ఆదివారం 05 జూలై 2020
Editorial - Jul 01, 2020 , 00:05:05

పీవీ-అయోధ్య

పీవీ-అయోధ్య

1949 డిసెంబర్‌ 23వ తేదీ. రాత్రి బాగా పొద్దుపోయింది. కొందరు వ్యక్తులు అప్పుడు చేసిన పనులు స్వతంత్ర భారతంలో అత్యంత కలహకారకమై నిలువనున్నాయి. చలితో వణికిస్తున్న ఆ రాత్రి సమయంలో సరయూ నది నీళ్లతో నింపిన ఒక తిత్తి, రామ్‌లల్లా విగ్రహాలు, ఓ రాగిపాత్ర.. రామ్‌ చబూత్రా నుంచి బాబ్రీ మసీదు వైపునకు తరలించబడినాయి.

అయోధ్య 1949: విగ్రహాలు మసీదులోకి

ఆతీర్థ స్థలం వద్ద రెండు డజన్లకుపైనే పోలీసులు కాపలా ఉన్నారు. దొంగచాటుగా ప్రవేశించే ఆ ముఠాను పోలీసులు గమనించలేదు. వెలుపలి లోపలి ప్రాంగణాలకు మధ్య ఉన్న ప్రహరీ గోడను దాటుకొని ఆ ముఠా లోపలికి చేరుకుంది. లాంతరు వెలుగులో కొందరు గర్భగుడి వంటి పరమ పవిత్రస్థలాన్ని కడిగి శుద్ధి చేసి దానిపై పవిత్రమైన వస్ర్తాన్ని పరిచి దానిపై విగ్రహాన్ని ఉంచారు. దానిపై మళ్లీ ఎంతో పూజనీయంగా మరో వస్ర్తాన్ని కప్పి దానిముందు అగరుబత్తీలను వెలిగించారు.

‘ప్రకట్‌ కృపాలా, దీన్‌దయాలా..’ అంటూ ఆ ముఠా మంత్రాలు చదువటం మొదలెట్టగానే బయట ఉన్న పోలీసుల్లో ఆందోళన, హడావిడి. అప్పుడు వేకువఝామున మూడున్నర గంటల సమయం. అయితే ఈ విషయం వెంటనే అధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్లబడలేదనేది నేటికీ ఎవ్వరికీ అంతుబట్టని విషయమే. అయోధ్య పోలీసు ఠాణా అధికారి రామ్‌దేవ్‌ దూబే తెల్లవారిన తర్వాత ఏడు గంటల ప్రాంతానికి ఆ స్థలానికి చేరుకున్నారు. పోలీసు ఠాణా అక్కడికి ఒక కిలోమీటరు ఉండీ ఉండనట్లుగా ఉంటుంది. బహుశా ఆయన నిత్యం తనిఖీకి వచ్చినట్లే అక్కడికి వచ్చి ఉండాలి. ఆయన ఎఫ్‌ఐఆర్‌లో ఇలా రాయటం జరిగింది.

‘దాదాపు ఉదయం ఏడు గంటలకు ‘జనమ్‌ భూమి’ చేరుకునేప్పటికి విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబులు (నం.7) మాతా ప్రసాద్‌ నాకు తెలియజేసిన ప్రకారం ఆ రాత్రి ఓ యాభై- అరవై మంది వ్యక్తులు తాళాలు పగులగొట్టి, గోడలెక్కి దూకి మసీదులోకి ప్రవేశించి అక్కడే శ్రీరామచంద్రజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వాళ్లు లోపలా బయటా గోడ మీద ఎరుపు పసుపు రంగుల్తో ‘సీతారామ్‌' వంటి పదాలను కూడా రాశారు. ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న హన్స్‌రాజ్‌ అనే కానిస్టేబులు ఆ విధంగా చేయవద్దని వాళ్లకు చెప్పినా వాళ్లు వినలేదు. అక్కడే ఉన్న సాయుధ బలగాన్ని పిలిచేటప్పటికే వాళ్లంతా మసీదులోకి ప్రవేశించారు.’ ఈ కేసు భారతీయ శిక్షాస్మృతిలోని 147/448/295 సెక్షన్ల కింద మహంత్‌ అభిరామ్‌దాస్‌, సుదర్శన్‌దాస్‌, రామ్‌శకల్‌దాస్‌ మరో యాభై మంది పైన మోపబడింది. మిగతా యాభై మంది పేర్లు తెలియదు.

