బుధవారం 12 ఆగస్టు 2020
Editorial - Jul 07, 2020 , 22:30:21

తాళాలు తీశారు

తాళాలు తీశారు

(ఫైజాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ కే.కే.కే.నాయర్‌ యూపీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి భగవాన్‌ సాహే గారికి రాసిన లేఖ కొనసాగింపు)

  • మూడో అధ్యాయం కొనసాగింపు...

నిజమే. పూర్వపు స్థితిని పునరుద్ధరించటం యోగ్యమైన విషయమే. అయితే దానిని మనం సంతృప్తిని తెచ్చే ఓ దివ్యమైన కీర్తికి ఆలవాలం చేయరాదు. ఇన్నాళ్లూ నేను ఘటనా స్థలంలోనే ఉంటూ ఏ విధమైన సహాయ సహకారాలు లేకుండా పరిస్థితిని చక్కదిద్దుకుంటూ వస్తున్నా. ఇవ్వాళ వాళ్లు బయట ఇస్తున్న నినాదమేమంటే ‘నయా అన్యాయ్‌ కర్నా ఛోడ్‌ దో- నాయర్‌, భగవాన్కా ఫాటక్‌ ఖోల్‌ దో (నూతనంగా అన్యాయాన్ని చేపట్టకు-నాయర్‌! భగవంతుని తలుపులు తెరుచుకోనీ) నేనీ ద్వేషభావాన్ని సంయమనంతో, ఆవేదనకు దూరంగా భరిస్తూ వస్తున్నా. అయితే నిత్యం నన్ను తిడుతూ నన్నూ మొత్తం అధికార యంత్రాంగాన్ని బాగా ఇరుకున పెడుతున్న ఈ గుంపు పట్ల ఎందుకు సుతిమెత్తగా వ్యవహరించాలో అర్థం గాకుండా ఉంది. ఇంత జరుగుతున్నా నేనింకా శాంతి వచనాలే ఎందుకు వల్లిస్తున్నానంటే ఈ చట్ట వ్యతిరేక చర్యల వల్ల సంభవించిన పరిస్థితిలోని తీవ్రతను, చిక్కును, స్థితిని ప్రభుత్వం కంటే తక్కువగా అనుభవించటం వలన కాదు. ప్రాణహాని, ఆస్తి నష్టం వాటిల్లకుండా, శాంతికి, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన చెలరేగకుండా ఉండేందుకే నేనిలా చెప్పటం.

విగ్రహం అనేది తొలగించటాన్ని పోలీసు సూపరిండెంట్‌గాని, నేను గాని అంగీకరించజాలం. మా అంతట మేము చొరవ తీసుకొని ఆ పనిని నిర్వహింపజాలం. దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి నేను సూచించిన దాని ప్రకారమైతే శాంతిని, ప్రభుత్వ విధానాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిష్కారాన్ని ప్రభుత్వం అంగీకరింపజాలక విగ్రహాలను తప్పక తొలగించాలనే నిర్ణయానికి వచ్చి దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధమైతే ఆ పనిని ప్రభుత్వ విశ్వాసాన్ని కోల్పోయిన నా వంటి వానిపై ఆ బాధ్యత పెట్టటం సరైన ప్రభుత్వ నిర్ణయం కాబోదనీ, దాని అవసరమూ లేదని, ఆ సలహా ఇవ్వతగినది కాదనీ, చట్ట సమ్మతమూ కాదని భావించే నా వంటి వానికి ఆ పనిని అప్పగించరాదు. ఒకవేళ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనయినా సరే విగ్రహాన్ని తొలగించాలనే నిర్ణయానికి వచ్చి ఉన్నట్లయితే నా వివేచనకు అందని మంచిని గ్రహించగల అధికారిని నా స్థానంలో నియమించి నన్ను ఈ బాధ్యతల నుండి తప్పించవలసినదిగా మనవి.

తమ విశ్వసనీయుడు కే.కే.కే.నాయర్‌, ఐ.పీ.యస్‌.

ఈ ఉత్తరాల వల్ల కోరుకున్న ఫలితం దక్కింది. అప్పట్లో నాయర్‌ వ్రాసుకుంటున్న అధికారిక దినచర్యలో ఆయన ఇలా వ్రాసుకున్నారు. ‘ఉదయం భగవాన్‌ సాహే టెలిఫోన్‌ చేసి నా లేఖలు అందినట్లు తెలియజేసి పరిస్థితి వాటిల్లో తెలియజేసిన విధంగా ఉంటే విగ్రహాలను తొలగించేందుకు వత్తిడి చేయబోమన్నారు. అయితే జరిగిన పని సవ్యమైనదేనని ప్రభుత్వం అంగీకరించజాలదనే భావనను ప్రచారంలోకి తీసుకురావలసి ఉందన్నారు. నేను సూచించిన పరిష్కారం దిశగా కూడ ముందుకు సాగమన్నారు.’

