శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jun 28, 2020 , 00:05:29

తెలిసి పలుకుట చిత్రంబు!

తెలిసి పలుకుట చిత్రంబు!

“నిగమంబులు వేయు జదివిన

సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్‌

సుగమంబు భాగవతమను

నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా!”

బుధేంద్రా! వేలకు వేలుగా వేదమంత్రాలు వల్లించినా మోక్షసౌభాగ్యాలు అంత సులభంగా సమకూరవు. కానీ, భాగవతమనే వేదాన్ని చదివినంతనే కైవల్యం కరతలామలకమవుతుంది.

శ్రీకైవల్యపదము కోరి భాగవత రచనకు శ్రీకారం చుట్టాడు పోతన. సంస్కృత భాగవతం భక్తిరస భరితమైనా- భాష, భావం, విషయం, వ్యక్తీకరణ, తాత్తిక విశ్లేషణ, అన్వయం ఇలా అనేక దృక్కోణాల్లో జటిలమైనది. అందుకే రామాయణ భారతాలు, ఇతర పురాణాల కంటే భాగవత పరమార్థం గ్రహించడం చాలా కష్టం. అట్టి గ్రంథాన్ని ఆంధ్రీకరించడం ఆషామాషీ కాదు అసిధారా వ్రతమేనని పోతనకు తెలుసు. అయినా పలికించేవాడు రామభద్రుడైతే నాకెందుకు అభద్రతా భావం? అని ఊరట చెంది ఉత్సహించాడు. “అమ్మా! శారదమ్మా! తగుదునమ్మా అని ఈ తెనుగు సేతకు తెగువ చూపుతున్నా. నాకు తగిన తెరువు చూపి తరింపచెయ్యి తల్లీ!” అని వాణికి, “మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌” ప్రసాదించమని శర్వాణికి శరణాగతి చేశాడు పోతన. మూల భాగవత పురాణాన్ని, శ్రీధర పండితుడి వ్యాఖ్యానాన్నీ ఆమూలాగ్రం అధ్యయనం చేసి, ఆ సాహితీ తపస్సులో తాను పొందిన అనుభవాన్ని, ఆంధ్రీకరణ విధానాన్ని అవతారిక’లో ఇలా పొందుపరిచాడు-

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మి చూలికైన!

విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత దేట పఱుతు

‘భాగవత తత్తం తెలియటమే చాలా కష్టం. తెలిసినా ఇతరులకు తెలిసే విధంగా పలకడం ఇంకా కష్టం. నిజానికి (శూలి) శివుడైనా, (తమ్మిచూలి) బ్రహ్మదేవుడైనా భాగవత పరమార్థాన్ని ఇదమిత్థంగా నిశ్చయించి చెప్పలేరంటే మరి నాకు మాత్రం సాధ్యమవుతుందా?’

