ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 06, 2020 , 00:15:40

భాగవత సంప్రదాయంజాతీయ సమైక్యత

భాగవత సంప్రదాయంజాతీయ సమైక్యత

ఓరుగల్లులో 1982 మార్చి 14న పోతన పంచశతి ఉత్సవాలకు యావద్భారత దేశం నుంచి అనేక మంది పండిత ప్రకాండులు హాజరయ్యారు. ఈ సాహితీ గోష్ఠిలో పరిశోధనా పత్రం సమర్పించవలసిందిగా సాహితీ దిగ్గజం పీవీ నరసింహారావును నిర్వాహకులు ఆహ్వానించారు. విదేశాంగ మంత్రిగా కార్యభారంతో సతమతమవుతున్న పీవీకి పరిశోధనాపత్రం రూపొందించేంత వ్యవధి చిక్కలేదు. కానీ అలవోకగా చేసిన ప్రసంగమే అతడి అసాధారణ పరిశోధనా పటిమను ప్రస్ఫుటించింది. ప్రాచీనకాలం నుంచి దేశ సమైక్యతకు అంతస్సూత్రంగా ఉన్న సంస్కృత భాష ఆ స్థాయిని కోల్పోతున్న సందర్భంలో మన ఇతిహాస, కావ్యాలు ఆ శూన్యాన్ని భర్తీ చేసి భావసమైక్యతను సాధించిన పరిణామక్రమాన్ని ఆయన భాగవతం కేంద్రంగా అత్యంత సులభశైలిలో ఆవిష్కరించారు. 

భాగవత ఔన్నత్యంపై పీవీ నరసింహారావు ప్రసంగ పాఠం సంక్షిప్తంగా...

భాగవతంలో కథానికలున్నయి, ఆఖ్యాయికలున్నయి, చరిత్ర.. ఇంకా ఎన్నో అంశాలున్నయి. ఇది మానవ జీవితానికి ఎంతవరకు సంబంధించింది? దీనిద్వారా భాగవతకర్త ఇవ్వదలచిన సందేశమేమిటి? అనే అంశాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. భాగవతాన్ని పండితులు, భావుకులు అనేక దృక్కోణాలతో వ్యాఖ్యానించినారు. ఆది భాగవతం విశ్వతోముఖత్వాన్ని స్పష్టపరుస్తున్నది. ‘ఓయమ్మ! నీ కుమారుడు, మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మా...’ వంటి హృదయంగమమైన, అతి సుకుమారమైన, సులభమైన పద్యం మొదలుకొని పండితులు రకరకాల వాదాలు సాగించే జటిలాతి జటిలమైన గహనాతి గహనమైన నిగూఢార్థాలుగల పద్యాల వరకూ విస్తరించింది భాగవతం. ఇంతటి ఈ భాగవతం ప్రజాపరమైపోయింది. అది ఎట్లా ప్రజాపరమైపోయిందో, పరిధులను అధిగమించి విస్తరించిందో గమనించవలసి ఉంది. 

ప్రాచీన కాలం నుంచి సంస్కృత భాష జన మాధ్యమంగా భారతదేశాన్ని ఏకీకరించటానికి ఉపకరించింది. కానీ కాలం గడిచినా కొద్దీ, ఈ భాష ఏకతను నిర్వహింపజాలదేమోననిపించిన సందర్భంలో ఆ భాష ద్వారా అందింపబడిన వస్తువు ప్రాంతీయ భాషల ద్వారా అందించబడింది. భాషా సమైక్యత కొంత బలహీనమైనప్పుడు వస్తు సమైక్యత ఆ స్థానాన్ని పూరించింది. అదే రామాయణం, అదే మహాభారతం, అదే భాగవతం... ఆయా భాషల్లో చెప్పబడినయి. దీనివల్ల భాషా సమైక్యత, వస్తు సమైక్యత అనే రెండు రకాల సమైక్యతలు పోయి ఒకే విధమైన సమైక్యత వస్తురూపంగా వచ్చింది. ఎవరి భాషలో వారు చెప్పుకున్నారు గాని, చెప్పుకున్నది మాత్రం ఒక్కటే. ఒకే భాషలో గూడా రకరకాలుగా చెప్పుకున్నారు. జనజాతుల భాషలు, గిరిజన భాషలు.. ఇన్నిన్ని రకాల భాషల్లో భారత, భాగవత, రామాయణ గాథలు ప్రయాణం చేసినయి. ఈ  విధంగా వస్తు సమైక్యతను సాధించిన మహాకావ్యాల్లో భాగవతానికి ప్రముఖ స్థానం ఉంది. 