పీవీ-అయోధ్య

రెండవ లేఖ వ్రాసిన రోజు నుండే అందులోని సలహాలకు అనుగుణంగా పరిస్థితుల్లో మార్పులు ప్రముఖంగా కన్పిం చసాగాయి. 1949 డిసెంబరు 28న ఆ యాత్రా స్థలం సీ.పీ.సీ లోని 145వ సెక్షనుకు అను గుణంగా జప్తు చేయబడింది. అప్పటి మున్సిపల్‌ బోర్డు ఛైర్మన్‌ ప్రియాదత్‌ రామ్‌ ఆ ఆస్తికి రిసీవరుగా నియమింపబడినారు. జప్తు కాలంలో వివాదంలో ఉన్న ఆస్తి నిర్వహణకు సంబంధించిన పథకాన్ని సమర్పించమని కోరటం జరిగింది.

కేంద్ర మంత్రి వల్లభాయ్‌ పటేల్‌ ఈ విషయాన్ని లక్నోలో వున్న ముఖ్యమంత్రితో చర్చించారు. ఇక్కడి పరిణామాల పట్ల తమ ఆందోళనను వెలిబుచ్చుతూ తంతి పంపటం జరిగింది. 1950 జనవరి 9న సర్దార్‌ పటేల్‌ పంత్‌కు జాబు వ్రాస్తూ దాడులు, బలప్రయోగాల వంటి ధోరణులపై ఆధారపడిన ఏకపక్ష నిర్ణయాలను సహించేది లేదని తెలియజేశారు. పరిస్థితులు క్షీణిస్తున్న దృష్ట్యా ఉత్పన్నమయ్యే పరిణామాల్ని గూర్చి పంత్‌ చాలా ఆందోళన చెందసాగారు. జనవరి 13న ఆయన సర్దార్‌ పటేల్‌కు ప్రత్యుత్తరం వ్రాస్తూ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు కృషి కొనసాగుతున్నదనీ విజయావకాశాలకు ఆస్కారమున్నదని తెలియజేశారు. అయినా వ్యవహారం ఇంకా ప్రమాదం అంచునే ఉందనే విషయాన్ని నొక్కిచెప్పారు.

అయోధ్య 1986: తాళాలు తీశారు (నాలుగో అధ్యాయం)

అయోధ్యలోని స్థానికులు బాబ్రీ మసీదులో రాముడు ‘ప్రత్యక్షమైన’ రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరము ‘రామ్‌ ప్రాకట్‌ ఉత్సవ్‌' పేరిట వేడుకలు జరుపుకుంటారు. అందులో కొద్ది వందల సంఖ్యలో ప్రజలు పాల్గొనేవాళ్లు. హిందూ పంచాగం ప్రకారం ఆ ఉత్సవం తేదీని నిర్ణయించేవాళ్లు. వివాదాస్పద కట్టడపు మధ్య గుమ్మటంపై హనుమంతుని జండా తొలిసారి ఎగురవేయ బడుతున్నదని తెలియటంతో రామ్‌ ప్రాకట్‌ ఉత్సవ్‌ 34వ వార్షికోత్సవం 1984 జనవరి 4న అత్యంతోత్సాహంతో నిర్వహింపబడింది. ఆ వార్త దావానలంలా వ్యాపించటంతో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గర్భ గుడిలో తొలిసారిగా నిర్వహించిన హవన్‌ (హోమం)లో అయోధ్యలో పేరెన్నికగన్న మహంతులందరూ పాల్గొన్నారు. అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నాయకత్వం ఆ వ్యవహారంలోని రాజకీయశక్తిని గుర్తించింది. ఫైజాబాద్‌లోని ఆర్‌.యస్‌.యస్‌ క్రియాశీల కార్యకర్తల ద్వారా ఆ సంవత్సరం వేడుకలకు సంయోజకునిగా వ్యవహరించిన ధీరేంద్ర సింగ్‌ జఫా (పదవీ విరమణ చేసిన వింగ్‌ కమాండర్‌)ను ఢిల్లీలోని ఝండేవాలాలోని ఆర్‌.యస్‌.యస్‌ కేంద్ర కార్యాలయం నుండి నాయకులు సంప్రదించారు. అయితే ఆ సంప్రదింపులు ఫలించలేదు. ఆ తరువాత మూడు మాసాలకు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)కు చెందిన ధరమ్‌ సంసద్‌ సమావేశం 1984 ఏప్రియల్‌ 7, 8 తేదీల్లో నిర్వహించబడింది. ఆ సమావేశంలో అయోధ్య మందిరంతో పాటు మధురలోని కృష్ణ జన్మభూమి, వారణాసి జ్ఞానవాటిలోని విశ్వనాథ మందిరాల విముక్తి కోసం ఉద్యమాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు.

(మాజీ  ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo