ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 04, 2020 , 00:53:03

పీవీ జీవితం.. యువతకు పాఠం!

పీవీ జీవితం.. యువతకు పాఠం!

నాయకుడనేవాడికి సింహానికి ఉండే శక్తి, నక్కకు ఉండే యుక్తి రెండూ ఉండాలని ఐరోపా చాణక్యుడు నికొలో మాకియవెలి (1469-1527) చెప్పాడు. ఈ శక్తియుక్తులు పుష్కలంగా ఉండటంతో పాటు అదనంగా అసాధారణ స్థాయిలో విద్వత్తు, పాండిత్యం, చాతుర్యం, భాషా నైపుణ్యం, వ్యక్తీకరణ సామర్థ్యం, తత్తజ్ఞానం వంటి అపార అద్భుత లక్షణాల కలబోత మన అపర చాణక్యుడు పీవీ నరసింహారావు. ఆ కర్మయోగి, మౌనముని శత జయంతి ఉత్సవాలు జరపాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, కార్యాచరణలతో తెలుగు జాతి పరవశిస్తున్నది. పీవీ జీవితం నిస్సందేహంగా మనకు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితసారాన్ని నాలుగు మాటల్లో చెప్పాలంటే, అవి: రాజనీతిజ్ఞత, స్థితప్రజ్ఞత, ప్రాప్తకాలజ్ఞత, విజ్ఞత.

రాజకీయాలను నడపడంలో, పాలనను నిర్వహించడంలో ఉన్న నేర్పు- రాజనీతిజ్ఞత, రాజకీయాలంటే దేశసేవ అని విశ్వసించిన సత్తెకాలపు తరంలో రాటుదేలి, పాలిటిక్స్‌ పరమావధి పవర్‌ మాత్రమే అని నమ్మిన తరంతో పయనించి, ఈ క్రమంలో సొంత సులక్షణాలు మంటకలిసిపోకుండా జాగ్రత్తపడిన నేత ఆయన. స్వాతంత్య్ర సమరం, నిజాం వ్యతిరేక తిరుగుబాటు, జై ఆంధ్రా ఉద్యమం, తెలంగాణ పోరాటాలు, మహాసముద్రం లాంటి కాంగ్రెస్‌ పార్టీలో నిత్యం ఉండే ఆటుపోట్లు ఆయనను అప్రయత్నంగానే రాజనీతి దురంధరుడ్ని చేశాయి. సాహితీ సాంగత్యం, అధ్యయనాభిలాష, పుస్తక పఠనం మేధస్సుకు పదునుపెట్టి తనకంటూ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.

బహుభాషా సాహిత్యంతో, జర్నలిజంతో, న్యాయవాదంతో, ఆధ్యాత్మికతతో మమేకమై రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి చివరకు అత్యున్నతమైన ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించిన తత్తవేత్త ఆయన. రాజకీయాలకు దాదాపు దూరమైన ఆయన జీవనసంధ్యలో మఠాధిపతిగా గడిపేద్దామనుకుంటున్న దశలో అనూహ్యంగా దేశాధిపతి అయ్యారు. దేశముదుర్లకు ఆలవాలమైన కాంగ్రెస్‌ పార్టీలో ఎలా మెలగాలో, ఎక్కడ తగ్గాలో తెలియబట్టి, అవమానాలు ఎదురైనా పరిణతితో మెలగబట్టి.. రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్‌కు పీవీ గుర్తుకొచ్చారు. తిమ్మిని బమ్మిని చేసే, భజన స్తోత్రాలతో అధిష్ఠానాన్ని ఖుషీచేసే పలువురు ఉత్తరాది నేతలున్నా తెలుగు బిడ్డకు పిలుపువచ్చింది. ఆ అవకాశం వచ్చిందే తడవుగా.. దక్షిణాది నేతలు హస్తినలో చక్రం తిప్పలేరన్న అభిప్రాయం శుద్ధతప్పని నిరూపించారు. చక్రం తిప్పే అవకాశం వస్తే ఎంత బాగా తిప్పుతారో ప్రపంచానికి తన బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో చాటారాయన. 

