శుక్రవారం 07 ఆగస్టు 2020
Editorial - Jul 07, 2020 , 22:30:23

అన్నదాతల రాజ్యమిది!

అన్నదాతల రాజ్యమిది!

మపంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. మంచి దిగుబడి వస్తుంది. మానవ శరీరానికి రోజూ ఒకే కూర, ఒకే తీరు అన్నం మాత్రమే తింటే కావాల్సిన పోషకాలు లభించనట్టే ఒకే పంట ఏండ్ల తరబడి వేయడం వల్ల భూసారం పెరగదు. ఈ విషయాన్నే నొక్కిచెప్తున్నది తెలంగాణ ప్రభుత్వం.

న దేశం వ్యావసాయిక ప్రధానమైనది. ఇప్పటికీ జనాభాలో అరవై శాతానికి పైగా పల్లెల్లో నివసిస్తున్నారు. దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు. వ్యవసాయం, వ్యవసాయాధారిత పనుల ద్వారా మెజారిటీ ప్రజలు బతుకుతున్న దేశంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైతే కలిగే ఫలితాలేమిటో రైతులు, ఇతర వృత్తిపనుల వారి ఆత్మహత్యల ద్వారా స్పష్టమైంది. పారిశ్రామీకరణ, యాంత్రీకరణ అవసరమే అయినా గ్రామాలను పట్టించుకోకుండా, వృత్తి ప్రధానమైన బతుకులను పట్టించుకోకపోవడం వల్ల గ్రామీణ వృత్తులు, వ్యవసాయం దెబ్బతిని గ్రామీణ సమాజం సంక్షోభంలో పడింది. తెలంగాణ విషయంలోనూ అదే జరిగింది. సీమాంధ్ర వలస పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను, గ్రామీణ వ్యవస్థను ఏ మాత్రం పట్టించుకోలేదు. ‘వ్యవసాయం ఒక దండుగ’ అంటూ ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు, నిధులను కూడా అన్యాక్రాంతం చేసిన పాలకుల వల్ల ఇక్కడి వ్యవసాయం, ఇతర వృత్తులు దెబ్బతిన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాధాన్య క్రమాలను నిర్ణయించుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలకు, వ్యవసాయానికి, వృత్తిపనులకు, రైతుకు మొదటి స్థానం ఇవ్వడం సముచిత నిర్ణయం. దేశానికే అన్నమందించే అన్నదాత రైతు చల్లగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన రైతుబంధువు కేసీఆర్‌. గ్రామాలు కళకళలాడాలంటే వ్యవసాయం పండుగగా మారి తీరాలి. అందుకోసం రైతును ఆదుకొని అతని కండ్లవెంట నీరు రాకుండా చూడాలి. వ్యవసాయాన్ని లాభసాటిదిగా మార్చాలి. అందులో భాగంగానే  కేసీఆర్‌ తెలంగాణలోని ప్రతి వ్యక్తీ ఏదో రూపంలో సంక్షేమ పథకాల ఫలితాలు అందుకునేట్టు చేశాడు. కాబట్టే అతనికి ప్రజల్లో ఏ నాయకుడికీ లేనంత ఆదరణ ఉన్నది.

వ్యవసాయాన్ని లాభసాటిగా, పండుగగా చేయాలంటే ఏం చేయాలో రైతు కుటుంబంలో పుట్టి పల్లెల్లో పెరిగి, గ్రామీణ జీవితాన్ని ఒంటపట్టించుకొన్న కేసీఆర్‌కు బాగా తెలుసు. రైతును, వ్యవసాయాన్ని ప్రేమించిన పాలకుడు గనుక రైతుకేం కావాలో వాటికే ప్రథమ ప్రాధాన్యమిచ్చాడు. తెలంగాణలో ఒకటిరెండు ఎకరాలున్న చిన్న రైతులు, 5-10 ఎకరాలున్న మధ్యతరగతి రైతులు అధికంగా ఉన్నారు. వందల ఎకరాలున్న భూస్వాములు పరిమిత సంఖ్యలో ఉన్నారు. ఈ రైతులందరూ అన్ని కులాల్లోనూ ఉన్నారు. వ్యవసాయం సరిగా నడవాలంటే  రైతుకు అన్నివిధాలా అండగా నిలువటమొక్కటే మార్గం. ఆ పనిని తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతాయుతంగానే చేస్తున్నది.

