గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 07, 2020 , 00:12:31

మనకాలపు మహోద్యమం

మనకాలపు మహోద్యమం

1492లో మూడు ఓడలతో వెళ్లి ఏమీ దొరకని కొలంబస్‌ 1495లో ఏదో ఒకటి తేవాలని 17 ఓడలతో వెళ్లి స్థానికులను పెద్ద ఎత్తున చెరబట్టి బానిసల తరహాలో ఉపయోగించుకున్నాడు. చివరకు 500 మందిని నిజంగానే బానిసలుగా మార్చి తీసుకుపోయాడు. వెస్టిండీస్‌ నుంచి నిసల వ్యాపారానికి అది ఆరంభం. కాని అంతకు 50 ఏళ్ల క్రితమే పోర్చుగీస్‌, స్పానిష్‌ వర్తకులు ఆఫ్రికా నుంచి పెద్ద ఎత్తున నల్లవారిని బానిసలుగా లాటిన్‌ అమెరికా, కరిబ్బియన్‌లకు తరలించటం మొదలుపెట్టారు. ఇది ఎంత భయానకంగా సాగిందో, నల్లవారి హత్యలు, మరణాలు, శ్రమ దోపిడీలు, వివక్షల చరిత్ర అది.

నల్లజాతి పౌరుడు ఫ్లాయిడ్‌ జార్జ్‌ హత్య జరిగిన ఆరు వారాల తర్వాత కూడా పాశ్చాత్య దేశాలలో శ్వేతజాతి ప్రముఖుల విగ్రహ విధ్వంసాలు కొనసాగుతున్నాయంటే, అక్కడ వందల సంవత్సరాలు సాగిన బానిస వ్యాపారాల పట్ల, ఇప్పటికీ ఆగని వర్ణ వివక్ష పట్ల ఎంతటి తీవ్రమైన వ్యతిరేకత పేరుకుపోయి ఉన్నదో గ్రహించవచ్చు. ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగినప్పుడు నిరసన ప్రదర్శనలు చెలరేగాయి గాని విగ్రహ విధ్వంసాలు ఈ తీరున సాగటం ఇది మొదటిసారి కావటం గమనార్హం. కరోనా విలయం వల్ల మన వద్దకు చర్చకు రాలేదు గాని, దీనిని మనకాలపు శక్తిమంతమైన ఉద్యమాలలో ఒకటిగా పరిగణించవలసి ఉంటుంది. 

ఉద్యమ వార్తలు ఎంతో కొంత ఇప్పటికే వస్తున్నందున ఆ వివరాలను చూసేముందు, నల్లజాతి వారిలో ఇంత ఆగ్రహానికి కారణమైన వందల సంవత్సరాల నేపథ్యాన్ని కొంత తెలుసుకోవటం అవసరం. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య అమెరికాలో జరిగింది గాని చరిత్రలో బానిస వ్యాపారం అమెరికాతో మొదలుకాలేదు. స్పెయిన్‌కు చెందిన క్రిస్టఫర్‌ కొలంబస్‌ 1492లో ఆసియాకు వచ్చేందుకని బయలుదేరి పొరపాటున వెస్టిండీస్‌లోని బహామా దీవులకు చేరాడు. వెళ్లింది బంగారం కోసం కాగా అక్కడి ఆరావాక్‌ తెగ గిరిజనులు ఇతర కానుకైలేత ఇచ్చారు గాని తమవద్ద లేని బంగారాన్ని తేలేకపోయారు. తమకన్న ముందు వెళ్లిన మార్కోపోలో బంగారం తేగా తమకు దొరకకపోవటం ఏమిటనుకున్నారు.

