శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jul 02, 2020 , 00:03:52

సింగరేణిపై కేంద్రం కత్తి

సింగరేణిపై కేంద్రం కత్తి

బొగ్గు గనులపై ప్రభుత్వ పర్యవేక్షణ తొలగిస్తాం... ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకుటున్నాం. బొగ్గు గనుల్లో కమర్షియల్‌ తవ్వకాలకు అనుమతి ఇస్తాం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ఈ చిన్న ప్రకటన చాలు.. ప్రభుత్వ రంగ సంస్థల మీద కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ తెలియజెప్పడానికి. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణిపై కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి సవతి తల్లి ప్రేమనే. నల్ల సూరీళ్ల చెమట చుక్కల నుంచి వెలుగుల దిశగా ప్రయాణం సాగించిన సింగరేణి సంస్థకు గడ్డుకాలం దాపురించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కార్మికులు ఆ సంస్థకు దూరం కావాల్సిన దుస్థితి. భవిష్యత్తు లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా కాకుండా కేవలం ప్రైవేటు వారికే బొగ్గును ధారాదత్తం చేసే దిశగా కేంద్రం అడుగులు వేసింది. దీనికి వ్యతిరేకంగా గురువారం 24 గంటల సమ్మెకు టీబీజీకేఎస్‌ పిలుపునిచ్చింది.

సింగరేణి సిరుల వేణి... ప్రత్యక్షంగా వేలాది మందికి.. పరోక్షంగా లక్షలాది మందికి కొంగుబంగారం. 3,953 భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ప్రధాన ఇంధనంగా, దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధికి, విద్యుత్‌ వెలుగులు అందించడానికి సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గే ప్రధాన కారణం.  పనులు లేక పస్తులతో కడుపు చేత పట్టుకుని వచ్చిన ఎంతో మందిని అక్కున చేర్చుకుని అన్నం పెట్టిన అమ్మ. తన భూగర్భంలో అమూల్యమైన సంపద దాచుకుని అందరికి వెలుగులు పంచే సింగరేణి ఇపుడు చీకట్ల చాటున మగ్గిపోనుంది. కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో చేస్తున్న పనుల వల్ల ఆ సంస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. మొదటి నుంచి సింగరేణిపైన గతంలో ఇక్కడి పాలకులు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూశారు. కేవలం ఇక్కడ సంపద తరలించుకుపోవడం, ఉద్యోగాలు కొల్లగొట్టడం మాత్రమే పాలకుల ఆలోచనగా మారింది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన సింగరేణి తల్లి విధ్వంసానికి గురైంది. అటు కాంగ్రెస్‌, ఇటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రుల్లో ఎవరూ కూడా సింగరేణిని పట్టించుకున్న పాపాన పోలేదు.  

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి వెలుగులు విరజిమ్ముతూ ముందుకు సాగుతున్నది. ఏటా వందల కోట్ల లాభాలతో ముందుకు సాగుతున్నది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న యువతకు అది ఒక కల్పవృక్షంగా నిలుస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎక్కువ ఉద్యోగావ కాశాలు కల్పించి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తొలి ఉద్యోగ ఫలాలను అందించి కలలను సాకారం చేసిన ఘనత సింగరేణి సంస్థకే దక్కింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కార్మికులకు ఎన్నో మంచి పరిణామాలు జరిగాయి. కోల్‌ ఇండియాలో లేని  కారుణ్య నియామకాలు, పలు సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి. 

ఇలా నల్ల నేలలో నవ్వులు కురుస్తున్న వేళ కేంద్రానికి కన్ను కుట్టింది. దేశంలో ఉన్న 500 బొగ్గు బ్లాక్‌లను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.  41 బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేటుపరం చేసేందుకు ఆ వేలం ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభిం చారు. దీంతో కేవలం సింగరేణి సంస్థకే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ఇండియాకు కూడా పెద్ద దెబ్బగా మారనున్నది.  ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుని వాటి పురోభివృద్ధికి కృషి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని మరిచి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వెనక పెద్ద కుట్ర ఉన్నది. ఇప్పటివరకు కోల్‌ ఇండియా, సింగరేణి సంస్థలు మాత్రమే బొగ్గు  బ్లాక్‌లు దక్కించుకునేవి.  ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఏ ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థ అయినా ఈ బ్లాక్‌లు దక్కించుకునే అవకాశం ఉన్నది. దీంతో ఈ రెండు సంస్థలు తీవ్రంగా నష్టపోతాయి. 

