శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jul 01, 2020 , 23:56:43

తెలంగాణలో సాగు సంబురం

తెలంగాణలో సాగు సంబురం

మనం పప్పుధాన్యాలను ఏటా ఇతర రాష్ర్టాల నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం.ఈ పప్పుధాన్యాల వల్ల పోషక విలువలతో కూడిన మంచి పౌష్టికాహారం అందుతుంది. తెలంగాణలో కంది, పెసర, మినుము లాంటి పప్పు దినుసులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్నది. కాబట్టి పప్పు ధాన్యపు పంటలు పండించడం వల్ల రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నియంత్రిత పంటల సాగులో భాగంగా పప్పుధాన్యాల పంటల విస్తీర్ణం కూడా పెరుగుతుంది.

దేశ చరిత్రను ఎన్నిసార్లు తిరగేసినా రైతు నవ్విన రాజ్యాలే కలకాలం నిలబడ్డాయి. ప్రాచీన కాలమైనా, సాంకేతిక యుగమైనా వ్యవసాయమే అన్నిటికి సాయం చేసింది. నీళ్లకేడ్చి, దూపకేడ్చి, పిడికెడు మెతుకుల కోసం వేచిచూసిన ఒకప్పటి తెలంగాణ నేడు పండుగలా మారనున్నది. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి పథకాలతో పాటు ప్రాజెక్టులు పూర్తిచేయడం, ఉచిత విద్యుత్‌ను ఇవ్వడం వెరసి కొత్త ఆయకట్టు రాష్ట్రంలో పురుడు పోసుకోబోతున్నది. ఈ నేపథ్యంలో రైతు అధిక దిగుబడులు సాధించి, పండించిన ప్రతి గింజకు మార్కెట్లో మంచి ధర లభించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త పంథాలో నియంత్రిత పంటల సాగు విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా రాబోయేరోజుల్లో వ్యవసాయరంగంలోని సవాళ్లను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

తెలంగాణలో దినదిన ప్రవర్ధమానమవుతున్న వ్యవసాయాన్ని చూసి సాగే సంబురపడుతున్నది. మెట్ట పంటల సాగు రాష్ట్రం నుంచి మాగాణి తెలంగాణగా మారిన తీరులో సుదీర్ఘ చర్చలు, వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలు, మేధావుల సమాలోచనలు, పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యవేక్షణ ప్రత్యేకంగా కనిపిస్తాయి. విత్తనం మొదలుకొని మార్కెటింగ్‌ చేసేవరకు రైతుకు ఎదురవుతున్న ప్రతి చిన్న సమస్యపై ప్రభుత్వం తర్జన భర్జనలు జరిపి సమూల సంస్కరణలు చేపట్టింది. ఫలితంగానే నేడు అత్యుత్తమ వ్యవసాయ విధానాలతో దేశంలో ‘వ్యవసాయ నాయక రాష్ట్రంగా’ వెలుగుతున్నది తెలంగాణ.

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని పట్టించుకున్న వారే లేరు. సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేసిన విధానం అద్వితీయం. రాష్ట్రంలో సాగు కష్టాలను తవ్వితీశారు. కారణాలు తెలిశాయి. కాయకల్ప చికిత్స మొదలైంది. భూములకు లెక్కలు దొరికాయి. భూసార పరీక్షలు మొదలయ్యాయి. సారాన్ని బట్టి, వాతావరణ అనుకూలతలు బట్టి పంటల సాగు చేసేందుకు ప్రభుత్వం రైతును మేల్కొల్పింది.

పంటల దిగుబడి పెంచడంలో, సాగునీటి వాడకం సామర్థ్యం పెంచటంలో ప్రధాన పాత్ర పోషించే బిందు, తుంపర సేద్యాలకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించింది. ఫలితంగా పండ్లు, కూరగాయల పంటల్లో రైతులు లాభాలను ప్రత్యక్షంగా చూశారు. హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాలకు కూరగాయల కొరతను తీర్చేందుకు ఎకరానికి 30 లక్షల రూపాయలకు పైగా సబ్సిడీ ఇచ్చి గ్రీన్‌హౌజ్‌ సాగును ప్రోత్సహించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచంలోనే ఒక్క రైతుకు ఇంత మొత్తంలో భారీ సబ్సిడీనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రబీ కాలంలో ఒకప్పటి కరువు జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో యాసంగిలో పల్లి భారీగా సాగు కావటానికి ప్రధాన కారణం బిందు, తుంపర సేద్యాలే. కూరగాయ పంటలను హైదరాబాద్‌, పెద్ద నగరాల చేరువలో ఎక్కువగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. పూలు, పండ్లు, కూరగాయలకు సంబంధించి రెండు ‘సెంటర్స్‌ ఒఫ్‌ ఎక్స్‌లెన్స్‌'లను జీడిమెట్ల, ములుగులలో ఏర్పాటుచేసింది. అలాగే సబ్సిడీ ద్వారా శాశ్వత పందిర్లను రైతుల కమతాలలో ఎక్కువగా ప్రోత్సహించింది. రాష్ట్రంలో విత్తన పంటల ఉత్పత్తికి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్ది దేశ విత్తన భాండాగారంగా వెలుగొందేలా చేసింది. దేశానికి కావలసిన విత్తనాల్లో 60 శాతం విత్తనాలు తెలంగాణ రాష్ట్రమే అందిస్తున్నది. కల్తీ విత్తనం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కఠినంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ తనిఖీ బృందాలను ఏర్పాటుచేసి కల్తీ విత్తనాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.

వరి పంటకు తెలంగాణ అనుకూలం కాదని విషప్రచారం చేసిన నోళ్లే ఇప్పుడు ఔరా అంటున్నాయి. సంవత్సరం వరి పండిస్తే మరో సంవత్సరానికి సరిపోను బియ్యం ఉత్పత్తికి నోచుకుని నేడు ‘భారత దేశ అన్నపూర్ణ’గా విరాజిల్లుతున్నది తెలంగాణ. ప్రభుత్వం యాసంగిలో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో వడ్లు సేకరించి వారికి గిట్టుబాటు అయ్యేలా చేసింది. రానున్నకాలంలో 2.5 కోట్ల టన్నులకు పైగా ధాన్యం వస్తుందనటంలో సందేహం లేదు. ఎక్కువ మొత్తంలో సన్నరకాలను పండించి పేద ప్రజలందరికీ పీడీఎస్‌ ద్వారా అందించే ప్రయత్నం మొదలైంది.

మనం పప్పుధాన్యాలను ఏటా ఇతర రాష్ర్టాల నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పప్పుధాన్యాల వల్ల పోషక విలువలతో కూడిన మంచి పౌష్టికాహారం అందుతుంది. తెలంగాణలో కంది, పెసర, మినుము లాంటి పప్పు దినుసులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్నది. కాబట్టి పప్పు ధాన్యపు పంటలు పండించడం వల్ల రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నియంత్రిత పంటల సాగులో భాగంగా పప్పుధాన్యాల పంటల విస్తీర్ణం కూడా పెరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలా అన్ని కోణాల్లో ఆలోచించారు. నిపుణులతో, అధికారులతో పలు పర్యాయాలు అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించి పకడ్బందీగా సుస్థిరమైన సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వం కొత్త పంథాలో తీసుకువచ్చిన ఈ నూతన వ్యవసాయ విధానం దేశానికే ఆదర్శం కాబోతున్నది.


logo