ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 02, 2020 , 23:19:52

నిఘావర్గాలను ఏమార్చి..

నిఘావర్గాలను ఏమార్చి..
  • పీవీ-అయోధ్య

విగ్రహ ప్రతిష్ఠ 22, 23వ తేదీల మధ్య రాత్రి సమయంలో జరిగింది. ముందు హెచ్చరికలేమీ లేకుండా చేపట్టిన చర్య అది. అయోధ్య వ్యవహారాలపై చివరగా గూఢచారి శాఖ నివేదిక నాకు 22వ తేదీనే చేరింది. ఆ నివేదికలో గాని, అంతకు పూర్వం 

సమర్పించిన నివేదికలలో గాని మసీదులో విగ్రహాన్ని దొంగచాటుగా గాని, బల ప్రయోగంతో గాని ప్రతిష్ఠించబోతున్నారనే సూచన లేనే లేదు. 

మూడో అధ్యాయం కొనసాగింపు...

డిప్యూటీ కమిషనర్‌ లేఖల పూర్తి పాఠం ఈ క్రింద ఇవ్వబడింది.

డిప్యూటీ కమిషనరు భవనం, ఫైజాబాద్‌ 26 డిసెంబరు 1949 ప్రియమైన భగవాన్‌ సాహే గారూ,నిన్న లక్నో నుండి తిరిగి వచ్చిన కమిషనరు గారు, తమకూ వారికీ మధ్య జరిగిన సంభాషణల్లో తమరీ విషయాలు అడిగినట్లు చెప్పారు. 

1. మసీదులో విగ్రహాన్ని ప్రతిష్ఠించటాన్ని నిలువరించేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు జిల్లా యంత్రాంగం ఎందుకు తీసుకోలేకపోయింది.

2. ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదు? 

లక్నో నుండి తిరిగి వచ్చిన డిప్యూటీ ఇన్‌స్పెక్టరు జనరల్‌ గారు ఈ సాయంత్రం మళ్ళీ తమరీ విషయం అడిగినట్లు చెప్పారు- గుంపు ఎక్కువగా పోగవ్వకుండా అదుపుచేసేందుకు వీలుగా వున్న 23వ తేదీ నాటి ఉదయం విగ్రహాన్నెందుకు తొలగించలేదని.

నేను వివరించే వాస్తవాలు బహుశా మీ ప్రశ్నలకు సమాధానాలుగా నిలువగలవనుకుంటాను.

విగ్రహ ప్రతిష్ఠ 22, 23వ తేదీల మధ్య రాత్రి సమయంలో జరిగింది. ముందు హెచ్చరికలేమీ లేకుండా చేపట్టిన చర్య అది. అయోధ్య వ్యవహారాలపై చివరగా గూఢచారి శాఖ నివేదిక నాకు 22వ తేదీనే చేరింది. ఆ నివేదికలో గాని, అంతకు పూర్వం సమర్పించిన నివేదికలలో గాని మసీదులో విగ్రహాన్ని దొంగచాటుగా గాని, బలప్రయోగంతో గాని ప్రతిష్ఠించబోతున్నారనే సూచన లేనే లేదు. అటు అధికార వర్గాల ద్వారా గాని, ఇటు అనధికార వర్గాల ద్వారా గాని అటువంటిది జరగబోతున్నదనే విషయం తెలియరాలేదు. అయితే తొమ్మిది రోజుల రామాయణ పారాయణం సందర్భంగా పౌర్ణమి రోజున మసీదు ప్రవేశం జరుగుతుందనే పుకారు లేచింది గాని అటువంటి ప్రయత్నమేమీ జరగలేదు.

