మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Jul 04, 2020 , 00:53:06

‘బోర్ల’వడ్డోన్ని లేసిన..

‘బోర్ల’వడ్డోన్ని లేసిన..

కల్వకుర్తిల ఉన్న ఎనిమిది ప్లాట్లు కతమైనయి. అటు ప్లాట్లమ్ముడు, ఇటు బోర్లేసుడు.. ఇట్లా 27 బోర్లేసిన. ఒక్క దాంట్ల గుడుక నీళ్లు పడలే... ఇప్పుడు మా ఊరిపొంటే కల్వకుర్తి కాల్వ పోతన్నది..బోర్లల్ల ఊటవడ్డది. ఇప్పుడు ఆ నీళ్లతోనే నా ఖర్జూరా చెట్లను పారిస్తున్న.

నా పేరు కొంక యాదయ్య, మా నాయిన పేరు కొంక జంగయ్య, మేం గౌండ్లోళ్లం. నాకు తాటి చెట్లెక్కాలన్నా, కల్లు గీయాలన్నా బాగిష్టం. మా ఇంటి తాళ్లు మా అన్ననే గీత్తుండే. పదిహేనేండ్లు పాలేరు పన్జేసిన. మా అన్నకు పెండ్లయింది, ఏరువడ్డడు. ‘ఇంకెన్నొద్దులు ఈ పాలేర్‌ పన్జెయ్యాలె.. నా కులం పని నేన్జేసుకుంటా’ అనుకున్న. కని నాకేమో తాళ్లెక్కరాదు, ఈదులు గియ్యరాదు. ఎట్లా అని ఆలోచిస్తుంటె.. మా ఊరి పెద్ద మనిషి ఒకాయన ‘అరేయ్‌ యాదిగా నీకు ఈదుల్‌ గీసుడు మా నేర్పిస్త గనీ నాతోని వస్తవా?’ అన్నడు. ఛల్‌ ఏడికంటే యాడికి వస్తనే అనుకుంటా ఎంబడి వోయిన.

ఎక్కిన బస్సు దిగి చూస్తే అది ఆంధ్రా ప్రాంతం. ఒంగోలు దగ్గర ఓ పల్లెటూరు. అక్కడ ఈదులు బాగుంటయని తెలిస్తే నన్నాడికి పనికి తోల్కపోయిండు మా పెద్దమనిషి. నాకు గుడుక ఆ ఈదులను చూడంగనె సంబురమైంది. అట్లా ఆరేండ్లు ఈదులు గీసిన. మొదటి మూడు నెలలు జీతమేమియ్యలే. అప్పటికే ఈదులు గీసుట్ల ఆర్‌పార్‌ అయిన. తర్వాత నాలుగో నెల నుంచి నెలకు 350 రూపాల జీతం ఇచ్చిండ్రు. అట్ల ఆరేండ్ల పాటు చేసినంక నా సొంతూరు తర్నికల్‌ (నాగర్‌కర్నూల్‌ జిల్లా)కు వచ్చిన. ఆంధ్రాలోని ఆరేండ్ల కష్టానికి ఫలితం.. తర్నికల్‌లో రెండెకరాల పొలం. మండల కేంద్రం కల్వకుర్తిలో ఎనిమిది ప్లాట్లు.

