గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 05, 2020 , 00:11:57

కాలాతీతుడు!

కాలాతీతుడు!

వేల పిడికిళ్లు బిగుసుకున్నాయి 

ఒక్క గొంతు మాత్రమే 

వందేమాతరం అంటూ పొలికేక పెట్టింది!

లక్షల మంది గుసగుసలాడుతున్నారు 

తర్జన భర్జనల పుంజీతం ఆడుతున్నారు 

ఒక్క పాదమే ముందుకు నడిచింది 

దారి దీపమై నిలిచింది!

దశాబ్దాల కాలం నుంచి అంతటా నినాదాలే 

దున్నేవాడిదే భూమి అని.. 

ఒక్క పచ్చ సంతకం 

కూలీని పట్టాదారుణ్ని చేసింది 

భూసేవకునికి  పట్టాభిషేకం చేసింది!

నిపుణులందరూ ముక్త కంఠంతో అన్నారు 

జనాభా భారమని.. 

జనం మన నడకకు ఆటంకం అని.. 

ఒక్క మేధస్సు మాత్రమే 

అదే మన బలం అనీ- మనకు వరం అనీ వాదించింది  

మానవ వనరుగా నిరూపించింది!

జ్ఞానులందరూ మనుషులను సమూహాలుగా చేసి 

భాషల గోడలను అడ్డంగా కట్టేశారు 

అతనొక్కడే భాషతో వారధిని నిర్మించాడు 

దీవుల మధ్య సంధానమై నిలిచాడు!

సృజనకారులందరూ 

అనువాదాలు తొలి అనుభవాలు కాదన్నారు 

ఒక్క కలం మాత్రం 

సహస్ర ఫణుల నవేతిహాసాన్ని సృష్టించింది 

శతాధి ఫణతుల అనుభూతులను మిగిల్చింది !

అంతర్జాతీయ బేహారులందరూ 

దేశం పనైపోయిందని 

బంగారం తాకట్టులో పడిందని ఎగతాళి చేశారు 

ఒక్క చాణక్య నీతి 

నూతన ఆర్ధిక అస్ర్తాలను సంధించింది 

దేశ శిరస్సుపై కిరీటాన్ని పదిలంగా నిలబెట్టి 

ప్రపంచ పద్మవ్యూహాన్ని ఛేదించింది!

ఆ ఒక్కడు 

ఎప్పటికప్పుడు ముందుతరం దూతనే 

కాలాన్ని అధిగమించిన క్రాంతదర్శినే!

ఆ ఒక్కడు 

ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే 

చట్టం చేసే పనిని నమ్మిన తాత్వికుడే!

అతడు-

మట్టిని మానవత్వాన్ని 

పరుసవేదిలా మలిచిన ఋషి 

తెలంగాణాతనానికి- భారతీయ తత్వానికి

వంతెన వేసిన రాజర్షి!!

- అయినంపూడి శ్రీలక్ష్మి 9989928562


తాజావార్తలు


logo