దుఃఖాలు కలిగినప్పుడు కలత చెందకపోవడం, సుఖాల మీద ఆశలేకపోవడం, రాగం, భయం, క్రో ధం లేకపోవడం, బాహ్య ప్రయోజనాల పట్ల అపేక్ష లేకపోవడం, ఆత్మస్వరూపం పట్ల సంతృప్తి కలిగి ఉండ టం పీవీని భారత రాజకీయాల్లో సమున్నత నాయకుడిగా నిలబెట్టాయి. ఇవన్నీ సమ్మిళితమైన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఈ పదం అతికినట్టు సరిపోయే అరుదైన భారతీయ రాజకీయ నాయకుడు పీవీ. విధేయుడని పిలిచి పగ్గాలిస్తే పదవి చేపట్టాక దేశ సేవే పరమావధి అంటూ ఏకు మేకయ్యాడని భావించారు. అప్పుడు ఉత్తరాది నేతలను వాడుకుని కాంగ్రెస్‌ నాయకత్వం వేసిన ఎత్తుగడలను పీవీ గాబరా పడకుండానే ఎదుర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తప్పయినా ఒప్పయినా, ఓపిగ్గా, ప్రశాంతంగా వ్యవహరించడం ఆయనకు అలవాటు. కేసుల మీద కేసులు ఎదుర్కోవాల్సి వచ్చినా మనోనిబ్బరం కోల్పోకుండా నిలబడి నిర్దోషిత్వం నిరూపించుకున్న వ్యక్తిత్వం ఆయనది. 

సమయ సందర్భాలను బట్టి, ముందున్న సవాళ్లను బట్టి మెలగడమే ప్రాప్తకాలజ్ఞత. నిజానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పీవీకి అంత అద్భుతమైన పేరు ప్రతిష్ఠలు రాలేదు. కానీ పీఎం పదవి వచ్చాక మైనారిటీ ప్రభుత్వాన్ని నిండు ఐదేండ్లు నిలబెట్టుకోడానికి ఆయన సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలే కారణమంటారు. నెహ్రూ కుటుంబానికి చెందని తాను.. భజనపరులతో నిండిన కోటరీ మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకునే అనుభవం లేని పార్టీ నాయకత్వాన్ని నిభాయించాల్సిన సంకట స్థితి. సాటి సీనియర్లు ఈర్ష్యాద్వేషాలతో, స్వప్రయోజన రాజకీయాలతో, సొంత అజెండాలతో ఉక్కిరిబిక్కిరి చేసినా.. ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకుని తెలివిగా వ్యవహరించారు పీవీ. కొన్ని కీలక సందర్భాల్లో విపక్ష రాజకీయ దురంధరుల నైతిక మద్దతూ పొందడానికి ఆయన రాజనీతిజ్ఞతే కారణం. 

సంస్కరణల రథసారథిగా పీవీ 1991 జూలై 15 నాడు పార్లమెంటులో విపక్షాల నుంచి ఘాటైన ఆరోపణలను, స్వపక్షీయుల నుంచి ఈసడింపులను ఎదుర్కొన్నారు. సంస్కరణలతో భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టుపెట్టారని అంటున్నవారికి దిమ్మతిరిగే సమాధానంగా మితభాషిగా పేరున్న ఆయన ఒక సంస్కృత శ్లోకం ఉటంకించారు. లోక్‌సభలో వాడివేడి చర్చ మధ్యలో.. సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండితః. నేను చేసిందీ ఇదే! అనేసరికి విపక్ష, స్వపక్షాలు తెల్లబోయాయట. దీనర్థం.. సర్వం కోల్పోయే పరిస్థితి దాపురించినపుడు తెలివికలవాడు సగం వదులుకొని, తక్కిన సగం కాపాడుకొంటాడు. సమయానుకూలమైన ఈ శ్లోకాన్ని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ప్రతివేదిక మీదా ప్రస్తావిస్తారు. సందర్భానికి తగిన శ్లోకాలను ఉటంకించి రక్తి కట్టించడం మహా పండితుడైన పీవీకే నప్పింది. తన మంత్రివర్గంలో ముసలోళ్లు కంప్యూటర్లు ఏమి వాడగలరని రాజీవ్‌గాంధీ అనడాన్ని జీర్ణించుకోలేక అప్పటికప్పుడు పట్టుదలతో కంప్యూటర్లపై పట్టు సాధించడం మామూలు విషయం కాదు. 