కోల్‌ ఇండియా, సింగరేణి నుంచి బొగ్గు కొనే సంస్థలు ఆ బ్లాక్‌లు దక్కించుకుంటే మరి బొగ్గు కొనేది ఎవరు..? అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ సంస్థలు తిరిగి నష్టాల బాట పట్టే అవకాశం ఉన్నది. లేదా పూర్తి స్థాయిలో మూతపడతాయి. కొత్త బొగ్గు బ్లాకులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. కొనుగోలు చేసు కునే వారు సదుపాయాలు ఇతర వ్యవహారాలు చూసుకుం టారు, దీనికి ప్రత్యేకంగా కేంద్రం నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్న.  ఈ వేలం ద్వారా 2.8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాన మంత్రి మోదీ వెల్లడించారు. ఈ స్థాయిలో ఉద్యోగకల్పన ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి బొగ్గు గనులు వెళితే చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురుకాను న్నాయి. మొదటగా బొగ్గు తక్కువ ధరకు అమ్ముతారు. ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్‌ ఇండియా, సింగరేణి తక్కువ ధరకు బొగ్గు అమ్మలేవు. దీంతో అవి దివాళా తీస్తాయి. ఆ తర్వాత ప్రైవేటు రంగ సంస్థలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ధరను పెంచి బొగ్గు అమ్మకాలు సాగిస్తారు.  

  ఇక సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి తన వాటా పేరుతో వేల కోట్ల రూపాయలు తీసుకుపోవడం తప్ప సింగరేణి సంస్థకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం సింగరేణికి నయా పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. ప్రతి బడ్జెట్‌లో సింగరేణికి ఏ రకంగా కూడా కేటాయింపులు లేవు. ఒక రకంగా కేంద్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నది. సింగరేణి ఏటా శిస్తు రూపేణా రూ.3,500 కోట్ల వరకు కేంద్రానికి చెల్లిస్తున్నది. కేంద్రానికి ఉన్న 49 శాతం వాటాధనం పెరుగు తూ వస్తున్నది. కార్మికుల చెమట చుక్కలతో సింగరేణిలో 18 ఏండ్లుగా లాభాల బాట పట్టింది. ఈ సంస్థ లాభాలు రెట్టింపు అయ్యాయి. వృద్ధి రేటు కూడా అప్రతిహతంగా 16 శాతం పెరిగింది. ఇలా పెరిగిన లాభాలు, వృద్ధి రేటు పైన కూడా కేంద్రానికి డివిడెంటు చెల్లిస్తున్నారు. 52 మిలియన్‌ టన్నుల నుంచి 64 మిలియన్‌ టన్నుల వరకు ఉత్పత్తి పెరిగింది. ఆ మేరకే కేంద్రానికి వేలాది కోట్ల రూపాయల చెల్లింపులు సింగరేణి తరఫున జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో సింగరేణి బీఐఎఫ్‌ఆర్‌ పరిధిలో వెళ్లిన సందర్భంలో అప్పుడు కేంద్రం సాయం చేసింది. దాదాపు  రూ.1,200 కోట్ల మేర ఇచ్చింది. దానిని కూడా వడ్డీతో సహా వసూలు చేసుకున్నది. 

సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఏర్పాటు చేసుకున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా విదిలించలేదు. సింగరేణి కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడో, విస్తరణ విషయంలోనో కేంద్ర సాయం కనీస స్థాయిలో కూడా ఉండటం లేదు. ఇలా అన్ని రకాలుగా మొండి చేయి చూపుతున్న కేంద్రం.. సింగరేణిని ఆదుకోవాల్సింది పోయి ప్రైవేటు సంస్థలతో పోటీలో నిలబెడుతున్నది. బొగ్గు బ్లాక్‌లు నేరుగా ఇవ్వకుండా ప్రైవేటు వారిని ఆహ్వానించడంతో ఆయా సమయాల్లో ఇవ్వాల్సిన నాలుగు నుంచి ఐదు శాతం కమీషన్‌ అటు కోల్‌ ఇండియా, ఇటు సింగరేణి కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలతో తన నిజస్వరూపం బయటపెట్టు కుంటున్నది. చైతన్యం ఎక్కువగా సింగరేణి కార్మికులు దీన్ని పూర్తి స్థాయిలో వ్యతి రేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 


logo