మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Jun 28, 2020 , 23:38:22

ప్రతి ఒక్కరి కన్నీరు తుడుస్తాం

ప్రతి ఒక్కరి కన్నీరు తుడుస్తాం

క్లిష్టపరిస్థితుల్లో మీతో మాట్లాడవలసి వస్తున్నది. రాజీవ్‌ గాంధీ హత్య మూలంగా దేశ సుస్థిరతకు, సమగ్రతకు ఘోర ప్రమాదం ఏర్పడింది. ఉచ్ఛదశలో ఉన్న గొప్ప నాయకుడిని ఒక కౄర చర్య మన నుంచి హరించుకుపోయింది. కానీ ఆయన దార్శనికత సజీవంగా ఉంటూ భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకమై మార్గదర్శనం చేస్తుంది. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రజలు ఏకతాటిపై నిలిచారు. దేశాన్ని అస్థిరత్వం పాలుచేసే, ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను తిప్పికొట్టారు. మన ప్రజాస్వామ్యం ఎంత దృఢమైందో ఇటీవలే ముగిసిన ఎన్నికల ప్రక్రియ వెల్లడించింది. భారత ప్రజల ఐక్యత సవాళ్ళకు అతీతమైనదని కూడా స్పష్టం చేసింది.

ప్రధానిగా ప్రమాణ స్వీకారం

తరువాత పీవీ చేసిన ప్రసంగం

22 జూన్‌, 1991

పంజాబ్‌, కశ్మీర్‌, అస్సాం సమస్యలు దేశానికి అసలైన ప్రమాదాలు. మతోన్మాదం మాదిరిగానే శాంతిభద్రతల సమస్య ప్రమాద హేతువు. ఈ సమస్యలను పట్టుదలతో, తదేక దృష్టితో ప్రభుత్వం పరిష్కరిస్తుంది. దేశ సమైక్యతను, సమగ్రతను పరిరక్షిస్తాం. ప్రజల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరిస్తూనే, ఉగ్రవాద, విచ్ఛిన్నకర శక్తుల పట్ల దృఢంగా వ్యవహరిస్తాం. స్నేహసహకారాలు, కలివిడితనంతోపాటు మాతృభూమిపై గాఢమైన ప్రేమానురాగాలు గల సంప్రదాయం మన ప్రజలకున్నది. ప్రజలు ఇచ్చే బలంతో మన ప్రయత్నాలలో విజయం సాధిస్తామని నా మనసుకు అనిపిస్తున్నది. 

ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నది. (విదేశీమారకం) చెల్లింపులు సమతూకం సమస్య క్లిష్టంగా ఉన్నది. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఎక్కువ సమయం లేదు. ప్రభుత్వమైనా, దేశమైనా స్థోమతకు మించి బతుకలేదు. ఇందుకు మెతక నిర్ణయాలు సరిపోవు. దృఢమైన దేశ నిర్మాణంలో అంతర్భాగమైన ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతోపాటు అవసరమైన త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ లక్ష్య సాధన దిశలో ఆర్థిక స్వస్థతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. గతంలో కూడా ఇటువంటి సంక్షోభాలను ఎదుర్కొని, అధిగమించాం. మన ఆర్థిక వ్యవస్థకు అటువంటి దృఢత్వమూ, నిబ్బరత్వమూ ఉన్నది. ప్రజలకూ సంకల్పం ఉన్నది. అంతా కలసి అధిగమిస్తాం. మనమంతా సంకుచిత రాజకీయ, వర్గ ప్రయోజనాలకు అతీతంగా ఈ జాతీయ కృషిలో భాగస్వాములం కావాలి. ఇందుకోసం అందరి సహకారం తీసుకుంటాం. ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ఉన్నాం. వాయిదా పడిన బడ్జెట్‌ను నెలరోజుల్లోగా సమర్పిస్తాం. అంతర్జాతీయ బాధ్యతల నిర్వహణలో భారత్‌ తన మచ్చలేని చరిత్రను కాపాడుకుంటుంది. బహుళపక్ష ఆర్థిక సంస్థలతో, ప్రత్యేకించి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)తో చర్చలు కొనసాగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించవలసిందే. చెల్లింపుల సమతూక సమస్యను అధిగమించడానికి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కఠిన నిర్ణయాలు అమలు పరచవలసి ఉంటుంది. ఇదే సమయంలో పేదలను కాపాడుతూనే, ఆర్థిక వృద్ధి సాధించేవిధంగా సర్దుబాటు ప్రక్రియ సాగించవలసి ఉంటుంది.


సత్వర పారిశ్రామికాభివృద్ధి క్రమానికి అవరోధాలను తొలగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో లభిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనే విధంగా భారత దేశాన్ని రూపుదిద్దడానికి మనమంతా కలిసి కృషి చేయాలి. సమర్థతకు ప్రోత్సాహమివ్వాలి. పబ్లిక్‌రంగమైనా మరే రంగమైనా వృథా వ్యయాన్ని, అసమర్థతను, నాణ్యతలో ఉదాసీనతను సహించబోము. అభివృద్ధి వేగం పెంచడానికి, మన సాంకేతిక పరిజ్ఞాన మెరుగుదలకు, ఎగుమతుల పెంపునకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తాం. తగు మోతాదులో విదేశీ పెట్టుబడులు రావడానికి గల అడ్డంకులను తొలగిస్తాం. చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థ, సృజనాత్మకత, వ్యాపారకుశలత, నూతన ఆవిష్కారాలకు గుర్తింపు అనే లక్ష్యాలను సాధించే విధంగా పారిశ్రామిక విధానాలను, కార్యక్రమాలను ప్రక్షాళన చేస్తాం. ఈ ప్రక్రియలో ప్రవాస భారతీయులది కీలక పాత్ర ఉంటుందని భావిస్తున్నా. భారత్‌లో పెట్టుబడులకు తగిన ప్రతిఫలనం లభించే విధంగా చూస్తాం. 

