ఆదివారం 05 జూలై 2020
Editorial - Jul 01, 2020 , 00:05:06

సచివాలయానికి సై

సచివాలయానికి సై

సచివాలయ ప్రాంగణంలో పాత భవనాలను కూల్చివేసి కొత్త సముదాయాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపియాలంటూ కొందరు వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయం. ఇందుకు సంబంధించి మంత్రివర్గ నిర్ణయంలో చట్టపరమైన లోపాలేమీ లేవని హైకోర్టు స్పష్టం చేసింది.  పాత భవన సముదాయం ఇప్పటి అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల పలు అగ్ని ప్రమాదాలు జరిగాయి. వివిధ శాఖల కార్యాలయాలు నగరంలో అక్కడక్కడా విసిరేసినట్టు ఉండటం వల్ల ప్రజలు, ఉద్యోగులు, నేతలకు కాలయాపన, వ్యయప్రయాసలు కలుగుతున్నవి. అద్దె భవనాలకు ఏటా కోట్ల రూపాయలు చెల్లించవలసి వస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలనుకోవడంలో తప్పేమీ లేదు. 

అసెంబ్లీ భవనం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు మొదలైనవన్నీ ఒకేచోట ఉంటే కార్యనిర్వహణ సాఫీగా సాగుతుందనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఇందుకోసం సికిందరాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానం ఇవ్వాలని కోరితే కేంద్రం ఇవ్వనేలేదు. సచివాలయాన్ని పాతచోటే కడదామంటే దానిని కూడా అడ్డుకునే ప్రయత్నం సాగింది. ఇందిరాపార్క్‌ పక్కన ఎన్టీఆర్‌ స్టేడియంలో అధునాతన కళాక్షేత్రం నెలకొల్పుదామనుకుంటే దానికీ అడ్డుపుల్లలు వేశారు. దశాబ్దాల వలసపాలనలో అన్నిరంగాలూ కుదేలైనా, రాజధాని నగరమంతా కాలుష్యభరితమైనా, ఎకరాల కొద్దీ ఆక్రమణలకు గురైనా మౌనంగా సహకరించిన వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రజల వికాసం కోసం, సౌకర్యాల కోసం ఏది తలపెట్టినా ఉల్లంఘనలే కనిపిస్తున్నాయి. తెలంగాణ సమాజం అభివృద్ధి చెందడమన్నా, గర్వదాయకమైన ప్రతీకలను నిర్మించే ప్రయత్నమైనా కొందరికి కడుపుమంటగా ఉంటున్నది ఎందుకో!

కొత్త సచివాలయం నిర్మించడానికి ‘గవర్నర్‌ అనుమతి తీసుకోవాల’ని వాదించడం తీవ్ర అభ్యంతరకరం. తెలంగాణ రాష్ట్రం ఎటువంటి సంకెళ్ళు లేకుండా సంపూర్ణంగా ఏర్పడాలనేది ప్రజల ఆకాంక్ష. దీనికోసమే అనేకమంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టి, హైదరాబాద్‌లోనే శాశ్వతంగా అడ్డా వేద్దామని ఆంధ్రా పెద్ద మనుషులు కుట్ర పన్నారు. కేసీఆర్‌ దీనిని సకల రూపాలలో అడ్డుకున్నారు. ఇదంతా మన కళ్ళముందే జరిగిన ఇటీవలి చరిత్ర. ఇప్పుడు కొందరు గవర్నర్‌కు అధికారాలున్నాయంటూ న్యాయస్థానంలో వాదించారంటే వీరిని తెలంగాణ బిడ్డలు అనుకోవాలా అనే అనుమానం కలుగుతున్నది. ఇటువంటివారిని చూసే కదా నాడు ‘తినే తిండెవ్వారిదే కోయిలా, పాడు పాటెవ్వారిదే కోయిలా’ అంటూ కాళోజీ వ్యంగ్యంగా రాశారు. తెలంగాణ నాయకుల పేర, ఉద్యమకారుల పేర, మేధావుల పేర కొందరు వేస్తున్న నాటకాలు, కోర్టులో వారి వాదనల ద్వారా ప్రజలకు మరోసారి తెలిసిపోయాయి. న్యాయం మళ్ళీ గెలిచింది.


logo