ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 07, 2020 , 22:30:23

సాహితీ తపస్వి, కళాపిపాసి

సాహితీ తపస్వి, కళాపిపాసి

పీవీ నరసింహారావు గారిని అనేక సందర్భాల్లో చాలా దగ్గరగా చూసే కొన్ని అవకాశాలు నాకు లభించాయి. ఆయన ప్రసంగాలలో కళలు, సాహిత్యం పట్ల లోతైన పరిజ్ఞానం వ్యక్తమైంది. నాటక కళ అంతరించి పోతున్నదని ఆవేదన చెందారాయన. రాజకీయాల్లో రాణించిన పీవీకి కళాసాహిత్యాలంటే కూడా ఎంతో మక్కువ. పలు రచనలు చేశారు. రాజకీయ జీవితం కారణంగా తీరికలేకపోవడంతో ఆయన ఆ అభిరుచులను పూర్తిగా నెరవేర్చుకోలేకపోయారేమో అనిపిస్తుంది.

నేను 1964 నుంచి 1970 వరకు నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్ర్తోపన్యాసకుడిగా పనిచేశాను. అక్కడ ప్రతి సంవత్సరం సాంస్కృతిక వారోత్సవాలు ఘనంగా జరిగేవి. 1966వ సంవత్సరం అనుకుంటాను.. కాలేజీలో అందరం ఆ ఏడాది ఆ రోజుల్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న పీవీ నరసింహారావు గారితో ప్రారంభింపజేయాలని నిర్ణయించాం. పీవీ గారు ఆ రోజు మొట్టమొదలు మేం నిర్వహిస్తున్న ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులు చిత్రించిన పెయింటింగ్స్‌ ఆయనకు బాగా నచ్చాయి. తర్వాత జరిగిన సభా కార్యక్రమంలో పీవీగారు చాలా గొప్ప ఉపన్యాసం చేశారు. నాటక కళను గురించి, చిత్రకళను గురించి చాలా అద్భుతంగా వివరించారు. 

లలిత కళల్లో ఒకటైన సాహిత్యంలో నాటక కళకు ప్రత్యేక స్థానం ఉంటుందని, అందుకే మన ‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు పీవీ. మంచి నాటక లక్షణాలను గురించి, నటనను గురించి, నాటక ప్రయోజనాల గురించి సోదాహరణంగా ఉపన్యాసించారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఎందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందో చెప్పారు. మహాభారతంలో బీజప్రాయంగా ఉన్న చిన్న కథను కాళిదాసు మహానాటకంగా ఎలా మలిచారో వివరించారు. నటనను గురించి చెప్తూ ఒక పాత్రను నటిస్తున్న నటుడు పూర్తిగా ఆ పాత్రలో లీనమైపోవాలన్నారు. పాత్ర కనిపించాలి తప్ప నటుడు కనిపించకూడదన్నారు. సినిమా బహుళ ప్రచారం పొందడంతో మన తెలుగు నాటక రంగం తీవ్రంగా కనుమరుగైపోయిందని, టికెట్‌ కొనుక్కొని చూసే ప్రేక్షకులిప్పుడు కరువైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ తర్వాత 1980లో కరీంనగర్‌లో వెల్చాల కొండల్‌రావు గారు నెలకొల్పిన శాతవాహన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అనే సంస్థను కేంద్రంలో క్యాబినెట్‌  మంత్రిగా పనిచేస్తున్న పీవీగారు ప్రారంభించారు. అప్పుడాయన మాట్లాడుతూ.. ‘విద్యాపరంగా పక్కనే ఉన్న వరంగల్‌ బాగా అభివృద్ధి చెందింది. ఒక్క వరంగల్‌ మాత్రమే కాకుండా కరీంనగర్‌ లాంటి నగరాలు కూడా అభివృద్ధి చెందాలి. శాతవాహన ఇనిస్టిట్యూట్‌ పీజీ సెంటర్‌ కొద్దికాలంలోనే విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది’ అని చెప్పారు. ఆయన ఆశించినట్టే కరీంనగర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయం నెలకొన్నది. 

పీవీగారిని 1996వ సంవత్సరంలో మరోసారి చాలా దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. ప్రజాకవి కాళోజీ గారి కవితలన్నింటినీ ఒకచోటికి చేర్చి ‘కాళోజీ నా గొడవ’ పేరుతో కాళోజీ ఫౌండేషన్‌ తరఫున ఒక బృహత్తర గ్రంథాన్ని మేము ప్రచురించాం (నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్‌ విద్యార్థి కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు). ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పీవీగారినే ఆహ్వానించాం. ఈ సభ హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్‌లో ఉన్న ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది. పీవీగారు, కాళోజీగారు అత్యంత సన్నిహితులు. కాళోజీని పీవీగారు ‘కాళోజీ నా అంతరాత్మ’ అని చెప్పుకొనేవారు. తను చెయ్యబోయే ఏ పనినైనా లేక ఏ విధాన నిర్ణయాన్నైనా కాళోజీ తెలుసుకున్నప్పుడు, ఎలా స్పందిస్తాడో ఆలోచించే ఆ నిర్ణయాన్నిగాని, ఆ పనినిగాని చేసేవాడినని పీవీ చెప్తుండేవారు. 

ఆ రోజు జరిగిన ‘కాళోజీ నా గొడవ’ గ్రంథావిష్కరణ సభలో పీవీ మాట్లాడుతూ.. ‘కాళోజీ మమ్మల్ని తిట్టే తిట్లనన్నింటినీ దీవెనలుగానే భావిస్తాం. కాళోజీ రుషితుల్యుడు.. నా అంతరాత్మ’ అన్నప్పుడు సభ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అలా మాట్లాడుతున్న ఒక సందర్భంలో ‘కాళోజీగారు’ అని అడ్రస్‌ చేశారు. ఆయన పక్కనే ఉన్న కాళోజీ.. ‘ఏమిరో! “గారు” అనబడ్తివి.. అదెప్పటినుంచి’ అనడంతో సభలో నవ్వులు విరబూశాయి. దీన్నిబట్టి వాళ్లెంత ఆత్మీయులో సభలో ఉన్న అశేష జనవాహినికి అర్థమైంది.

ఆయన ‘ఇన్‌సైడర్‌' నవల చదవడం నాకు మరిచిపోలేని అనుభవం. అనేక రాజకీయ సంఘటనలతో ఈ ఆత్మకథాత్మక నవల సాగుతుంది. మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, లక్ష్మీకాంతమ్మ తదితరులు మారుపేర్లతో పీవీ సృష్టించిన పాత్రల రూపంలో దర్శనమిస్తారు. ఇలా సాహిత్య ప్రస్థానం కూడా కొనసాగించిన మహనీయుడు పీవీ. తెలంగాణ బిడ్డ, మహానాయకుడు పీవీగారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు.


logo