శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jun 26, 2020 , 00:12:28

పరివర్తనా ప్రవక్త.. పీవీ

పరివర్తనా ప్రవక్త.. పీవీ

పీవీ నరసింహారావు అపర చాణక్యుడు.. బహుముఖ ప్రజ్ఞాశీలి. భారత దేశానికి తెలంగాణ అందించిన జాతిరత్నం ఆయన. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీలో పనిచేయడం, ఆయన కుమారుడు పీవీ రంగారావుతో నాకు సాన్నిహిత్యం ఉండటంతో చాలా దగ్గరగా ఆయనను చూసే అవకాశం కలిగింది. నా రాజకీయ గురువు కూడా పీవీనే. దేశరాజకీయాలను గమనిస్తే.. పీవీకి ముందు, పీవీకి తర్వాతగానే విడదీసి చెప్పుకోవాలి. దేశంలో నెహ్రూ తర్వాత ఆ స్థాయిలో, కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ మేధావిగా పీవీనే చెప్పవచ్చు. 

పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేనాటికి దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలి ఉంది. అప్పుల వాయిదాలు కూడా చెల్లించలేని దుర్భర స్థితిలోకి జారుకున్నది. మన బంగారాన్ని బయటి దేశాల్లో తాకట్టు పెట్టిన గడ్డురోజులవి. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశాన్ని గాడిన పెట్టేందుకు ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. తన చాణక్యంతో మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తూనే ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచీకరణకు పీవీ ఆద్యుడు, ప్రధాన పాత్రధారి. మన్మోహన్‌ ఆర్థిక సంస్కరణలకు పూర్తిస్థాయిలో ఆయన మద్దతు ఇచ్చారు. విదేశాంగ మంత్రిగా చైనాతో పాటు అనేక దేశాలతో దౌత్య సంబంధాలు బలోపేతం చేశారు. ఆర్థిక సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలకు అదే స్థాయిలో పీవీ సమాధానం చెప్పేవారు. ఓసారి పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘నేను అంతా ఆమ్మేసినా అనుకుంటున్నారే కానీ దేశానికి తెచ్చిన ఆదాయం, మిగిల్చిన ఆదాయంపై ఎందుకు లెక్కలు వేయడం లేదని’  ప్రశ్నించారు. 

సోషలిస్టుగా ప్రైవేటీకరణవైపు..

పీవీ నరసింహారావు స్వతహాగా సోషలిస్టు. కానీ సోషలిస్టుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రైవేటీకరణను ప్రోత్సహించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఆయన నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రైవేటీకరణపై అతనిపై వచ్చిన ప్రతి విమర్శకు జవాబు చెప్పారు. తిరుపతిలో జరిగిన ఏఐసీసీ సమావేశం వేదికగా విమర్శలను తిప్పికొట్టారు. అసలు సోషలిజానికి అర్థం ఏమిటో చెప్పడంతో పాటు ప్రధానిగా తాను చేసే సంస్కరణలు సోషలిజానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సోషలిజం అనేది అలాగే అంటిపెట్టుకునేది కాదంటూనే.. సమయం, అవసరాన్ని బట్టి సోషలిజం కూడా మారాలంటూ సమాధానం చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు లేవనెత్తిన విమర్శలకు, ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 

భూ సంస్కరణలు..

పీవీ తీసుకున్న నిర్ణయాల్లో భూ సంస్కరణలు మరో ముఖ్యమైన, సాహసోపేతమైన అంశం. తెలంగాణలో, దేశంలో భూ సంస్కరణలు వచ్చాయంటే అది ఆయన చలవే. మనది వ్యవసాయ దేశం. ఇక్కడ చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉంటారు. కానీ వారికి అన్యాయం జరగడంపై పీవీ చలించిపోయారు. వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో భూ సంస్కరణలకు బీజం వేశారు. దున్నే వాడిదే భూమి అనే సిద్ధాంతాన్ని అనుసరించి భూమి లేని వాడికి భూమి అనే కొత్త సి ద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆయన హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్‌ సీలింగ్‌ బిల్లును పీవీనే స్వయంగా రాశారు. తన గదిలో తలుపులు మూసుకొని అర్ధరాత్రి ఆ బిల్లుకు రూపం పోశారు. ఆనాటి సంఘటన నాకు ఇప్పటికీ గుర్తు. పెత్తందార్లకు అవకాశం ఇస్తే కుక్కలు, నక్కల పేర్లతో భూబదలాయింపులు జరుగుతాయని అన్నారు. ఆయన భూస్వామ్య కుటుంబంలో నుంచి వచ్చినా పేదల పక్షపాతిగానే వ్యవహరించారు. ఆయనపై రామానందతీర్థ ప్రభావం ఎక్కువ. 