నేను ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాల్సి ఉంది. ఈ విషయంలో నన్ను కలిసే ముస్లిములెవ్వరయినా గాని, ప్రభుత్వంలోని ఇతర పెద్దల్ని కలిసే వారయినాగాని బలవంతంగా గాని, దొంగచాటుగా గాని మసీదులో విగ్రహాన్ని ప్రతిష్ఠింపబూనుకున్నారనే విషయాన్ని చెప్పలేదు. వాళ్ల ఫిర్యాదులన్నీ మందిరానికి బయట వున్న గోరీల విధ్వంసాన్ని గురించే. వాస్తవానికి, వాళ్లకూ ఈ చర్య అందరి మాదిరిగానే ఆశ్చర్యదాయకమేనే విషయాన్ని నిన్ననే నన్ను కలిసిన ముస్లిం ప్రతినిధి వర్గం ధృవీకరించింది. ఆ ప్రతినిధి వర్గంలో రహ్మత్‌ హుస్సేన్‌ వకీల్‌, హిమాయత్‌ ఉల్లా కిద్వాయ్‌ షకీల్‌, అన్సూర్‌ రెహమాన్‌ మొదలగువారున్నారు. ఆ ప్రతినిధి వర్గంలోని అన్సూర్‌ రెహమాన్‌ చెప్పాడు- 21వ తేదీ సాయంత్రం అయోధ్యలో సభ జరిగిందనీ, అందులో గోవింద్‌ సహాయ్‌జీ, సీతారాం శుక్లాలు మాట్లాడగానే స్థానిక హిందువులు దానిని చెదరగొట్టారనీ, అయితే అక్కడే మళ్లీ కొందరు సమావేశమయ్యారనీ అందులో అయోధ్యకు చెందిన మహారాజా హైస్కూలు మాష్టారు ప్రసంగిస్తూ హిందువులు మసీదులో విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీరాలనీ, ముస్లిములు శుక్రవారం (23వ తేదీ శుక్రవారం) ప్రార్థనలు చేయకుండా అడ్డుకోవాలని ప్రకటించాడు. గూఢచారి విభాగపు నివేదికలో ఆ ఉపన్యాసపు ప్రస్తావనే లేదు. గూఢచారి విభాగపు గ్రూపు ఆఫీసరు ఇప్పుడేదో బనాయించాలని చూస్తున్నాడు. అన్సూర్‌ రెహమాన్‌ ఆ విషయాన్ని వెంటనే నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని వాకబు చేయగా అక్కడ గూఢచారి శాఖ అధికారి ఉన్నాడు గనుక తానుగా చెప్పనవసరం లేదనుకున్నానన్నాడు. నాకు అన్పించేదేమంటే అన్సూర్‌ రెహమాన్‌ కూడా వాళ్లు నిజంగా ఈ దుండగాన్ని తలపెడతారని విశ్వసించలేదు. లేకుంటే ఆయన హుటాహుటిన ఆ వార్తను స్థానిక అధికారులకు చేరవేసే వాడే.

ఈ సందర్భంగా నేను మనవి చేయదలచిన మరో అంశం ఏమంటే ఈ వివాదంలో ముస్లిముల కోపు గాస్తూ లక్నోలోనూ ఇతరచోట్లా వాళ్లతో కలిసి పై అధికారుల్ని కలిసే అక్షయ్‌కుమార్‌ బ్రహ్మచారి సైతం ఇటువంటిది జరుగుతుందని శంకించలేదు. నాతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శిస్తూ ఆయన 23వ తేదీన దానినే ధృవపరచటం జరిగింది. అటువంటి చర్య తలపెడుతున్నారనే విషయం మరెవ్వరికయినా ఆయన చెప్పి ఉంటారని కూడ నేను విశ్వసించను.

మరో విషయమేమంటే ఆ రోజు మూకకు అగ్రభాగాన నిలిచి ఈ తతంగమంతా నడిపిన సాధువు అభిరామ్‌దాస్‌ మహంత్‌ కాదు; అసలు ఏ విధంగా చూచినా నాయకుడు కానే కాదు. ఈ వివాదంలో అతని పేరెన్నడూ ప్రాముఖ్యాన్ని సంతరించుకోలేదు. బాబా భగవాన్‌ దాస్‌తో సహా ఏ నాయకుని ప్రసంగమూ హింసను ప్రబోధించలేదు; ప్రతిచర్య గైకొనవలసిన విధంగానూ లేవు. ఆ విధంగా నాయకుల్ని నిర్బంధించటం గాని వాళ్లకు వ్యతిరేకంగా తగిన చర్యలు తీసుకొనవలసిన అవసరంగాని కన్పించలేదు. ఈ వివాదంలో ప్రజాభిమానంపై ఆధారపడి కృతనిశ్చయులైన కొద్దిమంది చేపట్టిన ఈ దుండగపు చర్య నాయకుల్ని నిర్బంధించినంత మాత్రానా అరికట్టబడేదని నేననుకోను. నిర్బంధాలు ఈ సంక్షోభాన్ని అరికట్టలేకపోగా మరో రూపంలో విషయాన్ని మరింతగా జటిలం చేసేవి.

(‘అయోధ్య’పై మాజీ  ప్రధాని పీవీ రాసిన పుస్తకం నుంచి..)


logo