అందరిలెక్క నేను కూడా ఈదులు, తాళ్లు గీస్తే మనకేం పేరొస్తదని ఖర్జూరా కల్లు కమ్మగుంటదని కొత్తగా ఆలోచించిన. సంగారెడ్డి వొయ్యి ఖర్జూరా మొక్కలు తీసుకొచ్చి నాయిన పంచిచ్చిన ఎకరానికి తోడు నేను కొనుక్కున్న రెండెకరాలల్ల పెట్టిన. ఈ ఖర్జూరా కల్లు నీళ్లు లేకుంటే పారది. అందుకే బోర్లేసుడు షురూ జేసిన. చేతిలున్న పైసల్‌ అయిపోయినయ్‌. ఏం జెయ్యాల్నో మనసున పట్టలే. తర్నికల్‌ ఊళ్లనే మళ్లా తాళ్ళు, ఈదులెక్కుడు షురూ జేసిన. రోజుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాల కల్లు అమ్మేటోన్ని. ఇట్లా యాబై వేలు జమ కాంగనే బోర్‌ షురూ జేసేటొన్ని. ఇట్లా ఒకటీ, రెండు, మూడు.. ఏ బోర్ల కూడా సుక్క నీరు ఎల్లుడు లేదు. పాయిదా లేదనుకొని కల్వకుర్తి ప్లాట్లకు ఎసరువెట్టిన. ఒక్కక్క ప్లాట్‌ ఇరువై, ముప్ఫై వేలకు అమ్ముకుంటా వచ్చి బోర్లేసినా లాభం లేక పోయింది. కల్వకుర్తిల ఉన్న ఎనిమిది ప్లాట్లు కతమైనయి. అటు ప్లాట్లమ్ముడు, ఇటు బోర్లేసుడు.. ఇట్లా 27 బోర్లేసిన. ఒక్క దాంట్ల గుడుక నీళ్లు పడలే. ఇదంతా రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి కాలంల జరిగిన తతంగం. పానం కొద్దీ పెంచుకున్న ఖర్జూరా చెట్లు సావుదలకు వచ్చినయి. ఇగ లాభం లేదనుకొని ట్యాంకర్లల్ల నీళ్లు తెచ్చి ఖర్జూరా చెట్లను పారిస్తూ కంటిపాపల్లెక్క కాపాడుకున్న.

ఐదారేండ్ల నుంచి నా ఖర్జూరా చెట్లు పచ్చగా కళకళలాడుతున్నయి. దీనికి కారణం- ఇప్పుడు మా ఊరిపొంటే కల్వకుర్తి కాల్వ పోతన్నది. (దుందుభి నది మీద అక్విడెక్ట్‌ కట్టడంతో కల్వకుర్తి మండలానికి నీళ్లొస్తున్నయి) ఈ కాల్వ నుంచి మా తర్నికల్‌ చెర్వుతోపాటు సుట్టున్న తోటపల్లి, వెంకటాపూర్‌, వేపూర్‌ ఊళ్ల పొంటి ఉన్న చెర్వులు, కుంటలన్నీ నిండినయి. తెలంగాణ రాకముందు మా చెర్లు నెర్రలువాసి కనవడేటియి. ఇప్పుడు నిండుగ నిండిన వీటిని చూస్తంటె ఒక్క నాకేంది, అందరికి సంబురంగనే ఉన్నది. అప్పట్ల అక్కడా ఇక్కడా తవ్విడిసిపెట్టిన బోర్లల్ల చిన్న పిల్లలు పడి జీవిడుస్తుర్రని, నీళ్లు వడని బాయిలుంటే కూడిపెయ్యిర్రని, లేకుంటే జైల్లేత్తమని ప్రభుత్వం ఊరు సాటింపు చేసింది. మిగితా బోర్లు కూడిపేసి, నాలుగు బోర్ల మీద బండలు వెట్టి మట్టిపోసి కనవడకుండా కాపాడుకున్న. ఆ నాలుగు బోర్లల్ల ఊటవడ్డది. ఇప్పుడు ఆ నీళ్లతోనే నా ఖర్జూరా చెట్లను పారిస్తున్న. ఖర్జూరా కల్లు కూడా పారుతన్నది. పెద్ద పెద్ద సార్లగ్గూడా ఖర్జూరా కల్లు వోస్తున్నా. రోజుకు వెయ్యి, పదిహేను వందలు సంపాదిస్తున్నా.

తెలంగాణ రాష్ట్రమొచ్చి కేసీఆర్‌ సార్‌ ముఖ్యమంత్రాయె. మా సింగిరెడ్డి సారు మంత్రాయె. వాళ్ళు తలుచుకోవట్టే నీళ్లొచ్చినయి. సార్లు సల్లంగుండాలె, నా ఖర్జూరా కల్లు నిండుగ పారాలె.

- ఇంటర్వ్యూ: గడ్డం సతీష్‌, 99590 59041logo