వ్యవసాయం లాభసాటిగా నడవాలంటే దుక్కిదున్నడానికి, విత్తనాలు వేయడానికి ఇతర పనులకు ముందుగా కొంత పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి కోసం రైతు అప్పు పాలవుతున్నాడు. ఎకరానికి ఐదువేల చొప్పున ఏడాదికి రెండుసార్లు పదివేలు రైతుబంధు పథకం కింద ప్రభుత్వం నుంచి సాయం లభించడం వల్ల రైతుకెంతో ఆసరా అవుతున్నది. వీటితోపాటు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం, రుణమాఫీలు రైతును ఆదుకుంటున్నాయి.

భూమి ఉన్నా నీటి సౌకర్యం లేకుంటే నిరుపయోగమే. బావులకు మోటర్లు అమర్చి కరెంటు మోటర్ల ద్వారా పంట పండించాలి. అందుకు కావాల్సిన కరెంటు సరఫరా లేదు. రాత్రింబవళ్ళు బావుల దగ్గర పడు న్నా పొలం పారే పరిస్థితులు లేవు. వలసపాలనలో  రైతుకున్న  ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలు చూపా డు కేసీఆర్‌. నిరంతర కరెంటు సరఫరా ద్వారా కరెంటు సమస్య తీరిం ది. మూడేండ్లలో అపూర్వమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి చెరువు లు నింపి ఎండకాలంలోనూ మత్తల్లు దుంకేట్టు చేయడం అద్భుతం. ఈ ఎండకాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ చెరువులు మత్తల్లు దుంకుతున్నాయి. ఇలా తెలంగాణ రైతు నీటి సమస్య తీరినట్టే. కాళేశ్వరం నీళ్ళతో భూగర్భజలాలు పెరిగాయి. ఇక రైతుకు సంబంధించిన మరో విషయం పంట చేతికొచ్చినా ఆశించిన ధరలు లేక లాభాలు లేకపోవడం. ఎప్పుడు ఏ భూమిలో ఏ పంట వేయాలో రైతుకు అవగాహన లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా ఉన్నది. ప్రభుత్వం దీనిపైనా దృష్టిపెట్టి రైతును చైతన్యం చేస్తున్నది. మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి గాక ఎక్కువమంది ఒకే పంటలు వేయడం వల్ల ధర రావడం లేదు. కూరగాయలు, ఆహారధాన్యాల్లోనూ ఒకే రకం అవసరాన్ని మించి పండించడం వల్ల ధర రాక రైతు నష్టపోతున్నాడు. వీటన్నిటికీ పరిష్కారం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు.

మట్టి పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట దిగుబడి బాగా వస్తుందో చూసి పంటవేయాలి. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. మంచి దిగుబడి వస్తుంది. మానవ శరీరానికి రోజూ ఒకే కూర, ఒకే తీరు అన్నం మాత్రమే తింటే కావాల్సిన పోషకాలు లభించనట్టే ఒకే పంట ఏండ్ల తరబడి వేయడం వల్ల భూసారం పెరగదు. ఈ విషయాన్నే నొక్కిచెప్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి కందులు, పత్తి అధికంగా పండించాలని కేసీఆర్‌ చెప్పడంలోని ఆంతర్యం ఇదే. రైతును నష్టాల బారి నుంచి కాపాడ టానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరికొత్త వ్యవసాయ విధానా లను అమలుచేస్తున్నారు. 

రైతులకు పెట్టుబడి సాయం, సాగునీరందించడం, పంట మార్పిడి ద్వారా మంచి వస్తుంది.మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి పంటలు వేయాలనడం, మంచి విత్తనాలు సరఫరా చేయడం, పంటను ప్రభుత్వమే కొని రైతును ఆదుకోవడం లాంటి అనేక చర్యల ద్వారా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్న కేసీఆర్‌ నిజమైన రైతుబంధు. వీటితోపాటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చడంలో రైతుబిడ్డ కేసీఆర్‌ నిర్విరామ కృషి చేస్తున్నారు. పంటమార్పిడి, మిశ్రమ పంటలు వేయడం శాస్త్రీయ ఆధునిక వ్యవసాయ పద్ధతి. ఇది పంట దిగుబడి ఫలితాలను మార్చి వ్యవసాయాన్ని పండుగగా మారుస్తుంది.


logo