బుధవారం 12 ఆగస్టు 2020
Editorial - Jul 04, 2020 , 00:53:05

అమెరికా కల చెదరలేదు

అమెరికా కల చెదరలేదు

అమెరికా కలను ఇప్పటికీ సాకారం చేసుకోవాలనే ఆశావహులు ప్రస్తుత సమయాన్ని సద్వినియోగపర్చుకొని నైపుణ్యాలు మరింతగా పెంపొందించుకోవాలి. అవసరమైన అదనపు కోర్సులు కూడా చేస్తే అవకాశాలు మెరుగవుతాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ, ఇతర వర్క్‌ వీసాలను ఈ ఏడాది మొత్తానికి రద్దుచేశారు. ‘అమెరికా ఫస్ట్‌' నినాదంతో స్థానికులకు ఉద్యోగాలు  రావాలన్న ఉద్దేశంతో వైట్‌హౌజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల భారతీయులు  నష్టపోతారని అందరూ ఆందోళన చెందటం సహజం. ఇది కొంతమేర నిజమే. ఈ నిర్ణయం ఇతర దేశాలకు ఏ మేరకు నిరాశను కలిగిస్తుందో కానీ, మనకు మాత్రం ఒక దెబ్బగానే భావించాలి. హెచ్‌-1బీ చాలాకాలంగా మన భారతీయ ఇంజినీర్లకు అమెరికా కలను సాకారం చేసే ఒక టిక్కెట్టు. చాలా ఏండ్ల నుంచి 70 శాతం హెచ్‌ -1బీ వీసాలను అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులే సొంతం చేసుకున్నారు. ఇది ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లను ప్రభావితం చేయనప్పటికీ, అమెరికాలో పనిచేయాలని, హెచ్‌-1బీ వీసా పొందాలని కోరుకునే భారతీయ గ్రాడ్యుయేట్లు నిరాశ చెందుతారు. అంతేకాకుండా దేశంలో ఆపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ మొదలైన ‘ఎంఎన్‌సీ’లలో పనిచేసే చాలామందికి ఇది ప్రతికూలమే.

 ఈ వీసా సస్పెన్షన్‌ ప్రభావం భారతదేశం కన్నా అమెరికా ఆర్థికవ్యవస్థపై,  అక్కడి కంపెనీలపై ఎక్కువగా ఉంటుంది. అసలు విషయ మేమంటే, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో, ఇంకా ఆధునిక నైపుణ్యం కలిగిన నాలెడ్జ్‌ ఎకానమీలో స్థానిక అమెరికన్లు అవసరమైన మేరకు అందుబాటులో లేరు. అమెరికాలో ‘స్టెమ్‌' (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) గ్రాడ్యుయేట్స్‌ తక్కువ. ఈ సస్పెన్షన్‌తో స్థానిక కంపెనీలు నైపుణ్యం కలిగిన మానవ శక్తిని విదేశాల నుంచి తీసుకోలేవు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం.  తాజా పరిశోధనల ప్రకారం అమెరికాలోని 80 శాతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిశోధకులు బయటదేశాలకు చెందినవారే.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో హెచ్‌-1బీ అవసరం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు కొత్తవారిని ఉద్యోగంలో చేర్చుకునే అవకాశం లేదు. నిజానికి వారు ఉన్నవారినే ఉద్యోగాల నుంచి తొలిగిస్తున్నారు.  కరోనా తెచ్చిపెట్టిన లాక్‌డౌన్‌ వల్ల ఐటీ విభాగం చాలా నష్టపోయింది. కానీ నెమ్మదిగా దాన్ని అధిగమిస్తూ వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్ధతిని అనుసరిస్తూ కార్యకలాపాలను సాగిస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇప్పుడు సాధారణం. బహుశా కరోనా  తర్వాత కూడా ఇదొక మంచి ప్రత్యామ్నాయంగా కొనసాగొచ్చేమో. వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్ధతితో దేశంలో ఉంటూనే అమెరికా కంపెనీలకు మనం ఇంటి నుంచి పనిచేసే పరిస్థితి రావచ్చు.

అమెరికా నిర్ణయం కొంత నిరాశ కలిగించిన ప్పటికీ అది పూర్తిస్థాయిలో వాస్తవరూపం ధరించ కపోవచ్చు. అమెరికా ద్వారాలు సాంతం మూత పడలేదు. ఎటువంటి రాజకీయ పరిస్థితులు వచ్చినా వారికి ‘ఇమ్మిగ్రెంట్లు’ అవసరమని అక్కడి రాజకీయనాయకులకూ తెలుసు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బిడెన్‌ తాను గెలిస్తే వీసాలపై డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించారు కూడా. 

2021లో అమెరికా తిరిగి వర్క్‌ వీసాలను ఇస్తుంది. అమెరికాకు భారత నైపుణ్యం చాలా అవసరం. కానీ, వారు గత నాలుగేండ్ల నుంచి వీసా అప్రూవల్‌ పద్ధతిని కఠినం చేశారు. గతంలోలాగా ఎక్కువగా వీసాలు ఇవ్వడం లేదు. ‘మెరిట్‌ అండ్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌' పద్ధతిలో వీసాలను ఇస్తున్నారు. అయితే అక్కడ పని చేయాలన్న కలను సాకారం చేసుకోవాలంటే వారికి కావలసిన నైపుణ్యం మనలో ఉండాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌ డేటా అనలటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి నైపుణ్యాలలో పట్టు సాధిస్తే అమెరికాకు వీసా అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి.


logo