చచ్చిన చేపకు ఎంత కరిష్మా ఉంటుందో.. పీవీకి కూడా అంతే కరిష్మా ఉంటుందని విమర్శకులు ఎద్దేవా చేసినా, మరొక కరిష్మారహిత ఆర్థిక నిపుణుడు మన్మోహన్‌సింగ్‌ సంపూర్ణ సహకారంతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పీవీ అర్థశాస్త్రంలో ఘనాపాఠి కాదు. అయినా, భయానకమైన సంక్షోభంలో కూరుకున్న ఆర్థికవ్యవస్థకు కాయకల్ప చికిత్స చేసే నిపుణుడు డాక్టర్‌ మన్మోహన్‌కు ఆ బాధ్యత అప్పగించిన విజ్ఞత ఆయనది. మన్మోహన్‌కు సంస్కరణల విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చి, రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను ఇంటా బయటా తాను సమర్థంగా ఎదుర్కొన్నారు. అంతకుముందు కనీసం నలుగురు ప్రధానమంత్రుల దగ్గర సంస్కరణల ముసాయిదా ఉన్నా అమలుచేసే ధైర్యం, తగిన రాజకీయ సంఖ్యాబలం లేక భారత ఆర్థికవ్యవస్థను పట్టాల మీదకు తెచ్చే సాహసం చేయలేకపోయారట. 

దేశ ప్రయోజనాలు, రాజ్యాంగం పరమోత్కృష్టమైనవని నమ్మిన పీవీ అధికారాన్ని ఆశ్రిత పక్షపాతానికి, కుటుంబసభ్యుల సేవకు వాడుకోలేదు. అధికారంతో అంటకాగేందుకు కావలసిన కాంగ్రెస్‌ మార్కు కోటరీని ఏర్పరుచుకోలేదు. కాంగ్రెస్‌ నాయకత్వం అయోధ్య విషయంలో తనను బలిపశువును చేయాలని చూసిందని పీవీ బాధపడ్డారు. తనకు అన్ని పదవులు ఇచ్చి దేశసేవ చేసే భాగ్యం కలిగించిన పార్టీని ఇబ్బందిపెట్టకుండా.. తన మరణానంతరం ఈ విషయాన్ని వెల్లడించాలని కోరడం ఆయన విజ్ఞత. పీఎం పదవి చేపట్టడానికి ముందు, ఆ తర్వాత పదవి వీడి కన్నుమూసే వరకూ కాంగ్రెస్‌ తనకు ఇవ్వాల్సిన గౌరవమర్యాదలు ఇవ్వకపోయినా, అవమానించినా సభామర్యాదతో మెలిగారు. పదవి ఇచ్చిన అహంకారం తలకెక్కించుకోకుండా ‘ఢిల్లీకి రాజునైనా.. తల్లికి బిడ్డనే’ అని తెలుగుగడ్డపై అభిమానాన్ని చాటుకున్నారు.  

పీవీకున్న అసాధారణ నాలుగు లక్షణాల్లో మొదటిది (రాజనీతిజ్ఞత) అనుభవం మీద, ఆటుపోట్లు తిన్నాక అలవడుతుంది. మిగిలిన స్థితప్రజ్ఞత, ప్రాప్తకాలజ్ఞత, విజ్ఞత అభ్యాసంతో వస్తాయి. అందుకు కావలసింది.. భూదేవంత ఓపిక, ప్రజాసేవ చేయాలన్న సంకల్పం. పీవీకున్న లక్షణాల్లో నిష్క్రియాపరత్వం కూడా ముఖ్యమైనదేనన్న విమర్శ ఉంది. బాబ్రీమసీదు సంక్షోభ సమయంతోపాటు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు గురయింది. అయితే ఈ విషయంలో కూడా ఆయనకు తనదైన ఒక లాజిక్‌ ఉన్నట్లు కనిపిస్తుంది. నిర్ణయం తీసుకోకుండా కిమ్మనకుండా ఉండి నాన్చ డం కూడా ఒక నిర్ణయమే అని గట్టిగా నమ్మే ఆయన.. కాలమే సమస్యలకు పరిష్కారం సాధిస్తుందన్న అతి సాధారణ సిద్ధాంతాన్ని పాటించినట్లు కనిపిస్తారు! 

దుఃఖాలు కలిగినప్పుడు కలత చెందకపోవడం, సుఖాల విూద ఆశలేకపోవడం, రాగం, భయం, క్రోధం లేకపోవడం, బాహ్య ప్రయోజనాల పట్ల అపేక్ష లేకపోవడం, ఆత్మస్వరూపం పట్ల సంతృప్తి కలిగి ఉండటం పీవీని భారత రాజకీయాల్లో సమున్నత నాయకుడిగా నిలబెట్టాయి. ఇవన్నీ సమ్మిళితమైన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఈ పదం అతికినట్టు సరిపోయే అరుదైన భారతీయ రాజకీయ నాయకుడు పీవీ. 


logo