గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 01, 2020 , 23:56:45

‘టిక్‌టాక్‌' సందేశం

‘టిక్‌టాక్‌' సందేశం

సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో చైనాకు చెందిన టిక్‌టాక్‌ తదితర 59 యాప్‌లను నిషేధించడం సరిహద్దు భారత్‌ చేసిన బలమైన హెచ్చరిక. టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌, మై వీడియో కాల్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ, కామ్‌ స్కానర్‌ తదితర యాప్‌లను జాతీయ భద్రతకు, సార్వభౌమత్వానికి ముప్పుగా అభివర్ణిస్తూ కేంద్రం నిషేధించింది. వీటిని వివరణ కోరినప్పటికీ, అది చట్టం ప్రకారం అనుసరించవలసిన లాంఛనం మాత్రమే. ప్రభుత్వం పైకి భద్రతా కారణాలు చెప్పినా, సరిహద్దు పరిణామాలే ఈ నిషేధానికి కారణమనేది స్పష్టం. భారతీయ సైనికులపై చైనా దాడి చేసి ఇరవై మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిషేధం ద్వారా చైనాకు హెచ్చరిక చేయడమే కాకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించినట్టయింది. 

ఇప్పటికిప్పుడు చైనాతో వాణిజ్య ఘర్షణకు దిగడం మంచిదా అనే చర్చ మన దేశ వాణిజ్యవేత్తలలో జరుగుతున్నది. చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలనేది ఈ నిషేధం వెనకున్న లక్ష్యం కాదు. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారత్‌ ఇంకా నిషేధం విధించనే లేదు. కొన్ని మూల పదార్థాల మీద నిషేధం విధించడం వల్ల మనదేశ వ్యాపారసంస్థలు కూడా నష్టపోతాయనేది వాస్తవం. అలవోకగా నిషేధాలు విధిస్తూ పోతే, చైనా కాకుండా ఇతర దేశాలలోని వ్యాపార సంస్థలు కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సంకోచిస్తాయి. దీర్ఘకాలిక వ్యూహంతో, చైనా వస్తువులకు ప్రత్యామ్నాయంగా మన దేశంలోనే చౌకగా ఉత్పత్తి చేసుకోవడం ఉత్తమమైన మార్గం. అందుకే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తున్నది. చైనా యాప్స్‌పై నిషేధం ప్రతీకాత్మకమైనది. సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలపై ఒక విధమైన నిరసన, హెచ్చరిక మాత్రమే. 

కొన్ని యాప్స్‌పై నిషేధం విధించినందు వల్ల చైనా ఆర్థికవ్యవస్థకు చెప్పుకోదగినంత నష్టం ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఆ దేశానికి చెందిన కొన్ని వ్యాపారసంస్థలకు నష్టం వాటిల్లుతుంది. గతేడాది ఏప్రిల్‌లో బైట్‌ డాన్స్‌ అనే యాప్‌ను మన దేశం తాత్కాలికంగా నిషేధించినప్పుడు, ఆ సంస్థ రోజుకు ఐదు లక్షల డాలర్లకు పైగా నష్టపోతున్నామని ఆందోళన వెలిబుచ్చింది. తాజాగా ప్రభుత్వం నిషేధించిన యాప్‌లకు అన్నిటికీ కలిపి నెలకు యాభై కోట్ల యాక్టివ్‌ యూజర్లు ఉన్నట్టు అంచనా. చైనా యాప్స్‌పై నిషేధం విధించిన తరువాత మన దేశానికి చెందిన అప్లికేషన్స్‌కు డిమాండ్‌ పెరగడం గమనార్హం. టిక్‌టాక్‌ను పోలిన వీడియో షేరింగ్‌ యాప్‌ చింగారీకి గంట వ్యవధిలోనే లక్ష డౌన్‌లోడ్స్‌ జరిగాయని అంటున్నారు. సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగితే ఈ నిషేధం క్రమంగా ఇతర రంగాలకూ విస్తరించవచ్చు. ఇతర దేశాలకూ పాకవచ్చు. చైనా ఆత్మవిమర్శ చేసుకొని దిద్దుబాటుకు ఉపక్రమించడమే ఈ సమ స్యకు అసలు పరిష్కారం


logo