అయితే మార్కోపోలో చేరింది ఆసియాకకు కాగా కొలంబస్‌ పడవలు బహామాస్‌ వైపు పోయాయి. మొత్తానికి 1492లో మూడు ఓడలతో వెళ్లి ఏమీ దొరకని కొలంబస్‌ 1495లో ఏదో ఒకటి తేవాలని 17 ఓడలతో వెళ్లి స్థానికులను పెద్ద ఎత్తున చెరబట్టి బానిసల తరహాలో ఉపయోగించుకున్నాడు. చివరకు 500 మందిని నిజంగానే బానిసలుగా మార్చి తీసుకుపోయాడు. వెస్టిండీస్‌ నుంచి బానిసల వ్యాపారానికి అది ఆరంభం. కాని అంతకు 50 ఏళ్ల క్రితమే పోర్చుగీస్‌, స్పానిష్‌ వర్తకులు ఆఫ్రికా నుంచి పెద్ద ఎత్తున నల్లవారిని బానిసలుగా లాటిన్‌ అమెరికా, కరిబ్బియన్‌లకు తరలించటం మొదలుపెట్టారు. ఇది ఎంత భయానకంగా సాగిందో, నల్లవారి హత్యలు, మరణాలు, శ్రమ దోపిడీలు, వివక్షల చరిత్ర ఇక్కడ రాయలేము. ఈ దుర్మార్గంలో అనేక యూరోపియన్‌ దేశాలు పాల్గొని నల్లవారిని పెద్ద సంఖ్యలో యూరప్‌ ఖండంలోనూ బానిసలుగా ఉపయోగించుకున్నాయి.

అమెరికా విషయానికి వస్తే, యూరోపియన్లు ఉత్తర అమెరికాలో వలసలు నెలకొల్పటం మొదలైన తర్వాత వర్జీనియా కాలనీలోని జేమ్స్‌ టౌన్‌కు 1619లో ఒక డచ్‌ వ్యాపారి ఓడలో 20 మంది నల్లజాతి బానిసలను తెచ్చాడు. అమెరికాలో బానిసల ఉపయోగం, అక్కడికి వ్యాపారం ఆ విధంగా మొదలయ్యాయి. ఆహారపు పంటలకు, పత్తి, పొగాకు వంటి వాణిజ్య పంటలకు అవసరమైనా కొద్దీ లక్షలాది మంది బానిసల దిగుమతి జరిగింది. ఒక అంచనా ప్రకారం ఆ శతాబ్దాలలో దాదాపు అయిదు కోట్ల మంది ఆఫ్రికన్లను యూరప్‌కు, దక్షిణ, ఉత్తర అమెరికాలకు తరలించారు. వారిలో మూడవ వంతు మంది అసహజమైన కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. గమనించదగిన మరొక పార్శం ఏమంటే, ఈ బానిస విధానం నల్లవారి రంగు కారణంగా తీవ్రమైన వర్ణ వివక్షకు దారితీసింది. ఒకవైపు అమెరికా, యూరప్‌లు పారిశ్రామిక, వైజ్ఞానిక రంగాలలో నాగరికతలో ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తున్నాయన్న కాలంలోనే ఇదంతా జరిగింది.

తర్వాత క్రమంగా అమెరికా స్వతంత్ర దేశమైంది. అక్కడ, యూరప్‌లో బానిస చట్టాలు రద్దయ్యాయి. నల్లవారి ఉద్యమాల వల్ల పౌరహక్కుల చట్టాలు కొన్ని వచ్చాయి. కాని వాస్తవంలో జరిగింది అతి స్వల్పం. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను 1776లో స్వయంగా తయారుచేసి బానిస పద్ధతికి వ్యతిరేకంగా రాసిన అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ వద్ద తన జీవితాంతం వందలాది మంది నల్ల బానిసలు కొనసాగారు. 1860లో అబ్రహాం లింకన్‌ అధ్యక్షుడై బానిసల ఉపయోగాన్ని వ్యతిరేకించటంతో 11 దక్షిణాది రాష్ర్టాలు తిరుగుబాటు చేసి, అమెరికన్‌ యూనియన్‌ నుంచి విడిపోయి, కాన్ఫెడరసీగా ఏర్పడ్డాయి. చివరకు కాన్ఫెడరసీ ఓటమితో బానిసత్వమైతే సాంకేతికంగా పోయింది గాని, నల్లవారి పట్ల వివక్ష, వారి పేదరికం అట్లాగే కొనసాగాయి. దక్షిణ రాష్ర్టాల వారు కూక్లక్స్‌క్లాన్‌ వంటి తీవ్రవాద శ్వేతజాతి సంస్థల ద్వారా నల్లవారిపై హత్యాకాండ సాగించారు. వివక్షలు, దాడులూ ఎప్పుడూ ఆగలేదు. రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలు ఎన్నడూ చిత్తశుద్ధి చూపలేదు. ఒబామా సైతం విఫలమయ్యారు. అప్పటికే మార్టిన్‌ లూథర్‌కింగ్‌ వంటి శాంతియుత గాంధేయ ఉద్యమకారుడు కూడా హత్యకు గురయ్యాడు.

ఈ విధమైన వందల ఏండ్ల బానిసత్వ, అణచివేత, దోపిడీ, హత్యాకాండల చరిత్ర, ఆగని వివక్షలు, తెల్లవారి దురహంకారం ఒక అంతులేని నేపథ్యంగా నల్లజాతిని కలచివేస్తున్నందువల్లనే మే 25న అమెరికాలోని మిన్నియా పోలీస్‌లో జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఒక తెల్ల పోలీసు చేతిలో హత్యకు గురికావటం అమెరికాలోనే గాక యూరప్‌ నుంచి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల వరకు నిరసనల అగ్నిపర్వతాన్ని బద్దలు చేసింది. కొలంబస్‌, జెఫర్సన్‌, దక్షిణాది కాన్ఫెడరసీ నాయకులు, విన్‌స్టన్‌చర్చిల్‌ మొదలుకొని దేశదేశాలలో అనేకుల విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. ఆస్ట్రేలియాను వలసగా మార్చిన జేమ్స్‌ కుక్‌, న్యూజీలాండ్‌లో మావొరీ తెగలపై దమనకాండ జరిపి బ్రిటన్‌కు వలస రాజ్యం చేసిన ఛార్లెస్‌ హామిల్టన్‌ల విగ్రహాలను, ఇంకా పాశ్చాత్య దేశాలన్నింటా అనేకుల విగ్రహాలను ప్రభుత్వాలు గోడన్లకు తరలించివేసాయి. కొన్నిచోట్ల కంచెలు కట్టడం, ముసుగులు వేయటం చేస్తున్నాయి.

జాతి వివక్షకారులు, బాసిన వ్యాపారుల పేర్లతో గల వీధులు, పలు సంస్థల పేర్లను అనేక చోట్ల మార్చివేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో నల్లవారి ఉద్యమాన్ని బలపరచక వారిని విమర్శించినట్లు అపవాదు గల గాంధీజీ (తన అభిప్రాయాన్ని ఆయన తర్వాత మార్చుకున్నారు) విగ్రహం సైతం ఇందుకు మినహాయింపు కాలేదు. న్యూజీలాండ్‌లో మావొరీల వలె ఆస్ట్రేలియాలో ఆదిమ తెగలు నిరసన ప్రారంభించాయి. మిసిసిపీలో కాన్ఫెడరసీ చిహ్నం గల జెండాను, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ఒక కాలేజీకి గల మాజీ అధ్యక్షుడు వుడ్రో విల్సన్‌ పేరును మార్చివేశాయి. తాజాగా కోపెన్‌హేగన్‌లోని సుప్రసిద్ధ లిటిల్‌ మెర్‌మేడ్‌ విగ్రహానికి ‘రేసిస్ట్‌ ఫిష్‌' అంటూ నల్ల రంగు పూశారు. ట్రంప్‌ తదితర పాశ్చాత్య ప్రభుత్వాధి నేతలలో కొందరు, ఎప్పుడో జరిగిపోయిన చరిత్రపై ఇటువంటి దాడులు తగవని నీతులు చెప్తున్నారు. కాని వర్ణ వివక్షలు ఇంకా కొనసాగుతున్న చరిత్రగా ఉండటమే సమస్య అవుతున్నదని వారికి నిజంగా తెలియదా? అందుకు జవాబు మాత్రం ఇవ్వరు.  logo