మంగళవారం 14 జూలై 2020
Editorial - Jun 30, 2020 , 00:06:46

మీడియాకు పీవీ ఎందుకు దూరం?

మీడియాకు పీవీ ఎందుకు దూరం?

పీవీ ప్రధాని అయ్యాక అయిదేండ్ల కాలంలో ఒకేఒక్కసారి, ఏడాది పాలన పూర్తయ్యాక 1992 జూన్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఎంత పెద్ద విధాన ప్రకటన చేయాల్సి వచ్చినా పార్లమెంటునే ఎంచుకున్నారు. సంస్కరణల మీద ప్రతిపక్షాల విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తే, బహిరంగసభల్లోనే (వాళ్లపేరు ఎత్తకుండా) తిప్పికొట్టేవారు.

1972 అక్టోబరు 24. తెలంగాణలో ముల్కీ నిబంధనల అమలులో కోర్టు తీర్పే ఖాయమని, ఇంక చర్చించేదేమీలేదని ముఖ్యమంత్రి పీవీ చేసిన వ్యాఖ్య మీద ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. వాళ్లను శాంతింపజేయాలనుకున్నారు పీవీ. అందుకోసం ఏలూరులో సర్‌ కట్టమంచి రామలింగారెడ్డి కళాశాలలో ఈ రెండు విశ్వవిద్యాలయాల ప్రతినిధుల సమావేశం ఏర్పాటుచేశారు. దీనికి విలేకరుల్ని అనుమతించలేదు. కాని నేను నా వయసు (23) కారణంగా ‘వేంకటేశ్వర యూనివర్సిటీ ప్రతినిధి’ అని చెప్పుకొని లోపలికెళ్లిపోయాను. ముఖ్యమంత్రి పీవీ వచ్చారు. అందర్నీ ఓసారి కలయజూసి అడిగారు. ఇక్కడ, పత్రికలవాళ్లు ఎవరైనా ఉన్నారా? లేరు.. లేరు.. నేను కూడా అరిచాను. తెలంగాణ, ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటానికి ముందు విశాలాంధ్ర ఉద్యమం నడిచిన కాలం నుంచీ ఆయన చరిత్ర చెప్పారు. రాష్ర్టాల విలీనం వల్ల తెలంగాణకు నష్టం జరగకూడదన్నది ముల్కీ నిబంధనల స్ఫూర్తి అనీ, అయినా తన ప్రభుత్వం ఆంధ్ర ప్రాంత విద్యార్ధులకు అన్యాయం జరగనివ్వదనీ.. ఇలా చాలా చెప్పారు.

‘ఆంధ్రపత్రిక’ విలేకరిగా ఇంకా శిక్షణ దశలో ఉన్న నేను మొదటిసారిగా ఒక విషయం తెలుసుకున్నాను. కొన్ని సున్నితమైన సమావేశాల్లో విలేకరులు ఉండకూడదని నాయకులు కోరుకుంటారు. అలాంటి నాయకుల్లో పీవీ కూడా ఒకరు. అదే 1972 అక్టోబరు 24 అర్ధరాత్రి నుంచి ఆ రెండు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు నిరవధిక సమ్మె ప్రకటించారు. కొద్దిరోజుల్లో నాకు అర్థమైంది.. ఈ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నది భూస్వాములు. మరికొన్ని రోజులో ్లఅదే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంగా మారిపోయింది. 1973 ఆరంభంలో.. ఇందిరాగాంధీ ఆదేశం మేరకు ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాల్లో భాగంగా చాలా పత్రికలకు పీవీ సహాయం చేశారు. అయినా ఉద్యమాన్ని ఆపలేకపోయారు. ప్రధాన పత్రికలు ఆయనకు అనుకూలంగా పనిచేయలేదు! మీడియాతో ఆయనకు ఆ ఉద్యమంలో కలిగిన అనుభవం చాలా పాఠాలు నేర్పింది. అప్పట్నుంచీ ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. లేదా మీడియాను దూరంగా పెట్టారు.

1990 ఆగస్టులో నేను ఈనాడు ప్రతినిధిగా విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బదిలీ అయి వెళ్ళాను. నేను వెళ్ళిన వారం పదిరోజులకు ఆయన అమెరికాలో కరోనరీ బైపాస్‌ సర్జరీ చేయించుకొని వచ్చారు. వచ్చిన మర్నాడే ఫోన్‌ చేసి ‘మిమ్మల్ని కలువాలనుకుంటున్నాను. ఎప్పుడు రావచ్చు’ అనడిగాను. ‘మీరు వచ్చినా ఏం ఉపయోగం ఉండదు. మీ మీడియావాళ్లకు నా దగ్గర న్యూస్‌ లభించదు..’ అంటూ మర్యాదగా మాట్లాడారు. ‘సర్జరీ చేయించుకుని వచ్చారు. మర్యాదపూర్వకంగా కలసి, మాట్లాడాలని..’ అన్నాను. ‘చాలా సంతోషం వల్లీశ్వర్‌గారు. నేను చెప్పే రెండు మాటలు ఇవే. సర్జరీ బాగా జరిగింది. ఇప్పుడు నా గుండె కుర్రదైపోయింది. ఆరోగ్యం బాగుంది. ఈ విషయాలు మీ పాఠకులకు తెలియజేయండి. ఉంటాను మరి.’ ఆ రోజుకు అంతే సంభాషణ.

