శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jul 08, 2020 , 22:41:23

ఈ వ్యాధులు వేటి ఫలితం?

ఈ వ్యాధులు వేటి ఫలితం?

కరోనా నియంత్రణకు ఆధునిక యుగంలో ఒక మాజిక్‌ బుల్లెట్‌ లాంటి ఔషధం త్వరగా కావాలని కోరుకుంటారు. కానీ అభివృద్ధి క్రమం అనుకునే ధోరణిలో ప్రకృతిని, పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వల్ల విపరిణామాలు సంభవిస్తున్నాయి. జల, వాయు, భూ కాలుష్యం పెరిగి వ్యర్థాలతో కలుషితమై ఎన్నో బ్యాక్టీరియా, వైరస్‌లు, వాటివల్ల వ్యాధులు ప్రబలాయి.

భూమి మనకు సంక్రమించిన వారసత్వ సంపద కాదు. భావితరాల నుంచి తెచ్చుకున్న అరువు We don’t inherit the earth, we borrow it from our children అన్నదొక పాత అమెరికన్‌ సామెత. మనిషి ఆవాసాలను పల్లెలు, నగరాలు అని చెప్పటం పరిపాటి. నిజానికి, 87 లక్షల జీవరాశులతో కలసి జీవిస్తూ, మానవుడు ఆధిపత్యం సాధించాడు. అయితే సూక్ష్మజీవులు అతడి చుట్టూ తిరుగుతూ ఉంటాయనేది విస్మరించలేని విషయం. కరోనా అనే ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ వల్ల జరుగుతున్న ఆర్థిక, సామాజిక, ఆరోగ్య బీభత్సాలను చూస్తే ఇది కొంతవరకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వ్యాధులు, వాటి వ్యాప్తి గురించి ముచ్చటించుకోవడం అవసరం. 

క్రీ.పూ. 1200లో తొలిసారి ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి నమోదైంది. ఇది వైరస్‌ వ్యాధియే. పర్షియా, దక్షిణ మధ్య ఆసియాలో వచ్చింది. క్రీ.పూ. 429- 426 సంవత్సరాల్లో రోమన్‌ సామ్రాజ్యాన్ని, 250లో యూరప్‌ను, 541లో యూరప్‌, ఆసియా దేశాలలో రకరకాల అనారోగ్యాలు కబళించాయి. క్రీ.పూ.541లో సంభవించిన ‘జస్టీనియన్‌ ప్లేగు’ ‘తొలి పాండమిక్‌'గా పేరు పొందింది. పాండమిక్‌ అంటే విస్తృతంగా అనేక దేశాలలో, ఖండాలలో వ్యాపించే వ్యాధి. 10 కోట్ల మరణాలు సంభవించాయి. అది నాటి ఐరోపా జనాభాలో సగం! ఆపై చెప్పుకోదగిన పాండమిక్‌ 1510లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వల్ల, 1561లో మశూచి, 1817 నుంచి 1927 వరకు ఆరుసార్లు కలరా విజృంభించి యూరప్‌, తూర్పు అమెరికా, రష్యా, ఆసియాలను చుట్టబెట్టింది. దశాబ్దాల పాటు ప్రాణనష్టం కలుగచేసింది. మిలియన్ల మంది అకాల మరణం చెందారు.

ఆధునిక వైద్యం పట్టు సాధించాక, 1915 నుంచి వైరస్‌ వ్యాధులు పెరిగాయి. 1918- 1920 H1N1, 1918-1922 రష్యన్‌ టైఫస్‌, 1957-58 H2N2, 1968-70 నడుమ H3N2, 1988-2018 వరకు HIV వ్యాధులు ఇప్పటిదాకా 32 మిలియన్ల మానవ ప్రాణాలను తుడిచి పెట్టేశాయి. ఇదంతా మనిషికి, సూక్ష్మజీవులకు మధ్య జరిగిన పునరావృత జీవన్మరణ పోరాటం అని చెప్పవచ్చు. సుమారు 25 కోట్ల రకాల వైరస్‌లున్నాయట. గాలి, నీరు, మట్టి, అన్నిటా నిద్రాణంగా వైరస్‌లు ఉండవచ్చు. సారాసాయర్‌ వైరాలజిస్ట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో ప్రకారం, వైరస్‌కుండే కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల తీవ్రతర వ్యాధులు పుట్టగలవు.

