శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jul 01, 2020 , 00:05:03

నినాదం సరే... మరి విధానం?

నినాదం సరే... మరి విధానం?

కళింగ యుద్ధం తర్వాత జ్ఞానోదయం కలిగి ఇక యుద్ధాలు చేయనని తీర్మానించుకున్న అశోకుడిని ఆదర్శంగా తీసుకున్న సమాజం భారతదేశం. లోకకల్యాణం కోసం అష్టాంగ మార్గాల ద్వారా మానవాళి శాంతిని బోధించినబుద్ధుడు, టావోల వారసులమని చెప్పుకునే దేశం చైనా. ఇంతటి మహోన్నత తత్త్వ వారసత్వ సంపద కలిగిన దేశాలు మనుషులు బతుకలేని మంచుకొండలపై పట్టు కోసం కొట్టుకుంటున్నారనే అపకీర్తి మూటగట్టుకోవడం మంచిది కాదు.

కరోనా వైరస్‌కు కారణమనే కోపం నుంచి మొదలైన చైనాపై వ్యతిరేకత గల్వాన్‌ లోయ ఘటన తర్వాత పగస్థాయికి చేరింది. ఆ భావోద్వేగం నుంచే చైనా వస్తువుల బహిష్కరణ నినాదాలు, చైనాపై యుద్ధం లాంటి ఆవేశపూరిత డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన ఇప్పటివరకైతే రాలేదు. స్మార్ట్‌ ఫోన్లలో ఉపయోగించే కొన్ని యాప్‌లను నిషేధించడానికి మించిన తీవ్ర నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదు.

జనం డిమాండ్‌ చేస్తున్నట్లు చైనా వస్తువుల బహిష్కరణ, చైనాపై యుద్ధం సాధ్యమా? దానికి ఇండియా సిద్ధంగా ఉందా? చైనా వస్తువులను బహిష్కరిద్దామనే నినాదం ఒక సమగ్ర విధానంగా మారడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. కావల్సిందల్లా చిత్తశుద్ధి, సంసిద్ధత. ప్రజలు కొంతకాలం త్యాగాలకు సిద్ధపడాలి. దేశం భారీ మూల్యం చెల్లించుకోవాలి.

2017 జూన్‌లో కూడా ఇండియా-చైనా-టిబెట్‌ సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో చైనా సైనికులు చొరబాట్లకు తెగబడ్డారు. ఉద్రిక్తతలు చెలరేగాయి. అప్పుడు కూడా చైనాపై యుద్ధం అనే డిమాండ్లు, చైనా వస్తువుల బహిష్కరణ అనే ఉద్యమం వచ్చింది. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఆధ్వర్యంలో వివిధ రాజకీయపార్టీలకు చెందిన 11 మంది ఎంపీల బృందం డోక్లాం సరిహద్దులను సందర్శించింది. ఆ బృందం సెప్టంబర్‌ 4న లోకసభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు నివేదిక సమర్పించింది. ‘సరిహద్దులను దాటుకొని చైనా చొచ్చుకొస్తున్నది. ఆక్రమణలకు అనువుగా నిర్మాణాలు చేపడుతున్నది. చైనా ఉద్దేశపూర్వకంగా వేస్తున్న వ్యూహాత్మక అడుగులును తేలిగ్గా తీసుకోవద్దు’ అని శశిథరూర్‌ సమర్పించిన నివేదికలో ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. అదే సందర్భంలో ఆర్‌ఎస్‌ఎస్‌, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ‘చైనా వస్తువులను బహిష్కరించండి’ అనే పిలుపునిచ్చారు. చైనా వస్తువులను నిషేధించాలని, స్వదేశంలో వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించండని ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌'లో కేంద్రాన్ని కోరింది. అటు శశిథరూర్‌ కమిటీ చేసిన హెచ్చరికలు, ఇటు ఆర్‌ఎస్‌ఎస్‌ చేసిన విజ్ఞప్తులు ఎలాంటి స్పందనను రాబట్టాయో భారతదేశమంతా మూడేండ్లుగా చూస్తునే ఉంది. ఏ ఒక్క చైనా వస్తువును బహిష్కరించకపోగా, ఈ మూడేండ్లలో చైనా నుంచి దిగుమతులు ఎన్నో రెట్లు పెరిగాయి. అందుకే, ఇప్పుడు కావల్సింది నినాదం కాదు, విధానం. చైనా వస్తువుల బహిష్కరణ అనే నినాదం భావోద్వేగాలను సంతృప్తపరచగలదు కానీ, అది ఇప్పటికిప్పుడు చూపే ప్రభావాన్ని ఎలా తట్టుకోవాలనేదే ప్రభుత్వ ఆలోచన.