జెనీవాకు అరవై మైళ్ల దూరంలో  గోలుకొండ దుర్గం వంటి  జైలున్నది. ఆ జైలులో ఒక సెల్‌లో లార్డ్‌ బైరన్‌ కూర్చొని ఏవో కవితలు రచించాడని అంటారు. ఆ స్థలాన్ని సంస్కృతీ క్షేత్రంగా వారు మలచుకొన్నారు. 

మాకన్నా ముందుతరం వరకు భాగవతంలోని అనేక పద్యాలు జనుల నాలుకలపై నాట్యం చేస్తుండేవి. మా అమ్మ గారికి రుక్మిణీ కల్యాణం పూర్తిగా కంఠాపాఠం. ఆమె పెద్దగా చదువుకొన్నది కాదు. ఆ మాటకొస్తే ఇంతకన్నా వేరే ఏం చదువు కావాలి. మా నాన్న గారికి భాగవతంలో వరసగా దాదాపు రెండు వేల పద్యాల దాకా కంఠపాఠమే. వారు రాత్రిళ్లు భోజనాల తరువాత చిన్న పిల్లలమైన మమ్మల్ని మీద పడుకోబెట్టుకొని ఆ పద్యాలన్నీ చదువుతూ ఉంటే, వినుకలితో మాకూ చాలా పద్యాలు కంఠస్థమయ్యేవి. ఇది ఏ ఒక్క ఇంటి విషయమో కాదు. దేశమంతా ఇంతే. ఇంటింటికీ భాగవతం ప్రవహించింది. ఇంతమంది మనస్సులను తీర్చిదిద్దింది. మరి జాతీయ సమైక్యత, మానవ సమైక్యత, సామాజిక సమైక్యత సాధించటమంటే వేరే ఇంకేముంటుంది ! అయితే దీన్నంతా ఎవరి పరిస్థితులను బట్టి, అనుభవరీతులను బట్టి, ప్రాంతీయ లక్షణాలను బట్టి వారు హృదయంగమం చేసుకున్నారు.

మనుష్య స్వభావాల్లో ఎంత వైవిధ్యమున్నదో చూడాలంటే, భాగవతంలోని గోపికల వ్యక్తిత్వాలను గమనిస్తే సరిపోతుంది. ఉద్ధవుడు గోపికల వద్దకు వచ్చినప్పుడు వారి సంభాషణ అనే చిన్న ఘట్టం తీసుకుని హిందీలో ఎంతో సాహిత్యం వచ్చింది.

రెండు మూడు వందల సంవత్సరాల వరకు కవులకు ఆదే కావ్య వస్తువైంది. ఉద్ధవుడు నిర్గుణ పరబ్రహ్మతత్తాన్ని బోధిస్తే, గోపికలు నిర్గుణ కౌన్‌ దేశ్‌ కా బాసీ- నిర్గుణుడు ఏదేశ నివాసి? ఆంటూ సగుణోపాసన వైపుసాగుతారు. తమ భగవద్విరహాన్ని రకరకాలుగా వ్యక్తం చేస్తారు. సూరదాస్‌ రచనలో ఈ అంశాలు ఎంతో హృదయంగమంగా చిత్రించబడినయి. సంస్కృత భాగవతానికి సూరసాగర్‌కి ఎంతో తేడా ఉంది. మరి, ఇదెట్లా వచ్చింది? భాగవత గాథలు ప్రజాపరమై, ప్రజల హృదయాల్లోంచి వారి అనుభవాలకు, అనుభావాలకు సహజాతా వ్యంజనంగా, సాహిత్యం జనుల వాగ్వీధుల్లో ప్రవహించి ఉంటుంది. ఆదే సూరదాస్‌లో ఆ విధమైన చిత్రణకు అవకాశం కలిగించింది. దశమ స్కంధంలోని అనేక ఘట్టాలను హిందీలో ‘అష్ట ఛాప్‌' పేరుతో ప్రసిద్ధులైన ఎనమండుగురు కవులు రకరకాలుగా హృదయంగమంగా చిత్రించటంలోని తీరు ఆ ఘట్టాల ప్రజాపరత్వాన్ని పట్టిస్తుంది. 

