శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jul 01, 2020 , 23:56:45

నిష్కామయోగి నరసింహుడు

నిష్కామయోగి నరసింహుడు

పీవీ ప్రధాని అయ్యాక స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఎర్రకోటపై జెండాను ఎగురవేస్తూ ‘ఒక సామాన్య కుటుంబంలో, కుగ్రామంలో పుట్టిన నేను ఈరోజు ఎర్రకోట పైనుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నానంటే ఇది మన రాజ్యాంగం మహత్తు’ అంటూ రాజ్యాంగం మీద ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఏరోజూ ఏ వ్యక్తితో అగౌరవంగా మాట్లాడటంగానీ, రాజకీయ నాయకుడిగా ఏ ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా విమర్శించని అజాతశత్రువు. అలాంటి వ్యక్తిత్వం రాబోయే తరాలకు మార్గదర్శకం. ఇంతటి మహనీయుడిని భారతరత్న పురస్కారంతో గౌరవించినప్పుడే అది ఈ జాతి ఆయనకు ఇచ్చే నిజమైన, ఘనమైన నివాళి.

పదిహేడేండ్ల ప్రాయంలో రాజకీయరంగంలో ప్రవేశించి రాష్ట్రంలో, కేంద్రంలో కీలకమైన ఎన్నో మంత్రిత్వశాఖల్లో పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా అత్యంత కీలక పదవులను అలంకరించిన వారికి ఒక ఇల్లు అమ్మాల్సిన అవసరం అంటే అదొక ఆశ్చర్యం. 

ఏభేషజాలు, ఆడంబరాలు లేకుండా అందరిలో కలిసిపోయే మాన్యులు నిరాడంబరంగా జీవిస్తూ ఆత్మను అన్వేషిస్తుంటారు. వారు నిజమైన యోగులుగా తమదైన మార్గాన్ని ఎన్నుకొని తమ బాటన పదిమందినీ నడిపిస్తూ ఆత్మయోగులవుతారు. పీవీ అలాంటి కోవకు చెందిన నిష్కామయోగి. ఉన్నత పదవులు అధిష్ఠించినా వాటికి కొత్త వన్నెలు తెచ్చారేతప్ప తన స్వార్థానికి వినియోగించుకోలేదు. 

ప్రధానమంత్రి పదవి నిర్వహించినప్పుడు ఆర్థిక సంస్కరణలతో దేశానికి కొత్త దిశను నిర్దేశించారు. రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారు. ఏ రాజకీయ సంబంధం లేని ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిగా నియమించుకున్నారు. ప్రపంచీకరణ, సరళీకరణ వంటి విధానాలతో వీరిరువురూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని, దేశ ఆర్థిక దశ దిశలను మార్చేశారు. ఈ మార్పులను చూసి ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతి చెందాయి. మనదేశంలో మాత్రం పీవీకి రావాల్సిన గుర్తింపు రాలేదు. నంద వంశంచేత నిరాదరుడైన, చంద్రగుప్తమౌర్యుని తన తెలివితేటలతో ఒక మహా చక్రవర్తిని చేసిన చాణక్యుడి వలె పీవీ వ్యవహరించారు. ఆర్థిక సంస్కరణల కారణంగా.. కుప్పకూలే దేశం ఆయన వల్ల అగ్రరాజ్యాలకు పోటీగా నిలబడింది. ఆ సంస్కరణలు చరిత్రలోనే మేలు రాయి.

పోఖ్రాన్‌ అణుపరీక్షల అంశంలోనూ పీవీ చొరవ తక్కువదికాదు. అంతా సిద్ధమై పరీక్షించే సమయానికి ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగిపోయింది. ఆ ఘనత తనకు దక్కలేదనే భావన ఇతరులు కల్పించినా పీవీ దానిని పట్టించుకోలేదు. ప్రధాని వాజపేయిని కలిసి అణు పరీక్షలు నిర్వహించాలని కోరడం భారత రక్షణ పాటవాలపై ఆయనకున్న శ్రద్ధను తెలియజేస్తుంది. పీవీ అనేక తప్పుడు కేసులను కూడా ఎదుర్కొన్నారు. వాటినుంచి నిర్దోషిగా బయటపడ్డారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎంపీలకు ముడుపుల కేసులో వాదోపవాదాలు జరిగాక ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. తన అత్యంత సన్నిహిత అనుచరునితో ‘జూబ్లీహిల్స్‌లో నాకో ఇల్లు ఉంది. అది అమ్మి పెడతావా’ అని అడిగారు. ఆ అనుచరుడు దిగ్భ్రాంతి చెంది ‘మీకు అంత అవసరం ఏమొచ్చింది సార్‌. మీకు మాజీ ప్రధానిగా నివాసగృహం, నౌకర్లు, పెన్షను అన్నీ ఉంటాయి..’ మెల్లిగా నసుగుతూ అన్నాడు. 

