ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 28, 2020 , 23:38:20

పీవీ-అయోధ్య

పీవీ-అయోధ్య

దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నిష్కళంకుడు.. పీవీ.  రాజకీయ వైకుంఠపాళిలో పైనుంచి కిందికి పడుతూ లేస్తూ కిందనుంచి శిఖరాగ్రం దాకా ఎదిగిన పీవీ అనేక చరిత్రాత్మక, చారిత్రక సంఘటనలకు మౌనసాక్షి. సందర్భాలనూ, సంఘటనలను వాతాపిజీర్ణం అని హరాయించుకోవడమే తప్ప వివాదాస్పద అంశాలపై పెదవివిప్పి వివరంగా మాట్లాడటం పీవీకి తెలియదు. అలాంటి పీవీ తన పరిపాలనాకాలంలో జరిగిన ఓ ఘటనపై చనిపోయిన తర్వాత మనసువిప్పారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడే అయోధ్యలోని ‘వివాదాస్పద కట్టడం కూల్చివేత’ ఘటన చోటుచేసుకున్నది. బీజేపీ పెద్దలను, యూపీ ముఖ్యమంత్రిని నమ్మి పీవీ మోసపోవడం వల్లే ఇది జరిగిందనేది ఒక వాదన. అంతరాంతరాల్లో హిందూసానుకూలత వల్ల పీవీయే కావాలని ఉదాసీనత చూపారనేది కొందరి ఆరోపణ. ఆ కట్టడం కూల్చివేత సందర్భంగా ముందూ, వెనక ఏం జరిగిందని సాధికారికంగా తెలిసిన వ్యక్తి పీవీ ఒక్కరే. ఈ ఘటనకు ఆయన మాత్రమే అసలు సాక్షి! ఢిల్లీకి అయోధ్యకు మధ్య ఉన్న దూరం ఎన్ని మలుపులను దాచుకుందని చెప్పగలిగిన వ్యక్తి పీవీ ఒక్కరే. ఆరోపణలు ఎన్ని వచ్చినా   పీవీ తాను బతికున్నన్ని రోజులూ ఈ ఘటనపై నోరువిప్పి మాట్లాడలేదు. తన సహజశైలిలో మౌనమే జవాబుగా ఉండిపోయారు.  కానీ, అసలు అప్పుడు ఏం జరిగిందన్నదానిపై తన మనోగతాన్ని అక్షరీకరించారు. తన మరణానంతరం మాత్రమే  ప్రచురించాలన్న షరతుపై రచనను ఒక ప్రచురణ సంస్థకు అందించారు.  పీవీ శాశ్వత నిద్రలోకి జారుకున్న తరువాత ఈ గ్రంథం వెలుగు చూసింది.  దానిపేరే 

‘అయోధ్య: డిసెంబర్‌ 6 1992’. 

దేశ  రాజకీయ చరిత్రను సమూలంగా మార్చివేసిన అత్యంత సంచలనాత్మక ఘట్టంపై పీవీ స్వయంగా ఏం చెప్పారు? 

పీవీ రచించిన అయోధ్య పుస్తకం నేటినుంచి ధారావాహికంగా..

ఉపోద్ఘాతం

చరిత్రలో ఎక్కడ చూసినా విజేతలు పరాజితుల్ని పరాభవించటమే.. అయితే, ఆ ఆటవికత పలు విధాలు. స్త్రీలనీ, బానిసల్నీ రకరకాల సంపదల్నీ తన హక్కుగా స్వాధీనపరుచుకోవటమేగాక, దండయాత్ర ఫలితంగా విజేత పరాజితుల యజమానిగా, పాలకునిగా మారిపోతాడు. మతోన్మాదం పుంజుకున్న తావు ల్లో బలవంతపు మతమార్పిడులు, మతపరమైన కట్టడాలు కూల్చివేయబడటమో లేక విజేత మతానుకూలంగా మార్చివేయటమో జరిగేది. అధికారపు కైపు లో మనిషి ఆయుధాల సాయం తో దేవుడి రూపునే మార్చివేయాలనుకున్నాడు.

‘రామజన్మభూమి’ దేవాలయం ఉన్నతావునే ‘బాబ్రీ మసీదు’ నిర్మింపబడిందనే ఆరోపణలోని నిజానిజాలు ఇంకా తేలవలసి ఉన్నా నేటికీ నిలిచిఉన్న విశ్వాసాల విభేదాల నేపథ్యం నుంచి చూసినా అదీ అటువంటి దండయాత్రలకిందే జమ. రమారమి 500 ఏండ్లుగా ద్వేషం బుసలు కొడుతూ, హింస చెలరేగుతూ ఆధునిక భారత చరిత్రలో మాయని మచ్చగా నిలిచి 21వ శతాబ్దిలోకి చొచ్చుకొని వచ్చిన ఈ దౌర్భాగ్యం, మన ముందుతరాలనేగాక విదేశాల్లో కూడ ఎందరినో కలతపరిచే అరాచకత్వం మనల్ని వీడేట్లు కనపడదు. 

బాబ్రీ కట్టడం కూల్చివేత వంటి దురదృష్టకర ఘటన జరిగి ఇన్నేళ్లయిన తర్వాత ఆవేశకావేషాల వత్తిళ్లకు లోనుకాకుండా, గతించినది అందించే తార్కికపు సానుకూలతలకు దూరంగా 1992 డిసెంబర్‌ 6నాటి దుర్ఘటనకు దారితీసిన అంశాలను విస్తృతమైన ఆధారాల ప్రాతిపదికన, రాజ్యాంగబద్ధంగా, న్యాయానుగుణంగా, చట్టపరంగా ఈ గ్రంథం పరిశీలించ ప్రయత్నిస్తుంది. ఆనాడు జరిగినదానికిగానీ, జరుగనిదానికిగానీ, కావలసిన సమర్థనను సమకూర్చుకునేందుకుగానీ, స్వధర్మ బుద్ధిని చాటి చెప్పేందుకుగానీ ఉద్దేశింపబడినది కాదిది. వాస్తవ ఘటనాక్రమాన్ని, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల్లోని, భాషలోని ఆచరణాత్మక సంక్లిష్టతల్ని వివరించే ప్రయత్నమే ఇది. వైరుధ్య భావాలు గల రాజకీయ పక్షాలను ప్రజలు విభిన్న ఆలోచనలతో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ర్టాల్లోనూ ఎన్నుకున్నప్పుడు జాతీయ శ్రేయస్సు దృష్ట్యా ఫెడరల్‌ వ్యవస్థలో విశ్వాసం గల ఆయా పార్టీలు వాళ్ల పథకాలనూ, చర్యలనూ సంఘటిత పరుచుకోవలసివుందనే విషయాన్ని ప్రముఖంగా పేర్కొంటుంది. వీటన్నింటికీ మించి రాజకీయ విభేదాలకు, ఉద్యమాలకు, సిద్ధాంతాలకు ధార్మిక విషయాలను సంపూర్ణంగా దూరంగా ఉంచాల్సిన అవసరాన్ని మనస్సుకు హత్తుకునేట్లు చెప్పదలిచింది.


logo