జయదేవుని అష్టపదులూ కృష్ణలీలా వర్ణనమే. నారాయణ తీర్థులవారి తరంగాలూ కృష్ణలీలా వర్ణనమే. కానీ జయదేవుని ఆష్టపదుల్లో ఉత్థానమైన శృంగారం కనిపిస్తే నారాయణ తీర్థులవారి తరంగాల్లో ఆధ్యాత్మికత దర్శనమిస్తుంది. ఉపరితలంలో కనిపించే వ్యత్యాసం మౌలికంగా లేదు. అష్టపదుల్లోని శృంగార స్వభావాన్ని అవగాహన చేసుకోలేని అనేక మంది పాశ్చాత్యులు అపవ్యాఖ్యానాలు చేశారు. కానీ, ఆ పాశ్చాత్యుల్లోనే కొందరు అవగాహన చేసుకున్న వారు తమ సాలమన్‌ సాంగ్స్‌లో కనిపించే రీతిని, భక్తిని శృంగార రూపంలో చిత్రించే విధానాన్ని మౌలికంగా అర్థం చేసుకున్న వారు కాబట్టి, అష్ట పదుల వైశిష్ట్యాన్ని అభినందించారు. అందరికీ భిన్నమైంది మీరాబాయి తరహా. ఆమె ధోరణే వేరు.. భగవంతుడే తన కన్నీ. తానే భగవంతుడికన్నీ అని అంటుందామె. ‘మేరేతో గిరిధర గోపాల్‌.. దూ స్‌రే న కోయీ’ అంటూ ఆత్మార్పణ పూర్వకంగా పారవశ్య మార్గాన పయనిస్తుంది. అనుభవ పరంగా భాగవతంలోని వివిధాంశ భావనలో ప్రజా హృదయవీధుల్లో ఇంతటి వైవిధ్యం మౌలికమైన ఏకభావన మీద విస్తరించింది. సృష్టి రహస్యాలు, పరిణామ విధానం, ఖగోళ విషయాలూ, వేదాంత భావనలూ, సామాజిక రాజకీయ ధర్మాలూ, నీతులూ, ప్రవృత్తులు, పురాతత్త్వం... ఇట్లా ఎన్నో అంశాలు.. కలగలసి భాగవతం; భగవంతుడికి సంబంధించిన ఈ సృష్టిలోని వైవిధ్యమంతా అందులో ఉంది. ఆ మహాసముద్రంలోంచి మనం ఎంత తెచ్చుకోగలం, తెచ్చుకోగలుగుతున్నామనేది చూచుకోవలసి ఉంటుంది.