నిజమే.. పదిహేడేండ్ల ప్రాయంలో రాజకీయ రంగంలో ప్రవేశించి రాష్ట్రంలో, కేంద్రంలో కీలకమైన ఎన్నో మంత్రిత్వశాఖల్లో పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా అత్యంత కీలక పదవులను అలంకరించిన వారికి ఒక ఇల్లు అమ్మాల్సిన అవసరం అంటే అదొక ఆశ్చర్యం. కానీ ఆ అవసరం ఎందుకంటే నిర్దోషిగా తనను బయట పడేయడానికి. కోర్టులో వాదించిన లాయర్లెవరూ అడ్వాన్సుగా ఒక్క రూపాయి కూడా అడగలేదు. పదవి పోయాక ఇన్‌సైడర్‌ పుస్తకం రాస్తే దానిమీద వచ్చిన రాయల్టీని అప్పుడప్పుడు కొంత ఇచ్చినా ఇంకా ఇవ్వాల్సింది లక్షల్లో ఉండి ఉంటుంది. ఆ బాకీ తీర్చకుండా చనిపోతానేమోనని భయంగా ఉంది.. అని ఆయన అన్నారట. ఈ మాటలకు కండ్లు చెమర్చక తప్పదు. ఆ మాటలు విన్న అనుచరుడు తట్టుకోలేక భోరున ఏడ్చేశాడు. ఇది ఆయన మీద  సానుభూతి కాదు. అడుగడుగున డబ్బుతో ముడిపడి ఉన్న ఈ వ్యవస్థలో ఇంత గొప్ప మహానుభావుడు ఉన్నాడా ఉంటాడా అని హృదయ స్పందన.

ఆ ఒక్క ఇల్లు అమ్మేస్తే మిగిలిన జీవితం ఎట్లాగని వేసిన మరో ప్రశ్నకు.. ‘ఏముంది ఆలోచించడానికి.. పిల్లలంతా సెటిల్‌ అయిపోయారు. నేనొక్కడిని ఉండటానికి ఒక్క గది చాలు. తినడానికి అన్నం పప్పు చాలు. ఏదైనా జబ్బు చేస్తే మాజీ ప్రధానిగా ముద్ర ఉంది..’ ఇలా చాలా నిశ్చింతగా జవాబు చెప్పారు. ‘ఆ ఇంటికి ధర పలకాలని చూడకు. వకీళ్ళ బాకీ తీరితే చాలు’ అని చెప్తుంటే ‘మీ చేతుల మీదుగా కోట్ల రూపాయల నిధులు ఖర్చు అయ్యాయి. మరి అడ్వకేట్‌ ఫీజులు వాటిల్లో..’ అతడు పూర్తి చేయకుండానే ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. ‘అది పార్టీ ఫండ్‌. నా సొంతానికి వాడేది కాదు. నేను రాసిన రెండు మూడు పుస్తకాలున్నాయి. కానీ అవి ఎప్పటికి అచ్చయి మార్కెట్‌లోకి వెళ్లి రాయల్టీ వస్తుందో. అప్పటిదాకా వాళ్ళ రుణం తీర్చకుండా.. నాకేమైనా అయితే..’ ఇదే మాట. ఇదే ఆలోచన. మునిలా మౌనంగా ఉండి, ఋషిలా జ్ఞానుడైన ఆ మనీషికి ఋణగ్రస్థుడు కాకూడదని ధర్మ కర్మ సిద్ధాంతం. ఈ గొప్పతనాలన్నీ ఎవరివల్ల పీవీకి కట్టబెట్టినవి కావు. స్వయంగా ప్రతిపాదించుకున్నవే. ఆయనను మించిన త్యాగధనులు, మేధావులు ఉంటారేమోగానీ ఏ దేశ నాయకుని కన్నా మిన్నగా ప్రజాహృదయాల్లో చోటుచేసుకున్న నాయకుడు పీవీ. 


logo