అప్పటికే అయోధ్య అంతటా అక్కడ విగ్రహం వెలిసినట్లు వదంతులు వ్యాపించాయి. అది రామజన్మభూమి గనుకనే రాముడు అక్కడ వెలిశాడని నిర్ధారించేట్లుగా వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఆ చిత్రమైన ఘటనను గూర్చి చుట్టుపక్కల పల్లెల్లో టముకు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతికి గుర య్యింది. ప్రజలు తండోపతండాలుగా అక్కడకు తరలి వస్తూండటంతో ఏమీ చేయలేక అలా చూస్తూండిపోయింది. మధ్యాహ్నానికి అక్కడ గుమిగూడిన వారి సంఖ్య 5000కు చేరుకుంది. ఆ మరుసటిరోజు ఉదయం నుంచి కట్టడం లోప లికి చేర్చిన విగ్రహాలకు పూజలు పెద్ద ఎత్తున ప్రారంభమ య్యాయి. స్థానికులైన హిందువులు ముస్లిముల మధ్య చోటుచేసుకున్న ఆగ్రహావేశాల కారణంగా ఫైజాబాద్‌ పట్టణ మేజిస్ట్రేటు గురుదత్తసింగ్‌ 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేటు నివేదిక మిగతా సమాచారం ప్రకటిత మైన తర్వాత సెక్షను 145 కింద చర్యలు గైకొనబడినాయి. ప్రాంగణాన్ని స్వాధీనపరచుకొని రిసీవర్‌కు అప్పగించటం జరిగింది. ఫైజాబాద్‌ పట్టణం మున్సిపల్‌ బోర్డు ఛైర్మను రిసీవరుగా ఉన్నారు. నేర న్యాయపరిధిలోని ఈ ప్రాథమిక చర్యలు గైకొన్నది ప్రధానంగా పూర్వపుస్థితిని పునరుద్ధరించి స్థాని కంగా శాంతికి భంగం వాటి ల్లకుండా చూచేందుకే. అలా అనుకునేందుకు కారణం లేకపోలేదు. ఆరోజు మధ్యాహ్నం 2-30 గంటలకు డీఐజీ, సంఘట నా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా మేజిస్ట్రేటు కే.కే.కే.నా యర్కు పంపిన లిఖిత పూర్వక ఆదేశాలను అందజేశారు. ఆ ఆదేశాలివే. 

1.మనం అనుసరించాల్సిన విధానపు ముఖ్య ఉద్దేశం పూర్వపుస్థితిని కొనసాగించటమే. మార్పులు ఇరువర్గాల సమ్మతిలోనే చేపట్టాల్సి ఉంటుంది. బలప్రయోగంతోనో, పన్నాగంలోనే స్థితిలో మార్పు వచ్చేందు కు అనుమతించరాదు. 2.మన విధానాన్ని అమలుపరిచేందుకు అవసర మైతే బలగాలను (స్వల్పాతి స్వల్పంగా) వాడవచ్చు. 3.విషయం పక్కదారి పట్టకుండా ఉండేందుకుగాను కాల్పుల వంటి ఉద్రేకపూర్వక చర్యలకు దిగరాదు; కావాలంటే ఎందరినైనా నిర్బంధించవచ్చు. 4.ఆ పరిస్థితులను బట్టి చర్య తీసుకునే స్వేచ్ఛ మీకుంది.

 భగవాన్‌ సాహే 23-12-49 (‘అయోధ్య’పై మాజీ  ప్రధాని పీవీ రాసిన పుస్తకం నుంచి...)logo