మన బుద్ధిని, చైతన్యాన్ని, అవగాహనను, శక్తిని బట్టి, మనం దాన్ని ఏ దృష్టితో సమీపిస్తున్నామనే దాన్ని బట్టి ఎవరి తాహతులో వారు దాన్ని అనుభవిస్తున్నారు, ప్రబోధిస్తున్నారు. ఆసేతు హిమాచలం ఈనాటికీ ఈ కావ్యధార, ఈ భావధార, ఈ భాగవత సంప్రదాయధార ప్రవహించని ప్రాంతమంటూ లేదు. ఇందులో సంగీత సాహిత్యాలు కలిగలిసిపోయినయి. ప్రజా కళారూపాలన్నీ ఈ ధారతో ఓతప్రోత మయినయి. భారతీయ మహాకవులలో అనేక మంది శైవులే అయినా, వారిలో చాలామంది భాగవతోత్తములై శ్రీమద్భాగవత గాథాగానం చేసారు. ప్రజలు వారిని గౌరవించారే తప్ప శైవులై విష్ణు గాథాగానం చేసినందుకు విమర్శించలేదు. ఈ రామకృష్ణులను అవతారమూర్తులుగా - రాముడు మర్యాద పురుషోత్తముడనీ, కృష్ణుడు లీలా మానుష విగ్రహుడనీ, పారమార్థికంగా ఇద్దరూ.. వీరితోబాటు శివుడు, అందరూ ఒకటేననీ కవులూ, తాత్త్వికులూ, ప్రజలు - అందరూ భావించారు. శ్రీరాముడు లంకకు వెళ్తూ శివ ప్రతిష్ఠ చేసి పూజించినట్టు తులసీదాసు రచించినాడు. ఉపరితల దృశ్యమానమయ్యే భేదాలు నిజమైనవి కావనీ - తాత్త్వికంగా ఏకత్వమే పరమార్థమని అవగాహన చేసుకొని, ఆ అవగాహన అందరికీ కలిగించి ఏకత్వం నిరూపించాలని వారావిధంగా రచించి ఉద్బోధించారు. వారిది సమన్విత వ్యక్తిత్వం. ఈ సమన్విత వ్యక్తిత్వమే ఈ దేశంలో అంతటా వ్యాపించి ఉంది. జాతీయ సమైక్యతను ప్రోదిచేసింది. 

మనం మన చరిత్రను చెబుతున్నామంటే ఏదో వెనుకటి నిజాం పరిపాలన రావాలన్నట్టు కొందరు భ్రాంతి పడుతున్నారు. అది అజ్ఞానం. మనం ప్రజాస్వామ్య విధానం స్వీకరించాము. దీన్ని రక్షించుకోవటానికి అన్నివిధాలా ఉద్యుక్తులమై ఉన్నాము.ఈ విధమైన ప్రజాస్వామ్యం పూర్వం ఉండకపోవచ్చు. కానీ, ఆ నాళ్లలో ఏముందో తెలుసుకోవటం అవసరం. 

ఇందరిలోనూ పోతనగారిది విశిష్ట వ్యక్తిత్వం. ఆయన జీవిత రీతిని గమనిస్తే అట్లాంటి అపురూపమైన వ్యక్తిత్వం గలవాడు మరొకడున్నాడో లేడోననిపిస్తుంది. ఆ కాలంలో రాజాశ్రయమనేది సర్వసామాన్య విషయం, అందరూ కాంక్షించిందే. నిషిద్ధ విషయంగా ఎవరూ అనుకున్నట్లు కన్పించదు. నాటి రాజులు గూడా కవుల్ని విశిష్టంగానే గౌరవించారు. తమను గూర్చి ఆద్యంతాల్లో అంతో ఇంతో ఉన్నా ఆ కవులు ఏ విషయం ప్రతిపాదిస్తున్నారు? దాని ఉపయోగిత ఏమిటి అని విచారించారు. దాన్నిబట్టే ఆయా కావ్యాలను అంకితం పుచ్చుకోవటం మహా విషయంగా భావించారు. అందుకని రాజాశ్రయం అంత చెడ్డదిగా ఆనాడు అనుకున్నట్టు లేదు. అయితే, పోతనగారికి అదెందుకో నచ్చలేదు. ఆయన కది ఎవరో చెప్పింది కాదు. ఆయన నల్ల జండాలేవో పట్టుకొని ఒక ఉద్యమం నడిపించాడనీ కాదు. కాని యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ థాట్‌ ఆయనకు వచ్చింది.

