శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jul 02, 2020 , 23:19:53

కక్షిదారులకు సుప్రీం ఊరట

కక్షిదారులకు సుప్రీం ఊరట

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గౌరవ అత్యున్నత న్యాయస్థానం మార్చి 23, 2020 నాడు సుమోటోగా కక్షిదారులకు, న్యాయవాదులకు వెసులుబాటు, ఊరట కల్పిస్తూ అద్భుతమైన తీర్పు ఇచ్చింది. న్యాయస్థానంలో లేదా ట్రిబ్యునల్‌లో వాది లేదా ఫిర్యాదుదారు వేయవలసిన కేసు కాలపరిమితి నిబంధనను పొడిగించింది.

చార్జిషీటు వ్యవధి లోపల దాఖలు కానందున తనకు చట్టపరంగా లభించాల్సిన బెయిల్‌ను ఇవ్వాలని, హైకోర్టు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందంటూ నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్ళగా, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును తిరస్కరిస్తూ నిందితుడికి అండగా నిలిచింది. సెక్షన్‌ 167(2) ప్రకారం బెయిలు కోరుకునే హక్కును చట్టం కల్పించిందని, లాక్‌డౌన్‌ మూలంగా చార్జిషీట్‌ వేసే ప్రక్రియ ఏ విధంగానూ ఆ హక్కుకు భంగం కలిగించదని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం జూన్‌ 19, 2020న తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని అన్ని కోర్టులకు, ట్రిబ్యునళ్లకు చట్టంలాగ వర్తిస్తాయి. సంకట స్థితిలో ఇటువంటి తీర్పులు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరం.

కొవిడ్‌-19 వ్యాప్తి, దరిమిలా తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం ఫలితంగా దేశంలోని అన్ని రంగాలు ఇప్పుడు అనివార్యంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని వ్యవస్థలతోపాటుగా భారత న్యాయవ్యవస్థ కూడా దానిని అనుసరిస్తున్నది. భారత ప్రభుత్వం మొట్టమొదటగా దేశమంతా మార్చి 24, 2020 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించింది. మొత్తం న్యాయవ్యవస్థ కూడా మెజిస్ట్రేట్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా లాక్‌డౌన్‌ను అనుసరించటంతో కక్షిదారులు కోర్టుకు వెళ్లి సొంతంగా గాని లేదా న్యాయవాది ద్వారా గాని ఎటువంటి కేసు దాఖలు చేసే పరిస్థితి లేదు. కోర్టులో లేదా ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చెయ్యాలంటే కేంద్ర, రాష్ట్ర చట్టాలు వాటిల్లో నిర్దేశించిన గడువులోగా మాత్రమే చెయ్యాల్సి ఉంటుంది. చట్టం విధించిన కాలపరిమితి ముగిసిన పిదప కేసు వేసే సౌలభ్యం వాది కోల్పోతాడు. 

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గౌరవ అత్యున్నత న్యాయస్థానం మార్చి 23, 2020 నాడు సుమోటోగా తనకు రాజ్యాంగంలోని 141, 142 అధికరణల ద్వారా సంక్రమించిన విచక్షణాధికారాలను ఉపయోగించి కక్షిదారులకు, న్యాయవాదులకు వెసులుబాటు, ఊరట కల్పిస్తూ ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. న్యాయస్థానంలో లేదా ట్రిబ్యునల్‌లో వాది లేదా ఫిర్యాదుదారు వేయవలసిన కేసు కాలపరిమితి నిబంధనను పొడిగించింది. ఈ తీర్పు మార్చి 15, 2020 నుంచి అమలులోకి వచ్చింది. తదనంతరం ఇదే కేసులో మే నెల ఆరో తేదీన మరోసారి ప్రజలకు ఉపయోగపడే ఉత్తర్వులు జారీచేసింది. ఆర్బిట్రేషన్‌ చట్టం, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చట్టం కింద వేసేటటువంటి కేసులకు కూడా ఆ చట్టాల్లో విధించబడిన కాలపరిమితిని పొడిగించింది. ఈ తీర్పు ప్రకారం సంబంధిత కోర్టు పరిధిలో లాక్‌డౌన్‌ ముగిసిన నాటినుంచి పదిహేను రోజుల్లోపు వాది లేదా కక్షిదారు కేసు వేసుకునే అవకాశం ఉంటుంది. 

ఈ తీర్పుల తర్వాత అత్యున్నత న్యాయస్థానం ముందుకు కాశి వర్సెస్‌ స్టేట్‌ అనే కేసు విచారణకు వచ్చింది. మద్రాస్‌ హైకోర్టులోని మదురై బెంచ్‌ తీర్పుపై నిర్ణయానికి సంబంధించింది. ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటూ జుడిషియల్‌ కస్టడీలో ఉన్న ఖైదీకి ఈ తీర్పు అమలుచేసే అవకాశం ఉందా అనేది ప్రశ్న. నేర విచారణ స్మతిలోని సెక్షన్‌ 167(2) ప్రకారం అరెస్టు చేసిన రోజు నుంచి ప్రాసిక్యూషన్‌ అరవై లేదా తొంభై రోజుల్లోగా చార్జిషీట్‌ వేయకుంటే ఎవరూ అధికారిక కోర్టు నిర్బంధంలో ఉండకూడదు. అంటే అతడు డిఫాల్ట్‌ బెయిలుకు అర్హుడు. కాశి వర్సెస్‌ స్టేట్‌ కేసులో ఆరోపితమైన నేరాలకు శిక్షాకాలం పదేండ్లలోపే. 

ప్రాసిక్యూషన్‌ సకాలంలో చార్జిషీట్‌ దాఖలు చేయనందున సెక్షన్‌ 167(2)ప్రకారం నిందితుడు బెయిలు కోరాడు. మద్రాస్‌ హైకోర్టులోని మదురై బెంచ్‌ మే 11న ఆ దరఖాస్తును తిరస్కరించింది. అత్యున్నత న్యాయస్థానం కేసులు వేసే కాలపరిమితిని సుమోటోగా పొడిగించినందున, చార్జిషీట్‌కు కూడా పొడిగించినట్లేనని, కాబట్టి నిందితుడు డిఫాల్ట్‌ బెయిలుకు అర్హుడు కాడని హైకోర్టు తీర్పు సారాంశం. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్ళగా, హైకోర్టు తీర్పును తిరస్కరిస్తూ నిందితుడికి అండగా నిలిచింది. సెక్షన్‌ 167(2) ప్రకారం బెయిలు కోరుకునే హక్కును చట్టం కల్పించిందని, లాక్‌డౌన్‌ మూలంగా చార్జిషీట్‌ వేసే ప్రక్రియ ఆ హక్కుకు భంగం కలిగించదని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం జూన్‌ 19న తీర్పు ఇచ్చింది. అంతేగాక మార్చి 23వ తేదీ తీర్పు నిందితులకు సంక్రమించిన హక్కులను తీసుకోలేదని, కేవలం చట్టాలు విధించిన గడువులోగా వ్యాజ్యం వేసుకోటానికి ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా లేనందున ఆ గడువును మాత్రమే పొడిగించినట్లు అభిప్రాయపడింది. ఈ తీర్పు కూడా ప్రాసిక్యూషన్‌ జాప్యం చేసే కేసుల్లో నిందితులకు ఎంతో మేలు చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని అన్ని కోర్టులకు, ట్రిబ్యునళ్లకు చట్టంలాగ వర్తిస్తాయి. సంకట స్థితిలో ఇటువంటి తీర్పులు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరం.

( వ్యాసకర్త: రిటైర్డ్‌ జిల్లా జడ్జి)


logo