చైనా హద్దులు దాటుతున్నదని రోజూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ చైనా ఎన్నడో సరిహద్దులు దాటింది. ఇండియాలోని ప్రతి ఇంటినీ ఆక్రమించింది. ప్రతి మనిషినీ చెరబట్టింది. ఔషధాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, మోటార్‌ బైకులు, కార్లు, మోటార్లు ఇలా ప్రతి వస్తువులో చైనా మాల్‌ ఉంది. అయితే అది చైనా తయారీ అయి ఉంటుంది. లేదంటే వాటిల్లో వాడే కంపోనెంట్స్‌, ముడిసరుకు 50 శాతానికి మించి చైనావి అయి ఉంటాయి. ఉదాహరణకు జౌషధాలు తీసుకుంటే, వాటిలో వాడే ఆక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌ గ్రేడియంట్స్‌ (ఏపీఐ-ముడిసరుకు) 70-80 శాతం దాకా చైనా నుంచి వచ్చేవే. కరోనాకు చైనాయే కారణమని ఎంత నిందించినా, చివరికి కరోనాను ఎదుర్కోవడానికి అవసరమయ్యే మందులు, పరికరాల కోసం యావత్‌ ప్రపంచం చైనాపై ఆధారపడాల్సి వస్తున్నది. సైనికుల బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లలో వాడే ముడిపదార్థం కూడా చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. 1962 యుద్ధం సహా, 1957 నుంచి జరిగిన అనేక పరిణామాలు భారత్‌కు చైనా ఎప్పటికైనా ప్రమాదకారే అనే గుణపాఠాలు నేర్పుతున్నాయి. 

పారిశ్రామిక, తయారీరంగాల్లో మౌలిక సదుపాయాలు పెంచడం, మానవ వనరుల్లో నైపుణ్యం పెంచడం, వాటికి అనుగుణంగా చట్టాలు చేయడం, భారీ విదేశీ పెట్టుబడులు సాధించడం, పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వడం అనే పంచసూత్రాలతో చైనా ముప్పై ఏండ్లలో అద్భుతం సాధించింది. 1957లో ‘నెహ్రూ రాపిడ్‌ ఇండస్ట్రియల్‌ గ్రోత్‌' నుంచి 2014లో మోదీ ‘మేకిన్‌ ఇండియా’ వరకు అనేక నినాదాలు  వచ్చినా భారత్‌లో పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంతం త మాత్రమే. చైనా జీడీపీలో పారిశ్రామిక, ఉత్పత్తిరంగాల వాటా 43 శాతమైతే, ఇండియాలో దాని వాటా 29 శాతం. పారిశ్రామికరంగంలో అంతర్భాగమైన ఉత్పత్తిరంగం వాటా గడిచిన ఆరేండ్లలో 15 నుంచి 14 శాతానికి పడిపోయింది.

చైనా వస్తువులను బహిష్కరించాలనే నినాదం విధానంగా మారాలంటే ప్రజలు కూడా మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను భారత్‌లోనే తయారుచేయడం వల్ల ఉత్పత్తి వ్యయం యాభై శాతానికి అటూ ఇటుగా పెరుగుతుందని పరిశ్రమల సమాఖ్య అధ్యయనం తేల్చింది. తలనొప్పికో, జ్వరానికో వేసుకునే పారాసిటమాల్‌, అజిత్రోమైసిన్‌ టాబ్లెట్ల నుంచి మొదలుకుంటే గృహోపకరణాల వరకు అన్ని రేట్లు కనీసం 30-50 శాతం పెరుగుతాయి. వాటిని భరించడానికి జనం సిద్ధం కావాలి.

ఇండియా, చైనాలవి నాలుగైదు వేల ఏండ్ల చరిత్ర కలిగిన అతి పురాతన నాగరికతలు. ఏడు దశాబ్దాలకు పైగా సర్వ స్వతంత్రంగా ఎదుగుతున్న దేశాలు. నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన ఇరుగుపొరుగు ఇంటివాళ్లు. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం, 1949లో పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాగా అవతరించిన చైనా ఇన్నేండ్ల నుంచి కనీసం తమ సరిహద్దులను సరిగ్గా నిర్దేశించుకోకపోవడం పెద్ద లోపం. దాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. ‘దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌' అనే రాయప్రోలు వారి మాటలు ముందుకు నడిపించగలిగితే సరిహద్దు వివాదాన్ని కూడా ఎక్కడికో అక్కడికి తెంపేసుకోవచ్చు. చైనాతో పోరు కేవలం సరిహద్దుల సమస్యకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ సంబంధాల కోణంలో వ్యవహారాన్ని నడపదల్చుకుంటే ఈ కాష్టం ఇప్పట్లో ఆగడం కష్టం. పిట్టల పోరులో పిల్లులు లాభపడటం మాత్రం ఖాయం. 
logo