1991 మే 21న రాజీవ్‌గాంధీ మద్రాసులో మానవబాంబు కారణంగా మరణించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై పీవీని ఆ పదవికి ఎంచుకొంది. ఆయన అప్పటికే హైద్రాబాద్‌ వచ్చేసే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో పీవీ తిరిగి క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారని ప్రపంచానికి తెలియాలి. అందుకని ఆయనకిష్టంలేకపోయినా మిగతా నాయకుల ఒత్తిడి మేరకు మే 29న తన ఇంటి ఆవరణ ‘9, మోతీలాల్‌ నెహ్రూమార్గ్‌'లో పత్రికా సమావేశం పెట్టారు. దేశ విదేశీ పాత్రికేయులు, బీబీసీ, దూరదర్శన్‌ కెమెరాల ముందు ఆయన మాట్లాడారు. ఒక దశలో నేను కూడా చేయెత్తాను. పీవీ గారు నావంక చూసి అడుగు అన్నట్లుగా వేలు చూపించారు. ‘మీరు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని నియంత్రించలేక, రాజీనామా చేశారు, లేదా మీతో చేయించారు. అలాంటి మీరు ఇంతపెద్ద జాతీయపార్టీని అధ్యక్షుడిగా ఎలా నడపగలరు?’ అన్నాను. ఆయన నావంక కొద్దిక్షణాలు చూశారు. జవాబిచ్చారు. ఆ రోజున అదే అతిపెద్ద జవాబు. ఏపీ ఏర్పడిన దగ్గర్నుంచీ చరిత్ర అంతా చెప్పి, తన రాజీనామాకు ప్రత్యేకాంధ్ర ఉద్యమం కారణం కాదని అక్కడున్న మీడియాకు నమ్మకం కలిగించే ప్రయత్నంచేశారు. ‘తెలుగువారంతా కలిసుండాలన్న సిద్ధాంతానికి లోబడి రాజీనామా చేశాను. ప్రత్యేకాంధ్ర ఉద్యమం అణచివేయలేక కాదు’ అన్నారు. ఆ మర్నాడు పీవీగారి శ్రేయోభిలాషి, రాష్ట్రపతి ప్రెస్‌ సెక్రటరీ కూచి సూర్యనారాయణ నాతో మాట్లాడుతూ.. మీలాంటివాళ్లు ఇలాంటివన్నీ అడుగుతారనే ఆయన మీడియాను దూరంగా పెడతారు అన్నారు. 

ఆయన ప్రధాని అయ్యాక అయిదేండ్ల కాలంలో ఒకేఒక్కసారి, తొలి ఏడాది పాలన పూర్తయ్యాక 1992 జూన్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఎంత పెద్ద విధాన ప్రకటన చేయాల్సి వచ్చినా పార్లమెంటునే ఎంచుకున్నారు. సంస్కరణల మీద ప్రతిపక్షాల విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తే, బహిరంగసభల్లోనే (వాళ్లపేరు ఎత్తకుండా) తిప్పికొట్టేవారు.  తనకు సన్నిహితులైన కళ్యాణీశంకర్‌ (హిందుస్థాన్‌ టైమ్స్‌), సంజయ్‌ బారు (ఎకనామిక్‌ టైమ్స్‌) వంటి కొద్ది మందికి మినహా మిగతా మీడియావాళ్లకు ఆయనను కలుసుకోవటం దుర్లభం. పీవీఆర్కే ప్రసాద్‌ మీడియా సలహాదారుగా ఉన్నకాలంలో పట్టుబట్టి కొన్ని ఎంపికచేసిన పత్రికల సంపాదకులకు మాత్రం.. అది కూడా పీవీకి నచ్చితేనే ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇప్పించారు. వాటిల్లో ఎస్సార్‌ రామానుజన్‌ (ఈనాడు, న్యూస్‌టైమ్‌) ఇంటర్వ్యూ ఒకటి.

చివరిసారిగా ఆయన మీడియాతో మాట్లాడటం మాత్రం ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయాక, ఆయన మీద దాఖలైన కేసుల్లో నిర్దోషిగా నిరూపితమయ్యాక జరిగింది. 1994లో ప్రధాని నివాసంలో జీకే రెడ్డి స్మారక పురస్కారాన్ని ‘ఇండియాటుడే’ ఎడిటర్‌ అరుణ్‌పురికి ఇచ్చినప్పుడు పీవీ ఇలా అన్నారు. ‘మీడియా అంటే నాకు చాలా గౌరవం. ఎంత దూరంగా ఉంటే అంతగౌరవం. అందుకే నేను నా సాటి రాజకీయనేతలకు కూడా ఎప్పుడూ చెప్తుంటాను. మీడియాతో ఇంటర్వ్యూల కోసం తహతహలాడకండి. మీరు ఎంత హేతుబద్ధంగా, ఎంత వాక్చాతుర్యంతో వాళ్లు (మీడియా) ఏది ఎంత ప్రస్ఫుటంగా రాయాలనుకున్నారో అదే రాస్తారు. మీ కెందుకయ్యా ఈ కంఠశోష? దూరంగా ఉండండి’. logo