వ్యవసాయం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని సుస్థిరపరుస్తూనే, విస్తృత భిన్నరకాల అభివృద్ధికి అనుగుణమైన పరిస్థితులు కల్పిస్తాం. నీటిపారుదల వ్యవస్థను విస్తరించడానికి, మెట్టభూముల సాగు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడానికి పటిష్టమైన తోడ్పాటు వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటాం. 

కోట్లాది మంది అణగారిన వర్గాల జీవితాలను మెరుగుపరచాలనేదే మా ప్రయత్నం.  గ్రామీణ ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో భూమిపై ఉన్న ఒత్తిడిని సడలిస్తూనే ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేయడంతోపాటు, నిరుద్యోగం, అల్పస్థాయి ఉద్యోగిత, అల్పాదాయం వంటి సమస్యలను పరిష్కరించడానికి తగిన అనుసంధానాలను వృద్ధి చేయాలనేదే మా ప్రయత్నం. ప్రజలకు స్పందించే పరిపాలనను అందించడంతోపాటు, అభివృద్ధి కోసం పెట్టే ప్రతి పైసా లబ్ధి దారుడికి చేరే విధంగా చూస్తాం. ఇప్పుడున్న ఆర్థిక తోడ్పాటును గ్రామీణ గృహకల్పన కోసం విస్తరిస్తాం. ప్రాథమిక ఆరోగ్య వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెడతాం. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య వసతులపై మరింత శ్రద్ధ వహిస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడంపై తక్షణం చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి కడు పేదలకు తోడ్పాటు అందేలా ఈ వ్యవస్థను విస్తరిస్తాం. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రజాపంపిణీ వ్యవస్థను సాధనంగా చేసుకుంటాం. మన చట్టాలకు, విధాన నిర్ణయాలకు పొందిక కుదిరే విధంగా వ్యూహాలు రూపొందించవలసి ఉన్నది. 


వ్యవసాయం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని సుస్థిరపరుస్తూనే, విస్తృత భిన్నరకాల అభివృద్ధికి అనుగుణమైన పరిస్థితులు కల్పిస్తాం. నీటిపారుదల వ్యవస్థను విస్తరించడానికి, మెట్టభూముల సాగు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడానికి పటిష్టమైన తోడ్పాటు వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటాం. 

మత, భాషా, జాతిపరమైన అల్పసంఖ్యాకవర్గాల రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన, న్యాయమైన ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మతపరమైన దాడులపై విచారణ జరిపించడానికి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తాం. మతకలహాలను సత్వరం అరికట్టడానికి మిశ్రమ రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. మైనారిటీ కమిషన్‌ను ప్రభావశీలంగా మార్చడానికి చట్టబద్ధత కల్పిస్తాం. భారత్‌ నాయకత్వం వహించడానికి చారిత్రక ప్రయత్నం సాగుతున్నదశలో, అంతర్జాతీయ ప్రతిష్ఠ దెబ్బతినడం, మిత్రరాజ్యాలతో, పొరుగు దేశాలతో సంబంధాల పట్ల నిర్లక్ష్యం వహించడం దురదృష్టకరం. మన దేశ ప్రతిష్ఠను పునరుద్ధరించడం, ప్రపంచవేదికలపై భారత వాణిని వినిపించడం మా ప్రభుత్వ ధ్యేయం. పొరుగుదేశాలతో సంబంధాలకు ప్రాధాన్యమిస్తూ, ఈ ప్రాంతంలో శాంతి సౌభాగ్యాలను, సుస్థిరతను నెలకొల్పుతాం. 

విస్తృతమైన బలహీనవర్గాల దృక్కోణంగల మంత్రి మండలిని ఏర్పాటు చేశాను. దేశం మూలమూలనా గల ప్రతి ఒక్కరిని చేరుకునే ప్రయత్నంలో ఇదొక ఆరంభం మాత్రమే. నా బృందం ప్రజల గుండె చప్పుడును వినగలదు. ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు అనేదే మా దృక్కోణం. సామాజిక మత సామరస్యాన్ని మేం కోరుకుంటున్నాం. మరింత మానవీయ సమాజాన్ని కాంక్షిస్తున్నాం. ఇరువయవ శతాబ్దం ముగింపునకు వస్తున్న దశలో, ఇంకా పలు సామాజిక వర్గాలు కటిక దారిద్య్రంలో ఉండకూడదు. ప్రతి ఒక్కరి కంటినీరు తుడవడమే తన అభిమతమని గాంధీజీ అన్నారు. మా ప్రభుత్వానికి గాంధీజీ ఆశయమే ప్రేరణ. 


logo