ఈ రాజులకు తన కావ్యం ఎందుకు అంకితమివ్వాలి అనుకొన్నాడు. సమకాలీనుల్లో ఆయన ప్రత్యేకత ఇందులో గోచరిస్తుంది. తన కావ్యాల్ని ఎవరికో ఎందుకు అమ్ముతాడు? అసలు ఆ కావ్యం మీద తనకు ‘ఓనర్‌షిప్‌' ఎక్కడిది? తాను జగద్ధితం కోసం రాసాడు. రాయించినవాడు వేరే ఉన్నాడు. పలికించెడివాడు రామభద్రుండు. తనది కాని దాన్ని తానెట్లా అమ్ముతాడు? ఎవడు రాయించాడో వాడికే ఇవ్వటం మర్యాద, న్యాయం. కాబట్టి ఆయన తన చేత రాయించబడిన భాగవతాన్ని, దానిపై తనకు హక్కు లేదు కాబట్టి ఎవరికో అమ్మటమనే ప్రశ్నే లేదు. అందుకనే అమ్మనన్నాడు. ఆయన భాగవతం సర్వ ప్రజాపరమైందే తప్ప ఏ ఒకరికో అమ్ముడు పోయింది కాదు. ప్రతిదీ ప్రజాపరం, భగవత్పరం కావాలనే ప్రవృత్తి మన సంస్కృతిలో ఈ దేశ వ్యక్తిత్వంలో నిహితమై ఉంది. వ్యక్తిత్వంలోని ఉదాత్తత్వాన్ని బట్టి, చేసిన పనుల వెనుక త్యాగ లక్షణాన్ని బట్టి విలువగట్టటమనే ప్రవృత్తి ఈ దేశంలో అనేక సందర్భాల్లో గమనించవచ్చు. భద్రాచల రామదాసు మొదలైనవారి గాథలు ఇందుకు నిదర్శనం. 


సాహిత్యంలో, కావ్యంలో అనేకమైన కథలుంటాయి. బాహ్యస్వరూపం ఏదైనా, అవి వ్యక్తం చేసే పరమార్థం, ప్రభావం ముఖ్యమైంది. భాగవతంలో అంబరీషుడు, ధ్రువుడు మొదలైన వారి కథలు చూడవచ్చు. రుక్మిణీగాథ ఉందిగదా! ఇక్కడెక్కడో విదర్భ దేశం ఉంది అంటున్నాం. కానీ మేఘాలయలోని షిల్లాంగ్‌ కు చెందిన ఆడబడుచుగా అక్కడివారు భావిస్తున్నారు. అక్కడి నుండి కృష్ణుడు ఆమెను తెచ్చుకొన్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాలు ఈ విధమైన భావనలతో తమ సమైక్యాన్ని రక్షించుకొంటున్నాయి. ఈ వారసత్వాన్ని మనం రక్షించుకోవాలి. అన్ని దేశాలూ తమ వారసత్వాన్ని  రక్షించుకొంటూ ఉత్తేజాన్ని పొందుతున్నాయి. జెనీవాకు అరవై మైళ్ల దూరంలో  గోలుకొండ దుర్గం వంటి జైలున్నది. ఆ జైలులో ఒక సెల్‌లో లార్డ్‌ బైరన్‌ కూర్చొని ఏవో కవితలు రచించాడని అంటారు. ఆ స్థలాన్ని సంస్కృతీ క్షేత్రంగా వారు మలచుకొన్నారు. ఈ స్థితి పెట్టుబడిదారీ దేశాల్లోనే గాదు. సామ్యవాద దేశాల్లోనూ ఉంది. రష్యాలో పీటర్‌ ది గ్రేట్‌ సమ్మర్‌ పాలస్‌ను రోజూ వేలమంది ఇతర దేశీయులేగాదు, ఆ దేశీయులు గూడా  దర్శించి ఉత్తేజం పొందుతున్నారు. ఆనాటి రాజులు, వారి వస్తువులు, ప్రదేశాలు సాంస్కృతిక ఆస్తిగా పరిరక్షిస్తున్నారు. పీటర్‌ ది గ్రేట్‌ను గూర్చి పిల్లలకు వాళ్లు చెబుతారు. వాళ్లకు తమ చరిత్ర, సంస్కృతిని గూర్చిన చైతన్యం ఉంది. ఆ విషయం పిల్లలకు చెబితే మన కమ్యూనిజం ఎక్కడ దెబ్బ తింటుందోనన్న భయం వాళ్లకు లేదు. ఇక్కడ వాళ్లకా భయం ఉన్నట్లుంది. కానీ, అది వట్టి భ్రాంతి. మనం మన చరిత్రను చెబుతున్నామంటే ఏదో వెనుకటి నిజాం పరిపాలన రావాలన్నట్టు కొందరు భ్రాంతి పడుతున్నారు. అది అజ్ఞానం. మనం ప్రజాస్వామ్య విధానం స్వీకరించాము. దీన్ని రక్షించుకోవటానికి అన్నివిధాలా ఉద్యుక్తులమై ఉన్నాము. ఈ విధమైన ప్రజాస్వామ్యం పూర్వం ఉండకపోవచ్చు.

