేకదిశగా పయనించసాగి భావావేశం దట్టించబడే అంశాలపై ఆధారపడటం జరిగింది. అదే దుఃఖ భాజనమై నిలిచింది. ఇవ్వాల్టికీ ఆ ధోరణి అలాగే కొనసాగుతూంది ప్రధానంగా- ఏవో పైపై మెరుగులవంటి మార్పులు తప్ప.

స్వాతంత్య్రానంతర భారతదేశంలోని ప్రజాస్వామిక రాజకీయాల్లో ఒక సాధారణ లక్షణాన్ని మనం ప్రత్యేకించి గుర్తించాల్సి ఉంది. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన పిమ్మట సహజంగానే దాని మూల సూత్రాలయిన లౌకికవాదం, చట్టం ముందు అందరూ సమానులే వంటి విషయాలలో ఉల్లంఘన జరుగబోదనీ, అసలు ఆ ప్రశ్నే తలెత్తదనీ, అదీ ముఖ్యంగా రాజకీయ ఉద్యమం విషయంలోనో, పైకి ఎగబ్రాకే విషయంలోనో జరగనే జరగదనీ భావించబడింది. అయితే కొన్ని రాజకీయ విపక్షాలు మాటిమాటికీ ఈ మూల సూత్రాలను ఉల్లంఘిస్తూ పాలకపక్షాన్ని పడగొట్టేందుకు సమాయత్తమయ్యాయి. ఈ ఉద్యమాలు ప్రధానంగా మూడు రకాలు: వేర్పాటువాద ఉద్యమాలు, మతపరమైన ఉద్యమాలు, సాయుధ తిరుగుబాట్లు. వీటికి రాజ్యాంగబద్ధత ఉండనే ఉండదు. వాటిని నిర్వహించే పక్షాలు అసలు రాజ్యాంగాన్ని పట్టించుకున్నట్లు కన్పించదు. మన స్వాతంత్య్రానంతర ఉద్యమాల చరిత్రలో మనం అమితంగా దురపిల్లవలసిన అంశం యిదే.

దురదృష్టవశాత్తు, ఎలాగయితేనేం కాంగ్రెసు పార్టీని టక్కుటమార విద్యతో తొలగించి అధికారంలోకి రావాలనుకుని ఆతురత చెందే పార్టీలు చేపట్టిన భావనాబలంతో కూడిన అనేక అంశాలు రాజ్యాంగపు మూల సూత్రాల పైనా జాతీయ సమైక్యతపైనా ప్రభావాన్ని చూపసాగాయి. ప్రధానంగా వాటిని రెండు విధాలుగా విభజించవచ్చు. 

1. జాతీయ ఏకతాభావం - అరవై దశకం మధ్య భాగాన తమిళనాట ద్రావిడ ఉద్యమం అటువంటి భావనను దెబ్బతీసింది. ఎన్నికల అత్యవసర వ్యూహంగా పంజాబులో అది పలుమార్లు ప్రయోగించబడి ఇబ్బంది పెట్టింది. అలాగే విదేశీ ప్రోత్సాహంతో ఈశాన్య ప్రాంతంలో మరీ ముఖ్యంగా నాగాలాండ్‌లో జాతీయ ఐక్యతకు ముప్పువాటిల్లింది.

2. లౌకికవాదం-దీనికి బ్రిటిషు హయాంలో ‘విభజించి పాలించు’ రోజుల నుండి ముప్పువాటిల్లింది. దేశ విభజన సమయంలో అటువంటి భావనకు తావులేకుండా పోయింది. అయితే నాయకుల దృఢ విశ్వాసం వల్ల, దేశపు సంప్రదాయానుగుణంగా లౌకికవాద భావన మన రాజ్యాంగానికి ఓ మూలస్తంభమయ్యింది. కొన్ని వికారపు మచ్చల్ని ఈ వైపున నిలుపుతూ మన లౌకిక ముఖసౌందర్యాన్ని చెడగొడుతూ ఉంది. కొన్ని రాజకీయపక్షాలకు అలౌకికవాదం ఓట్లు సంపాదించి పెట్టే అంశమయ్యింది కనుక వాళ్లు దేశ విభజన నాటి అమానవీయ సంఘటల్ని గుర్తుకు తెచ్చి అవి పెల్లుబకజేసే భావావేశాలకు ఎరలుగా వేయసాగారు. వాళ్ల ఆలోచన అంతా అత్యధిక సంఖ్యలో వున్న హిందువుల్ని వాళ్ల ప్రక్కన నిలుపుకొని సంఖ్యాబలంతో ఎన్నికల్లో విజయం సాధించాలనే.

దీనివల్ల అలౌకిక భావనల పట్ల అసలేమి విశ్వాసం లేనటువంటి రాజకీయపక్షాలు సైతం వాళ్ల ఎన్నికల ప్రాబల్యాల మదింపుల్లో దానిని పూర్తిగా విస్మరించలేకపోతున్నారు. మరికొన్ని పక్షాలు ఇదే కారణంతో మైనారిటీలను అందులోనూ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిములను కాంగ్రెసుకు దూరం చేసి, హిందువులలోని మరికొన్ని వర్గాలతో కలుపుకొని అవి ఎన్నికల్లో విజయసాధనకు గమ్యం చేరే మార్గాలను అన్వేషించుకుంటున్నాయి.

కాంగ్రెసుకు ప్రతిపక్షాలుగా నిలిచే పార్టీ బాగా నిరోమయంలో పడిన సందర్భమేమంటే ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసు 415 సీట్లు గెలుచుకోవటం; 1985 ప్రారంభంలో రాజీవ్‌గాంధీ ప్రధాని కావటం. అయితే అది తప్పా, ఒప్పా అనే విషయాన్ని అలా ప్రక్కనబెట్టి చూస్తే ఇందిరాగాంధీ రెండవ పర్యాయం ప్రధానిగా వున్న 1980-84 మధ్యకాలంలో ఏ వాగ్దానాల వల్ల గతంలో కాంగ్రెసు పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిందో ఆ వాగ్దానాల ప్రతిఫలాలు అందలేదనే అభిప్రాయం ఒకటి ఉంది. కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రతిసారీ పంజాబు వేర్పాటువాద ఉద్యమం ఏ పాత్ర పోషించిందో ఇప్పుడూ అదే పాత్రను పెద్ద ఎత్తున పోషించింది. ఆ విధంగా ఇందిరాజీ జీవించివున్న కాలంలో పలుపర్యాయాలు కాంగ్రెసును ఆదుకున్నట్లే. ఈ పర్యాయం మరణించి కూడా సాయపడింది.

(మాజీ  ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo