శుక్రవారం 07 ఆగస్టు 2020
Editorial - Jul 05, 2020 , 00:11:58

భాగవతం...కల్పవృక్షమే!

భాగవతం...కల్పవృక్షమే!

పోతనకు కవిత్రయం అంటే అపారమైన ఆదరం, అభిమానమూను. నన్నయ మీద గౌరవం కొద్దీ ఆయన పద్యచ్ఛాయను అనుసరించినా, తన ‘సహజపాండిత్య’ ప్రతిభను ప్రదర్శిస్తూ అందులోని ‘శ్లేష’ను జోడించి పోతన తన పద్యమనే పసిడిపువ్వును పరిమళ భరితం చేశాడు. శ్లిష్టరూపకం ద్వారా భాగవత పరంగాను కల్పతరు పరంగాను, రెండర్థాలలో అలరించాడు.

“లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం

జులతాశోభితమున్‌, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్‌, సుందరో

జ్జలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై

వెలయున్‌ భాగవతాఖ్య కల్పతర వుర్విన్‌ సద్దిజ శ్రేయమై”

భాగవత పురాణ స్వరూప స్వభావ ప్రభావ ప్రాభవాలను అద్భుతంగా ఆవిష్కరించే ఈ పద్యం కూడా పోతన ‘అవతారిక’లోనిదే. దీనికి మూలం సంస్కృత భాగవతంలో లేదు. భాగవతాన్ని కల్పవృక్షంతో ముడిపెడుతూ రసమయ రమణీయ రూపకల్పన చేశాడు మహాకవి. దీనికి ప్రేరణగా భాగవత వ్యాఖ్యాత శ్రీధరుడు ప్రారంభంలో భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తూ చెప్పిన ‘శ్రీమద్భాగవతాభిధః గురుతురుః’ అనే శ్లోకం ఉంది. నన్నయ్యభట్టు భారత అవతారికలో కూడా దీనికి అనురూపమైన పద్యం ఒకటుంది-

అమితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థామలచ్ఛాయ మై

సుమహా వర్గ చతుష్క పుష్కవితతిన్‌ శోభిల్లి కృష్ణార్జునో

త్తమ నానాగుణకీర్తనార్థఫలమై ద్వైపాయనోద్యాన జా

త మహాభారత పారిజాతమమరున్‌ ధాత్రీ సుర ప్రార్థ్యమై

అంటూ నన్నయ భారతాన్ని పారిజాత పాదపంతో రూపించి నిరూపించాడు. పారిజాతం కూడా కల్పవృక్షభేదమే. మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం- ఈ అయిదూ దేవతా వృక్షాలని అమరం. ‘భారత పారిజాతానికి ఆశ్రయం వ్యాసుడనే ఉద్యానవనం. అందులోని అసంఖ్యాకమైన ఉపాఖ్యానాలే శాఖ ప్రశాఖలు. వేదార్థమే స్వచ్ఛమైన శీతలఛాయ. ధర్మార్థకామమోక్షాలే పూగుత్తులు. నర-నారాయణుల గుణ సంకీర్తనమే దాని ఫలం. భక్తిరసరసికులైన భాగవతులే ఫలభోక్తలు’ అని పద్యభావం. పోతనకు కవిత్రయం అంటే అపారమైన ఆదరం, అభిమానమూను. నన్నయ మీద గౌరవం కొద్దీ ఆయన పద్యచ్ఛాయను అనుసరించినా, తన ‘సహజపాండిత్య’ ప్రతిభను ప్రదర్శిస్తూ అందులోని ‘శ్లేష’ను జోడించి పోతన తన పద్యమనే పసిడి పువ్వును పరిమళభరితం చేశాడు. శ్లిష్టరూపకం ద్వారా భాగవత పరంగాను కల్పతరు పరంగాను, రెండర్థాలలో అలరించాడు.

‘లలిత స్కంధము’- భాగవతం సుందరమైన పన్నెండు స్కంధాలు కలది. ఇది కృష్ణుని వాఙ్మయ విగ్రహం. ప్రథమ ద్వితీయ స్కంధాలు కృష్ణుని దివ్యపాదారవిందాలు, తృతీయ, చతుర్థ స్కంధాలు ఊరువులు (తొడలు), పంచమం నాభి, షష్ఠం హృదయం, సప్తమ అష్టమాలు భుజాలు. నవమం కంఠం. ‘ముఖారవిందం దశమం ప్రఫుల్లం’- దశమ స్కంధం వికసించిన ముఖకవలం. ఏకాదశం లలాటం. ద్వాదశం శిఖ అనగా శిరస్సు అగ్రభాగం. ‘ఏవం సర్వం భాగవతం శ్రీహరే రంగముచ్యతే’ ఇలా సంపూర్ణ భాగవతం దామోదరుని దివ్యమంగళ విగ్రహం-