కానీ, ఆ నాళ్లలో ఏముందో తెలుసుకోవటం అవసరం. ఈ దేశాన్ని సమైక్యపరచిన అంశమేమిటో అర్థం చేసుకోవటం అవసరం. మనదేశాన్ని ఆసేతు శీతాచలం సమైక్యం చేసింది మన ప్రాచీన వారసత్వమే! భావసమైక్యత మాత్రమే. ఈ దేశానికి పూర్వం రాజకీయ సమైక్యత లేకపోవచ్చు. పరిపాలనా సమైక్యత లేకపోవచ్చు కానీ, ఈ దేశాన్ని మొత్తంగా ఐక్యంగా ఉంచగలిగింది ఈ వారసత్వమే. బ్రిటిష్‌ వారు వచ్చాకే సమైక్యత వచ్చిందనుకోవటం పొరబాటు. వారు ఇక్కడి సాంస్కృతిక సమైక్యతను విచ్ఛిన్నం చేయ ప్రయత్నించారు. కల్చరల్‌ ఇంపీరియలిజం మనపై రుద్దటానికి ప్రయత్నించారు. విశ్వనాథ సత్యనారాయణగారు తిరుగుబాటు చేసింది దీని మీదనే. ఆయన కాంగ్రెసులో చేరి జైళ్లకు పోలేదు. రాజకీయాల్లో పాల్గొనలేదు. కానీ, రాజకీయ రంగానికి దీటుగా సాంస్కృతిక రంగంలో ఈ కల్చరల్‌ ఇంపీరియలిజానికి విరుద్ధంగా పోరాడినారు. మీ కల్చర్‌ను మా మీద రుద్దకండి. మా ధర్మం మా సంస్కృతి మాది. స్వధర్మే నిధనం శ్రేయః - సత్యనారాయణగారి సర్వ సాహిత్యాన్ని, అయన భావననూ ఈ అంశంతో మనం చూసుకోవచ్చు. 

అనేక దేశాలు ఈ వారసత్వం లేని కారణంగా విచ్ఛిన్నమై పోతాయేమోనని భయపడుతూ, వారసత్వాన్నీ, చరిత్రను సృష్టించుకొనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మనం మన సుదీర్ఘమైన చరిత్రనూ, సంస్కృతినీ, ఉజ్జ్వలమైన వారసత్వాన్ని విస్మరించటం సరైంది కాదు. రాజకీయ సమైక్యాన్ని రక్షించటానికి గూడా ఈ వారసత్వం, ఇది సాధించిన భావ సమైక్యత ఆధారం. దీన్ని విచ్ఛిన్నం చేసుకుంటే మనం ఏమైపోతామో ఊహించలేము. అందుకని మన ఈనాటి స్వాతంత్య్రాన్ని సర్వతోముఖంగా పరిరక్షించుకోవటానికి మనం మన సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోక తప్ప దు. దానివల్ల స్ఫూర్తి పొందక తప్పదు. logo