గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 05, 2020 , 00:11:53

రాళ్లెత్తిన కూలీలకు... రాజుల సలాం!

రాళ్లెత్తిన కూలీలకు... రాజుల సలాం!

ఫలానా రాజు, ఫలానా కాలంలో... తమ తల్లిదండ్రులు లేదా సంబంధీకుల జ్ఞాపకార్థం దేవాలయాలు, చెరువులు, ప్రాకారాలు నిర్మించారని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ సందర్భంలో రాజు కీర్తి మాత్రమే తెలుస్తుంది. కానీ దేవాలయాన్ని నిర్మించిన శిల్పుల ప్రతిభ గురించి కానీ, ఆలయ శిఖరం ప్రశస్తి కానీ ఉన్న సందర్భాలు తక్కువ. తెలంగాణ ప్రాంతంలో అటువంటి వర్ణన ఉన్న శాసనాలు మల్యాల వంశీయులకు సంబంధించి ఉన్నాయి

మల్యాల వంశీయులు కాకతీయుల సామంతులుగా ఉన్నారు. వీరు కాకతీయులకు మంత్రులుగా, సేనానాయకులుగా, దండనాథులుగా, వారి విధేయులుగ బాధ్యతలు నిర్వహించారు. ప్రభువుల అడుగుజాడల్లోనే ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. చెరువులు తవ్వించారు. ఆలయాలు నిర్మించారు.అలా నిర్మించిన ఆలయాలు, వాటి నిర్మాణరీతి, శిల్పుల అద్భుత ప్రతిభ గురించి 3 శ్లోకాలు  కాటసేనాని వేయించిన కొండపర్తి శాసనంలోను, మల్యాల గుండసేనాని వేయించిన వర్ధమానపుర శాసనంలోను ఉన్నాయి.

కాటసేనాని మల్యాలవంశోద్భవుడు. సబ్బసేనాని, ఆచమల పుత్రుడు. ఇతడు క్రీ.శ. 1180లో కొండపర్తి గ్రామంలో రుద్రేశ్వర, కేశవదేవాలయాలను నిర్మించి వాటికి రెండు నివర్తనాల భూమిని దానమిచ్చి శాసనం వేయించినాడు. ఈ శాసనం నాలుగువైపుల మొత్తం 192 పంక్తుల్లో ఉంది. వీటిలో దేవాలయ వాస్తు విశేషాలను తెలిపే శ్లోకమిది. 

“ప్రాకారో జయతి త్రికూట మభితస్థస్తేన నిమ్మాపితః

సుశ్లిష్ట్యేః క్రమశీషకరైరుపచితో నీలోపలైః కల్పితః॥

యశ్చా లక్షిత సంధి బంధ కథనా దేక శిలా తక్షకైః

సంతక్షేవ మహీయసీమివ శిలాం యత్నాత్సముత్తారితః॥

‘నల్లసరపు రాళ్ళను నున్నగా చేసి, స్తంభాలను, దూలాలను, ప్రాకారాన్ని నిర్మించిన శిల్పుల ప్రతిభ అపురూపమైంది. ఆలయ కుడ్యములలో రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కనిపించక, ఒకే రాయిని కుడ్యరూపంలో నిర్మించి ఆలయాన్ని నిర్మించినట్లు కనిపించడం శిల్పుల మేధా సంపత్తికి, శిల్పకళాచాతుర్యానికి నిదర్శనం!’ 

అదేవిధంగా మల్యాల గుండసేనాని వేయించిన వర్ధమానపుర శాసనం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వడ్డెమానులో ఉంది. మల్యాల గుండన క్రీ.శ. 1245 విశ్వావసు సంవత్సరంలో పుష్యబహుళ అమావాస్య సూర్యగ్రహణ పుణ్యకాలంలో తాను కట్టించిన నాగేశ్వరాలయ దేవునికి ప్రాకార గోపురాలను నిర్మించి పిన్నలట్టి గ్రామాన్ని దానమిచ్చే సందర్భంలో వేయించాడు. శాసనంలో నాగేశ్వరాలయ గోపురాన్ని, గోపుర శిఖరాన్ని, దానిపై ఉన్న బంగారు కలశాన్ని గురించి వర్ణన ఉంది.

ఆదౌ యస్య నికామ హేమ శిఖరం జ్ఞాత్వా సమాలోచ్యత

త్కోణైభానురధావరోధన భయాన్మాగద్వయం వేధసా॥

నిమ్మాయోత్తర దక్షిణాయన నిభాదిత్థం జగత్కల్పితం 

నోచేత్‌క్షుణ్న రథా రవిః కథమిహ స్పష్టం సమాచేష్టతే॥”

నాగేశ్వరాలయంపై ఉన్న బంగారు శిఖరాన్ని చూస్తే ఆ శిఖర కోణాలు సూర్యుని రథగమనానికి అవరోధం కలుగుతుందనే భయంతో బ్రహ్మ ఈ జగత్తులో ఉత్తరాయన, దక్షిణాయనాలను సృష్టించినట్లు... అట్లా చేయకపోతే సూర్యుడు ఎట్లా పయనిస్తాడు అని వర్ణించారు. అంటే ఈ ఆలయ శిఖరాలు ఎంత ఎత్తులో ఎంత విశాలంగా ఉన్నాయో తెలుస్తుంది. ఇంకా

“యస్య ప్రశస్య శిఖిరాప్పిత హోమ కుంభ

నిష్క్రాంత ధీధితితతిః పుర సుందరీణాం

శ్యామానుజార గమనం వినివారయంతి 

విద్యోతతే దినమణే రపరా ప్రభేవ॥”

శిఖరంపై ఉన్న బంగారు కలశపు కాంతి రాత్రులందు వర్ధమానపుర సుందరీమణులు జారుల వద్దకు వెళ్ళడాన్ని నిరోధించడానికి ఏర్పాటుచేసిన సూర్యకాంతిలాగా ప్రకాశమానంగా ఉందని వర్ణించారు. ఈ వర్ణన ద్వారా ఆ బంగారు కలశాన్ని తయారు చేసిన శ్రామికుడి నేర్పరితనం, దాన్ని మెరుగుపెట్టిన విధానం తెలుస్తుంది.

ఇదేవిధంగా సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి అనేక అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించిన కళాకారుల, శిల్పుల, చిత్రలేఖకులకు సంబంధించిన విశేషాంశాలు శాసనాల ద్వారా అధ్యయనం చేయవచ్చు.

- డా. భిన్నూరి మనోహరి, 9347971177logo