ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Jun 26, 2020 , 00:17:28

హరితం ఆరవ హారం!

హరితం ఆరవ హారం!

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మొక్కను నాటడంతో హరిత తెలంగాణ ఆవిష్కారంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఆరో విడత హరితహారంలో భాగంగా ఈ ఏడాది ముప్ఫై కోట్ల మొక్కలు నాటడానికి రంగం సిద్ధమైంది. ఒకప్పుడు ఇంటిలో నాటుకోవడానికి ఒక మొక్క దొరకడమే కష్టంగా ఉండేది.  నాయకులు మొక్కలు నాటడం అంటే అదొక మొక్కుబడి కార్యక్రమం. అక్రమ కలప వ్యాపారులు, నాయకులు కుమ్మక్కు కావడం వల్ల తెలంగాణలో అడవులు అంతరించాయి. కానీ తెలంగాణ సమగ్రాభివృద్ధిని కాంక్షించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చదనంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్రమ కలప వ్యాపారులకు సింహస్వప్నమయ్యారు. మొక్కలు నాటడమే కాదు, సంరక్షించే బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించారు. ఊరికో నర్సరీ ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే అపూర్వం. రహదారుల వెంబడీ నర్సరీలు పలకరించడం తెలంగాణ ప్రత్యేకత. 

నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై పాదం మోపినప్పుడు ఒక మాట అన్నాడు- ‘ఒక మనిషి వేసిన ఒక అడుగు, మానవాళి వేసిన ఒక పెద్ద గంతు’. సమష్టి కార్యక్రమాన్ని ఒక వ్యక్తి ద్వారా వ్యక్తీకరింప చేయవచ్చు. ఒక వ్యక్తి మహోన్నతుడైనప్పుడు సమష్టి చైతన్యాన్ని ప్రేరేపించవచ్చు. ముఖ్యమంత్రి గురువారం నాడు పాదువేసిన మొక్క తెలంగాణ సమాజం వేస్తున్న ఒక పెద్ద గంతుకు సంకేతం. కానీ ముఖ్యమంత్రి నాటిన మొక్క సంకేతప్రాయమైనదు కాదు, సామూహిక కృషిలో భాగం. హైదరాబాద్‌ నగర శివారులో మంత్రి కేటీఆర్‌ కూడా ఒక మొక్కను నాటారు. అటు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది భాగస్వామ్యంతో హరితహార సంరంభం ప్రారంభమైంది. ముప్ఫై కోట్ల మొక్కలు నాటే మహత్తర కార్యక్రమం ఇది. కేసీఆర్‌ నాటిన ఆ ఒక్క మొక్క మొత్తం తెలంగాణ పచ్చదనానికి ప్రతీక. తెలంగాణ పచ్చదనం ప్రపంచ పర్యావరణ పరిరక్షణోద్యమ వీచిక. 

‘ఈదరీసుద్ది యీసుద్ది చీదరేసుద్ది/ ఆకు పండుద్ది ఊగుద్ది ఊగిరాలుద్ది/ బతుకు పోరుద్ది పోరుద్ది రుతువు మారుద్ది... /చినుకు జారుద్ది ఇంకుద్ది కెలక వూరుద్ది/  ఏరు చేపుద్ది తావుద్ది ఏరు పారుద్ది... / చేను ఇంకుద్ది ఎండుద్ది గింజరాలుద్ది/ బతుకు పోరుద్ది పోరుద్ది రుతువు మారుద్ది /మోడు ఎండుద్ది ఎండుద్ది బెరడు చిట్లుద్ది / కొమ్మ మురుసుద్ది మురుసుద్ది చిగురు వేసుద్ది /బతుకు పోరుద్ది పోరుద్ది రుతువు మారుద్ది’ అంటూ ప్రకృతి ధర్మాన్నీ, జీవన తాత్తికతను దశాబ్దాల కిందటే తెలంగాణ గ్రామీణ వాడుక భాషలో ప్రజా కవి కాళోజీ గొప్పగా బోధించారు. ఏరు ఇంకిపోతే, కొమ్మ మోడువారితే ఇక అంతా అయిపోయినట్టే కనిపిస్తుంది. కానీ బతుకు పోరాటం సాగుతూనే ఉంటుంది. రుతువు మారుతుంది.. చినుకు పడుతుంది, ఏరు పారుతుంది, చిగురు తొడుగుతుంది! మనిషి జీవితమైనా అంతే, తెలంగాణ సమాజమైనా అంతే! కష్టకాలంలో తెలంగాణ అస్తిత్వం కోసం తన్లాడింది. మళ్ళీ ఇప్పుడు చిగురు వేస్తున్నది. ముఖ్యమంత్రి నాటుతున్న చిన్న మొక్క భవిష్యత్తులో శాఖోపశాఖలుగా విస్తరించి, ఫలపుష్పాలతో పరిమళాలు వెదజల్లే  తెలంగాణ సమాజానికి ప్రతీక! 


logo