‘మంగళం భగవాన్‌ విష్ణుః మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్ష మంగళాయతనం హరిః’ ఇక కల్పవృక్షపరంగా- అది అందమైన స్కంధం (బోదె, మొదలు) కలది. ‘కృష్ణమూలము’- సాక్షాత్‌ భగవంతుడైన కృష్ణుడే భాగవతానికి మూలం. పరమార్థంలో భాగవత రచయిత కూడా పరమాత్మే! ‘భగవంతుడు రచింప భాగవత కల్పక్ష్మాజమై’ (భక్తులకు కల్పవృక్షమైన భాగవతాన్ని భగవంతుడే రచించాడు) అని ఆంధ్రభాగవతంలో బ్రహ్మదేవుడు నారదునికి చెప్పినమాట. నల్లని వేళ్లు గలది కల్పకం. ‘శుకాలాపాభిరామంబు’- శుకముని ముచ్చటించిన మధురమైన మాటలచే మనోహరమైనది భాగవతం. కల్పతరువు శుక- అనగా చిలుకల కులకూజితాలతో కమనీయం. ‘మంజులతా శోభితము’- భక్తి భావ సౌందర్య మధురిమలతో భాసించేది భాగవతం. మంజు- అందమైన, లతాశోభితము- తీగలు అల్లుకొనుటచే కడు శోభగా ఉంది కల్పకం. కవిత, వనిత, లత జతలేక మనలేవుగదా! ‘సువర్ణ సుమనస్సుజేయమున్‌'- ‘అక్షర’ జ్ఞానం కలిగిన రసజ్ఞ భావుకులచే ఆస్వాదింప తగినది భాగవతం. స్నిగ్ధమైన సుగంధిత సుమ సముదాయంతో ముగ్ధ మనోహరంగా ఉంది కల్పవృక్షం. ‘సుందరోజ్జల వృత్తంబు’- భాగవతపరంగా ‘వృత్తంబు’ అంటే ఇతివృత్తం (సబ్జక్ట్‌). ‘ఇతివృత్తంతు కావ్యశరీరం’ అని నాట్యశాస్త్రంలో భరతముని నిర్వచనం.

భాగవత ఇతివృత్తం సుందరమే కాక సముజ్జలం కూడా. భగవల్లీలా వర్ణనను మించిన సుందరోజ్జల వృత్తం మరేముంటుంది? మరో అర్థంలో వీనుల విందైన వివిధ వృత్తము (ఛందోబేధము)లచే చిత్తములను చమత్కృతం చేసేది భాగవతం. అలరించే అందమైన మండలం (వర్తులాకారం, గుండ్రనితనం) కలది కల్పవృక్షం. ‘మహాఫలంబు’- మోక్షం కంటే గొప్పదైన, పంచమ పురుషార్థమైన భక్తియోగాన్ని ప్రసాదించేది భాగవతం. ‘కల్పస్య సంకల్పస్యదాతా వృక్షః’- సంకల్ప మాత్రం తోనే గొప్పవైన త్రివర్గ (ధర్మ, అర్థ, కామ) ఫలాలను ప్రసాదించేది కల్పవృక్షం. ‘విమల వ్యాసాల వాలంబునై’- శుద్ధమైన అంతఃకరణం గల వ్యాసుడనే ఆధారం కలది భాగవతం. అనగా ‘శ్రీమద్భాగవతే మహామునికృతే- మహామునిః వ్యాసనారాయణః’- నారాయణ అవతారమైన వ్యాసరచితం. అందమైన విస్తారమైన పాదు కలది పారిజాత పాదపం. ‘సద్దిజ శ్రేయమై’- అంటే సత్తగుణ విశిష్టులైనవారికి అత్యంత క్షేమం కలిగించేది. శుక, పిక, శారికాది ద్విజములకు - పక్షులకు ఆశ్రయమిచ్చి శ్రేయస్సు కూర్చేది కల్పకం. ద్విజునికి వలె పక్షికి కూడా రెండ జన్మలున్నాయి- ముందు గుడ్డుగా పుట్టడం, తర్వాత పొదగబడి పిల్ల కావటం. అలాగే వేదాంతపరంగా మానవ జీవునికి రెండు జన్మలు- మాతృగర్భం నుంచి బయట పడటం మొదటి జన్మ.

దానికి జీవుని పురుషార్థం- ప్రయత్నంతో పనిలేదు. ప్రకృతే ఆ పని కానిస్తుంది. కాని, మాతృగర్భం వదిలి జీవుడు వెంటనే మాయా గర్భం (తమోంధం- అజ్ఞానమనే గాఢాంధకారం)లోకి వచ్చిపడ్డాడు. దీని నుంచి బయటపడటం చాలా కష్టం. స్వప్రయత్నం అన్నా ఉండాలి. స్వామి అనుగ్రహమన్నా కావాలి. భగవదనుగ్రహం భక్తి లేక కలుగదు. కలిలో భక్తి కలుగటానికి, ఇతోధికంగా వృద్ధి చెందటానికి సర్వసులభ సాధనం భాగవతం. ‘వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరువుర్విన్‌' - ముచ్చటైన ఈ ముక్తాయింపు మాట ఎంత ‘సత్తా’ కల్గిందో, భక్తులకు ఎంతగా ‘వత్తాసు’ పలుకుతుందో చూడండి! ఇంతాచేసి ఆ సంతానం (కల్పవృక్షం) ఈ లోకంలో లేదు. స్వర్గంలో ఉంది. మనకేమి లాభం? కానీ, భాగవత కల్పభూజం ఈ భూలోకంలోనే కొంగుబంగారమై విరాజిల్లటం మన భాగ్యవిశేషం!logo