మానవేతర క్షీరదాలు, పక్షుల్లో 1.7 మిలియన్ల రకాల వైరస్‌లున్నాయి. అవి శాస్త్రజ్ఞుల పరిశోధనకు అంతుచిక్కని నిర్మాణంతో తిరుగాడుతున్నాయట! జెమ్మాగోగెన్‌ అనే మెక్కైర్‌ విశ్వవిద్యాలయ వైరాలజీ పరిశోధకులు వైరస్‌ స్వీయ నియంత్రణతో పొంగిపొరలే సంఘటన (spill over) అని చెప్తారు. అంటే, వైరస్‌ ఒక జీవి నుంచి మరో జీవికి 

వెళ్ళినప్పుడు అదే ఉపశాఖకు చెందినవాటిలో వృద్ధి చెందగల ‘చొరవ’ను పొందుతూ, బలపడుతుంది .ఉదాహరణకు జైకా వైరస్‌ తొలుత గబ్బిలంలో ఉండి, తర్వాత మానవునికి సంక్రమిస్తుంది. ఒక కొత్త వైరస్‌ వ్యాధి కలుగచేసేందుకు సుమారు 80 కారణాలు ఒకచోట చేరాలంటారు, డొరోథీ టోవర్‌ (స్టాన్‌ఫర్డ్‌). ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆహారపుటలవాట్లు ఇలాంటివన్నమాట. కొవిడ్‌-19 మన శ్వాసనాళంలో ACE-2 అనే ప్రోటీన్‌ను ఆధారం చేసుకొని దూసుకుపోగలదు. ఇది జన్యుపరమైన సౌలభ్యత. కాగా పక్షులు, తిమింగలాల్లో వైరస్‌ అచేతనంగా ఉండటం మరో కారణం. 

సరైన వైద్యంలేని కాలంలో మూఢ నమ్మకాలతో ఉన్న ప్పుడే వ్యాధుల వ్యాప్తి ఆపేందుకు జాగ్రత్తలు పాటించారు. వాటిలో ముఖ్యమైనవి: సబ్బుతో చేతులు కడుక్కోవడం, పరిసరాల పరిశుభ్రత, రోగి వాడిన వస్తువులను ఆరోగ్యంగా ఉన్నవారికి తగలకుండా దూరంగా ఉంచడం, రోగికి పౌష్టికాహారం ఇవ్వటం, రోగి శరీరం నుంచి వచ్చే రక్తం, చీము, మలం, మూత్రం దూరంగా పారవేయడం. ఇప్పటికీ ఈ జాగ్రత్తలు అమూల్యం. ఆధునిక యుగంలో ఒక మాజిక్‌ బుల్లెట్‌ లాంటి ఔషధం త్వరగా కావాలని కోరుకుంటారు. కానీ అభివృద్ధి క్రమం అనుకునే ధోరణిలో ప్రకృతిని, పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వల్ల విపరిణామాలు సంభవిస్తున్నాయి. జల, వాయు, భూ కాలుష్యం పెరిగి వ్యర్థాలతో కలుషితమై ఎన్నో బ్యాక్టీరియా, వైరస్‌లు, వాటివల్ల వ్యాధులు ప్రబలాయి. ఇక ఆహార పదార్థాలలో వాడే రంగులు, హానికర కొవ్వు పదార్థాలు, వాటి ప్యాకేజింగ్‌, పొగాకు ఇవన్నీ మనిషి వ్యాధి రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తాయి. రెండవ కారణం.. నగరాలు పెరగడం. కొండలు, అడవుల విధ్వంసం. భూమిని అధికంగా జనావాసం ఆక్రమించాక అక్కడి వృక్ష, జంతు జాతులు మాయమై, కొత్త వ్యాధులు ప్రబలుతున్నాయి.

ఇటీవలి కరోనా ఇంతగా విస్తరించడానికి మరో కారణం.. ప్రయాణం. ఖండాంతర పర్యటనలు పెరిగాయి. ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది (2019). ఇక ప్రపంచస్థాయి పర్యటన ఎంత పెరిగిందో ఊహించవచ్చు. అందుకే, వ్యాధి వ్యాప్తి వేగవంతమై, కొద్ది నెలలకే ‘పాండమిక్‌'గా మారింది. ఈ అన్ని అంశాలు కరోనా వ్యాధి వ్యాప్తికి సహకరించినవే.

స్వీడన్‌కు చెందిన 15 ఏండ్ల బాలిక గ్రెటా థన్‌బర్గ్‌ కొంతకాలంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నది. గతేడాది స్వీడన్‌ పార్లమెంటు ముందు ధర్నాకు దిగి సంచలనం కలిగించింది. ఆమెకు మద్దతుగా పలు దేశాల్లోని విద్యార్థులు పోరాడుతున్నారు. ఆ చిన్నారి ఐక్యరాజ్యసమితి, న్యూయార్క్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ క్రియాశీల సమావేశంలో మీకెంత ధైర్యం? (‘How dare you?’) అంటూ ప్రపంచ వ్యాపారసంస్కృతిని ప్రశ్నించిన తీరు ఆలోచనలను రేపుతున్నది. నిజమే! కార్బన్‌ వ్యర్థాలతో కలుషితమై, అంతుచిక్కని వ్యాధులున్న సమాజమేనా మనం భావితరాలకు ఇస్తున్నాం? అందుకే.. అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు ప్రబలినాక కలవరపడటం కాకుండా ఆ వ్యాధులకు కారణభూతమయ్యే వాతావరణ మార్పుల పట్ల జాగ్రత్త వహించాలి.

- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌

- డాక్టర్‌ కాళ్ళకూరి శైలజ


logo