ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 05, 2020 , 00:11:51

కలం చూసిన సమరం

కలం చూసిన సమరం

సమాజ మనుగడలో, చరిత్రలో గొప్పవారి గురించి, రాజుల గురించి తెలుసుకోవాల్సిన వారికి తెలుసుకోవాల్సినంత ఉంది. సామాన్యులు భూమ్మీదకి ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్లిపోయారో ఎవరికి కావాలి. కానీ ఆధునిక సాహిత్యంలోని అభ్యుదయ దృక్పథం, లోకాన్ని శ్రమైక జీవన సౌందర్యంతో చూసిందనే చెప్పవచ్చు. ఆ కోవలోనే రావూరి భరద్వాజ బడుగు బలహీన జీవితాలను జీవన సమరం పేరుతో సజీవ కళాఖండాలుగా తీర్చిదిద్దారు.

తరతరాలుగా భారతీయ సమాజం కులాల, వృత్తుల పునాదుల మీద నడిచింది. ఆయా వృత్తుల్లో ఇప్పటికీ సాగుతున్న జీవన సమరాలను అక్షరబద్ధం చేశారు భరద్వాజ. ‘ఆర్చేదెవరు? తీర్చేదెవరు?’ శీర్షికలో వీరగాథలను ప్రచారం చేస్తూ పొట్ట నింపుకొనే పంబ, పిచ్చుగుంట, వీరముష్టి తెగల గురించి విశ్లేషించారు. ‘డూడూ బసవన్న’ కథలో గంగిరెద్దుల ఆట మొదట వినోదక్రీడగా మొదలై వృత్తిగా రూపాంతరం చెందిందని తెలియచేశారు. ‘తలకుండు విషము ఫణికిని’ కథలో ఖాజామియా పాములాడించే వృత్తిని ఎంచుకోవడానికి గల కారణాలను కథాత్మకంగా తెలియచేశారు. ‘ఎరుకోయమ్మా ఎరుక!’ శీర్షిక అనాదిగా వస్తున్న ఎరుకల వృత్తి గురించి వివరిస్తుంది. ‘గడయెక్కినా గడప గడపెక్కినా’ అనే కథలో చిన్నప్పటి నుంచి దొమ్మరుల వృత్తిలోనే జీవిస్తున్న రాములమ్మ తన తండ్రి కత్తులు విసిరే కళను గురించి గొప్పగా చెబుతుంది. వీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వీధి ప్రదర్శనకు కావాల్సిన కళలను ఒంటబట్టించుకుంటారు. ఇవన్నీ కూడా సంచార వృత్తులు. కాబట్టి వీరికి స్థిర నివాసాలంటూ ఉండవు.  

ఇక స్థిరమైన వృత్తులు గ్రామీణ వ్యవస్థలో ప్రధానభూమికను పోషిస్తాయి. పద్మశాలి, వడ్రంగి, కమ్మరి, శిల్పి, జాలరి, గొర్లకాపరి, మాదిగలు, ఎరుకలు మొదలైన వృత్తులు గ్రామ మనుగడలో తరతరాలుగా వాటి పాత్రను బాధ్యతగా నిర్వర్తిస్తూ వస్తున్నాయి. ‘సారె సారెకున్‌' కథలలో గురవయ్య పాత్ర ద్వారా కుమ్మరి వృత్తి పూర్వాపరాలను తెలియచేశారు. ‘గొడ్డుచాకిరి- గుడ్డక్కరువు’లో రామస్వామి పద్మశాలి. పారిశ్రామికీకరణతో పద్మశాలీల జీవన పరిస్థితి దిగజారుతూ వచ్చిన తీరుకు ప్రత్యక్షసాక్షి. విశ్వబ్రాహ్మణకులంలో భాగమైన కమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి, శిల్పి అనే అయిదు శాఖలకు గ్రామసమాజంలో ప్రముఖ స్థానం ఉంది. వ్యవసాయ సంబంధ, గృహ నిర్మాణ సంబంధ పనులను కమ్మరి, వడ్రంగం వారు. బంగారం, వెండి ఆభరణాల తయారీలో అవుసులవారు ఇత్తడి, ఇండాలియం పాత్రల తయారీలో కంచరివారు, దేవాలయ నిర్మాణం, దేవుడి విగ్రహాలను చెక్కడంలో శిల్పులు... ఇలా వీరు కళను నమ్ముకొని వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నారు. ‘కుడిఎడమల దగాదగా’ కథ కమ్మరి వృత్తి నైపుణ్యాలను, ‘రెక్కాడినా డొక్కాడదు’ కథ వడ్రంగి వృత్తి గురించి, ‘ఆడేరెక్క మాడేడొక్క’ శిల్పవృత్తిసంబంధ విషయాలను తెలియచెప్పే కథలు. ‘కేశోపనిషత్తు’ కథ మంగలి వృత్తి పూర్వాపరాలను తెలియచేస్తుంది. మంగలికులంలో ఆడవారు మంత్రసానులుగా పురుడు పోసే నైపుణ్యాన్ని కలిగి ఉండేవారు. ఆసుపత్రి వ్యవస్థ పటిష్టమైన తర్వాత వారి అవసరం లేకుండా పోయింది. ‘అంగటిలో పోచ అటూ పోదు- ఇటూ రాదు’ కథలోని గంగయ్య బెస్తవృత్తికి చెందినవారు. “మీలాంటి వాళ్లకు నీళ్లంటే భయంగానీ మాకేం ఉండదండీ. గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగానే చూస్తుంది” అంటూ భరోసాగా చెప్పుకొస్తాడు. ‘మనిషికన్న మృగం నయం!’ కథలో రామస్వామి ఎలుగుబంటిని ఆడిస్తూ ఎలా బతుకుబండిని లాగిస్తున్నాడో తెలియచేస్తాడు. ‘వెదురుతో వేయి రకాలు’ మేదరి వృత్తి జీవనవిధానాన్ని తెలియజేస్తుంది. అలాగే ‘పదివేళ్లు పనిచేస్తాయి’ కథ ప్లాస్టిక్‌ కుర్చీల అల్లకం గురించి, ‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి కథ’ మేస్త్రీ పని గురించి తెలియచేస్తాయి.

ఇలా... భరద్వాజ సమాజపు పునాదులుగా నిలిచిన వృత్తుల శ్రమైక సౌందర్యాన్నీ, వాటి వెనుక దాగిన కన్నీటి చారికలనూ అక్షరబద్ధం చేశారు. కష్టజీవుల త్యాగానికి కాగడాలా నిలిచారు.

(జ్ఞానపీఠ గ్రహీత రావూరి భరద్వాజ జయంతి నేడు)

- డా.ఎం. దేవేంద్ర, 9490682457


logo