‘భాగవతము తేలపఱుపనెవ్వడ సాలు శుకుడు దక్క నరుని సకుడు దక్క’ (సింగయ్య- షష్ఠ స్కంధం) (భాగవత పరమార్థాన్ని తేలతెల్లంగా వెల్లడించడానికి శుకుడైనా కావాలి లేదా శ్రీకృష్ణుడైనా రావాలి). ’అయినా విబుధ జనుల వలన నేను విన్నంత (శ్రవణం), నాకు తెలిసినంత (మననం), నా అనుభవానికి వచ్చినంత (నిధిధ్యాసనం) స్పష్టం చేస్తా’ అని అంజలి గావించి నివేదించిన వినయ మాధుర్యమూర్తి పోతన. ఎవరా విబుధ జనులు? అంటే ‘బుధా భావ సమన్వితాః’ అని గీతాశాస్త్రం. ‘అవగత పరమార్థ తత్తాః’ అని వివరించారు శంకర భగవత్పాదులు. గ్రంథ పరమార్థం గ్రహించినవారే బుధులు (పండితులు). భాగవత భాష్యకారులైన శ్రీధర, వంశీధర, వల్లభాచార్యుల వంటి వారెందరో! వారందరూ మహాకవికి మార్గదర్శకులే. వాస్తవానికి ఇక్కడ బ్రహ్మదేవుడు, శివుడు అంటే దేవతలు కారు. రజోగుణ, తమోగుణాలకు ప్రతీక అని వివరించారు వ్యాఖ్యాతలు. రజోగుణం చిత్తవిక్షేపాన్ని (అనాత్మ ప్రపంచం పట్ల ఆసక్తిని) కలిగించగా, తమోగుణం ఆవరణకు (ఆత్మను దర్శించలేకపోవడం) కారణమవుతుంది. ఆవరణ విక్షేపాలే అవిద్యామయమైన సంసారం. ఈ రెండు దోషాలు అంతఃకరణంలో పాదుకొని ఉన్నంతవరకు భాగవత పరమార్థం బోధపడదు. శుద్ధ సత్తగుణ సంపన్నులైన భక్తులకే ఆ భాగ్యం! వ్యాస, శుక, సూత, శౌనకాది మహర్షులు, శ్రీధరుల వంటి భాష్యకారులు, ప్రహ్లాద నారద పరాశర పుండరీకాది భాగవతులు ఆ రసాస్వాదన పదవినందుకొని అందించిన (ఆనందించిన) వారే! వీరందరినీ ఆకళింపు చేసుకుని ఆ అతిలోక తత్తాన్ని తాను గ్రహించి అనుభవించి పరవశించి  అమృత రసాయనంగా- భాగవత రూపంగా అనుగ్రహించాడు మహాభాగవతుడు, రససిద్ధకవి, రుషి వంటి పోతన. ‘నా నృషిః కురుతే కావ్యం’ రుషి కానివాడు కవి కాలేడు కదా!

పోతన కాలానికి వెలుగు చూసిన తెలుగు కృతులలో నన్నయ, తిక్కన, ఎఱ్ఱనల భారతం అతనికి బాగా నచ్చిన గ్రంథం. నన్నయ్యది సంస్కృత శబ్ద బాహుల్యం కలిగిన భాష. తిక్కనది తెలుగుతనం తొణికిసలాడే బాస. ఎఱ్ఱన ఈ మధ్యేమార్గం అనుసరించాడు. ఈ మూడు కవితారీతులను విడివిడిగా అభిమానించే పాఠకులు ప్రబలటం చూసి వీరందరి అభిరుచులకు అనుగుణంగా పోతన తన కవితాశైలిని ఇలా నిర్ణయించుకున్నట్లు విన్నవించుకున్నాడు 

‘కొందఱకు దెనుగు గుణమగు

గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం

గొందఱికి గుణములగు నే

నందఱ మెప్పింతు గృతుల నయ్యైయెడలన్‌'

కొందరికి తెలుగు పలుకులు మిక్కిలిగా ఉంటే మక్కువ. కొందరికి సంస్కృత పదాలు ప్రీతి. రెంటిని సమర్థంగా సమపాళ్లుగా సమకూరిస్తే మరికొందరికి సంతోషం. నేను ఆయా ఘట్టాలతో అందరినీ సమంగా అలరిస్తానని ప్రతిన పూని అద్భుతంగా అలరించాడు. ఇదేదో స్వాతిశయంగా చేసిన ప్రతిజ్ఞ  కాదు. తన కవితా భాషా శైలి పాఠకులకు పరిచయం చెయ్యటమే ఇందలి పరమార్థం. లేకపోతే ఇతర కవుల వలె పోతన కూడా తన గురించి ఇంకా బాకా ఊదుకొనేవాడు. ఇలాంటి గుణశీలాలు కలిగినవాడు కనుకనే భాగవతం వంటి భక్తి తత్త ప్రధానమైన ఆధ్మాత్మిక గ్రంథాన్ని తెనిగించడానికి ఎంతో తగినవాడయ్యాడు మన పోతన!


logo