మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Jun 30, 2020 , 00:06:46

రామజన్మభూమి- బాబ్రీమసీదు

రామజన్మభూమి- బాబ్రీమసీదు

ఉత్తర హిందూ దేశంలోని అయోధ్య.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌ జిల్లాకు చెందిన పట్టణం. రామాయణ ఇతిహాసం ప్రకారం అది శ్రీరాముని జన్మభూమి కావటంతో చాలాకాలం నుంచి అది పవిత్ర యాత్రాస్థలంగా ఉంది. రామజన్మభూమి- బాబ్రీమసీదు అని అందరూ అనుకునే కట్టడం క్రీ.శ.1528లో అయోధ్యలో మసీదుగా మీర్‌ బఖీ నిర్మించటం జరిగింది. అయితే కొన్ని వర్గాలు శ్రీరాముని జన్మభూమి అయిన ఆ ప్రదేశంలో ఒక మందిరం ఉండేదనీ, అక్కడే మసీదు నిర్మించబడిందనీ వాదిస్తారు. ఇది ఎడతెగని వివాదానికి దారితీసింది. 1855లో అయోధ్యలోని ఈ ప్రాంతంలో (కోట్‌ రామచంద్ర) ఓ చిన్న యుద్ధం జరిగింది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ ఘటనకు సంబంధించి ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక ఈస్ట్‌ ఇండియా కంపెనీ రికార్డులలో ఉంది. (దాని నకలు జాతీయ ప్రాచీనపత్ర భాండాగారంలో ఉంది.)

రామజన్మభూమి- బాబ్రీమసీదు కట్టడపు చరిత్రలోని ఓ దశలో దాని వెలుపలి ప్రాంగణపు కొంతభాగం హిందువులు పూజలు నిర్వహించే తావులుగా మారింది. ఉదాహరణకు రామ్‌ చబూత్రా, కౌసల్యా రసోయి అటువంటివే. అక్కడే రామ్‌ లల్లా విగ్రహం ఉండేది. 1885లో అయోధ్యకు చెందిన మహంత్‌ రఘువీర్‌దాస్‌ అనే ఆయన కోర్టుకు సమర్పించిన పత్రాలలో ఈ నిర్మాణాలున్నట్లు దాఖలాలున్నాయి. 1992 డిసెంబర్‌ 6 వరకు ఆ కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలు కడు పురాతనమైనవిగా భావింపబడుతూ వచ్చాయిగాని రుజువుకు నిలిచే దాఖలాల్లేవు. క్రీ.శ.1807-14 కాలం నాటి సర్వే రికార్డులు లభించగా వాటిల్లో వివాదంలో ఉన్న ఈ స్థలం ‘యన్మస్థాన్‌' అంటే ‘జన్మస్థాన్‌'గా చూపబడింది.

తొలిగా ఈ వివాదం న్యాయస్థానాలకెక్కటం మహంత్‌ రఘువీర్‌దాస్‌ దావా వెయ్యటం వల్లనే. 1885లో 61/280వ నెం. కేసుగా నమోదైన ఆ దావాలో రామ్‌ చబూత్రా అనే వేదిక మీద ఓ మందిరాన్ని పునర్నిర్మించుకునేందుకు అనుమతి కోరటం జరిగింది. ఆ వేదిక మసీదుకు దగ్గర్లో వెలుపలి ప్రాంగణంలో ఉంది. ఆ దావా కొట్టివేయబడింది. అందుక్కారణం ఓ మసీదుకు అంత సమీపంలో మందిర నిర్మాణం శాంతి భద్రతలకు భంగం వాటిల్లజేస్తుందనే. 1834లో హిందువులు, ముస్లిముల మధ్య ఈ కట్టడానికి సంబంధించిన గొడవ మతపరమైన దాడులకు దారితీయగా కట్టడం కొంత దెబ్బతినగా తరువాత దానిని బాగుచేయటం జరిగిందనేది రుజువయ్యింది. అయితే 1934 అల్లర్ల తర్వాత ఆ వివాదాస్పద కట్టడం మసీదుగా ఉపయోగించటం జరిగిందా లేదా అనే విషయం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొన్నదేమంటే.. ‘ఒక కథనం ప్రకారం 1949 డిసెంబర్‌ నుంచి గాక, 1934లో జరిగిన అల్లర్ల తర్వాత నుంచి అది మసీదుగా వాడబడలేదని, రెండవ వర్గం వాదన- అది1949 వరకూ మసీదుగా వాడబడుతున్నదనే’ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం (కాంగ్రెస్‌ పాలనలో ఉన్న కాలంలో) 1949 వరకు అది మసీదుగా వాడబడింది.

(‘అయోధ్య’పై మాజీ  ప్రధాని పీవీ రాసిన పుస్తకం నుంచి)

పీవీ-అయోధ్య

రామజన్మభూమి- బాబ్రీమసీదు కథ వయస్సు దాదాపు అర్ధ శతాబ్ది. ఆ కాలంలో విస్తరించిన పితలాటకాన్ని అలా పక్కనబెడితే, కొన్ని ముఖ్య ఘటనలు చారిత్రక ఘట్టాలుగా నిలుస్తాయి. నేను 1991 జూన్‌లో భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాను. దానితో అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీమసీదు చరిత్రలో ఈ కింది ముఖ్య ఘటనలు వారసత్వంగా స్వీకరించాల్సి వచ్చింది. 

1949 


ఆ కట్టడంలో విగ్రహాలు కన్పించటం.
1986
తాళాలు తెరిచి పూజలు ప్రారంభించటం.
1989 
శిలాన్యాస్‌.
1990
బాబ్రి కట్టడాన్ని కూల్చే తొలి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొంది.
1991
పరస్పర చర్చల ద్వారా ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు చంద్రశేఖర్‌ ప్రభుత్వ కృషి. (రామజన్మభూమి- బాబ్రీమసీదు చరిత్రలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఈ దశలన్నింటినీ ఒక్కొక్కటిగా తదుపరి పరిచ్ఛేదాలలో విపులీకరించటం జరిగింది)
logo