శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jul 02, 2020 , 23:19:53

పుట్టుకతోనే ఆరళ్లు!

పుట్టుకతోనే ఆరళ్లు!

వైజ్ఞానికంగా సమాజం ఎంత పురోభివృద్ధి సాధించినా సంప్రదాయ ఆలోచనారీతుల్లో మార్పురాకుంటే, జరిగిన అభివృద్ధి అంతా మేడిపండు వంటిదే. సగభాగమైన స్త్రీల విషయంలో వివక్ష అణిచివేతలు వారి ఉనికినే ప్రశ్నార్థకం చేసే విధంగా ఉండటం ఆందోళనకరం. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘సెక్సువల్‌ అండ్‌ రిప్రొడక్టివ్‌ హెల్త్‌ ఏజెన్సీ’ తాజా నివేదిక దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో అగాథాన్ని చూపి సామాజిక అపసవ్యతను చాటిచెప్పింది. ఏటా దేశంలో 4 లక్షల 60 వేల మంది ఆడపిల్లలు పుట్టకముందే కనిపించకుండా పోతున్నారని తెలిపింది. అలా మాయమైపోవడం అంటే.. బలవంతపు గర్భవిచ్ఛిత్తి కారణంగానో, భ్రూణహత్యతోనో ఆడ శిశువులకు నూరేండ్లు నిండుతున్న దుస్థితి ఉన్నదని పేర్కొంది. దిగ్భ్రాంతికరమైన విషయమేమంటే.. ఈ అదృశ్యాలకు కారణం కన్నవారు ఆడపిల్ల వద్దనుకోవటమే!. 

సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో స్త్రీకి పూజనీయ స్థానం ఉన్నది. కానీ ఇంకా కొన్నిచోట్ల వెనుకబాటు, మూఢ విశ్వాసాల వల్ల ఆడపిల్ల అంటేనే అరిష్టమనీ, కుటుంబానికి భారమనే భావనలు రాజ్యమేలుతున్నాయి. మరోవైపు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కూడా స్త్రీ జన్మ పాలిట శాపంగా మారటం విషాదం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి గర్భంలో ఉన్న పిండం ఆడ శిశువు అయితే కడతేర్చే అమానవీయత కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండున్నర కోట్ల మంది గర్భస్థ శిశువులు అసువులు బాస్తుంటే, అందులో మన దేశంలోనే కోటి మందికిపైగా గర్భవిచ్ఛిత్తితో ఆకృతి దాల్చకుండానే అంతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లోంచే 2020 లెక్కల ప్రకారం.. సరాసరి వందమంది మహిళలకు గాను 176 మంది పురుషులున్నారు! శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌) అధ్యయనం ప్రకారం కూడా.. ప్రతి వెయ్యి మంది పురుషులకు 2013- 15లో 900 మంది మహిళలు ఉంటే, 2015-17 నాటికి ఆ సంఖ్య 896కు దిగజారటం ఆందోళనకరం.

సహజ పరిణామ వికాసాలకు ప్రతిబంధకంగా సామాజిక పోకడలు ఉంటే మానవీయత మంటగలుస్తుంది. నేడు అడుగడుగునా మహిళలపై జరుగుతున్న హింసాదౌర్జన్యాలు కూడా ఈ అపసవ్యత నుంచే ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి స్త్రీల రక్షణకోసం ప్రభుత్వాలు చేసే చట్టాలకు తోడు ప్రజల్లో చైతన్యం కూడా అత్యవసరం. కేంద్రం బేటీ బచావో- బేటీ పఢావో కార్యక్రమంతో దేశవ్యాప్తంగా 161 జిల్లాల్లో ఆడబిడ్డల సంరక్షణ కోసం పథకాన్ని ఆరంభించింది. మిగతా 479 జిల్లాల్లో కూడా అమలుపరచాలని నిర్ణయించడం సానుకూల చర్య. తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేసింది. గర్భిణులకు పోషకాహారం అందించటం మొదలు కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలను అమలుచేస్తూ పూర్తి రక్షణగా నిలుస్తున్నది. స్త్రీ, పురుష నిష్పత్తిని సమం చేయటం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.


logo