విద్యా సంస్కరణలు..

ఉమ్మడి రాష్ట్రంలో పలు సంస్కరణలకు ఆద్యుడు పీవీ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన చేసిన విద్యా, భూ సంస్కరణలు గొప్పవి. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య మొత్తం తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు. స్కూల్‌ స్థాయిలో డిటెన్షన్‌ విధానాన్ని ఎత్తివేయడంతో పాటు రెసిడెన్షియల్‌ విద్యకు నాంది పలికారు. ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్న సర్వేల్‌ విద్యాసంస్థ పీవీ మానస పుత్రిక. దీంతోపాటు దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలు కూడా ఆయన మనసులో నుంచి పుట్టినవే. స్కూళ్లు, కాలేజీలకు రావడానికి వీల్లేని వారు కూడా చదువుకునేలా ఓపెన్‌ స్కూల్స్‌ ఉండాలన్నది పీవీనే. ఆయన స్ఫూర్తిగా నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడే ఇప్పటి అంబేద్కర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 

సోషల్‌, పొలిటికల్‌ రెవల్యూషన్‌..

రాష్ట్ర రాజకీయాలను ఉన్నత వర్గాలు శాసిస్తున్న సమయంలో బడుగు వర్గాలకు రాజకీయ చేయూతనిచ్చింది, తమ వాటా గురించి ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది పీవీనే. రాష్ట్రంలో రాజకీయం ఇందిరా కాంగ్రెస్‌ వర్సెస్‌ రెడ్డి కాంగ్రెస్‌గా మారిపోయింది. కాంగ్రెస్‌ పార్టీని ఓ వర్గం పూర్తిగా బాయ్‌కాట్‌ చేసింది. అయినప్పటికీ డీలా పడకుండా ఆ సమయాన్ని బడుగుల రాజకీయ ఉన్నతికి పీవీ ఉపయోగించారు. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బడుగులకు 127 సీట్లు కేటాయించారు. కేటాయించడమే కాదు వారిని గెలిపించేందుకు ప్రతి గ్రామానికి తిరిగారు.  కాంగ్రెస్‌ పార్టీ ఇంకెక్కడ గెలుస్తదన్నారు. కానీ ఓ వర్గం నుంచి పేరున్న నాయకుడు లేకుండానే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అపూర్వ విజయం సాధించింది. ఈ విజయం నాలాంటి బడుగు నేతలకు రాజకీయంగా కీలకంగా మారింది. ఈ విజయం రాష్ట్రంలో సోషల్‌ పొలిటికల్‌ రెవల్యూషన్‌కు దారి తీసింది. ఆయన బడుగుల పక్షపాతి.

చివరి రోజుల్లో అవమానాలు.. 

ఐదేళ్లపాటు ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని తన చాణక్యంతో నడిపిన పీవీ దురదృష్టవశాత్తు తన చివరి రోజుల్లో అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని వెనుక అనేక రాజకీయ కారణాలున్నాయి. ప్రధానిగా ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేశారు. కానీ ప్రధానిగా ఆయన విజయాన్ని దాచేలా కొందరు రాజకీయాలు చేశారు. పీవీ చేసిన పనికి తగిన గుర్తింపు రాలేదు. రావలసినంత స్థాయిలో పేరు రాకుండా చేశారు. ఆయన మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం దక్కలేదు. ఐదేళ్లు ప్రధానిగా, ఏఐసీసీ అధ్యక్షునిగా పని చేసిన పీవీ భౌతిక కాయాన్ని పార్టీ భవనంలోకి కూడా తీసుకురానివ్వ లేదు. ఆ రోజు రాత్రంతా అక్కడ పెద్ద హైడ్రామా జరిగింది. అందరు ప్రధానుల మాదిరిగానే పీవీకి కూడా ఢిల్లీలోనే సమాధి ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. కానీ అందుకు ఒప్పుకోలేదు. చివరికి నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పీవీ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి, పీవీ భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇది తెలుగు ప్రజలకు జరిగిన అవమానంగా మేమంతా భావించాం. 

సక్సెస్‌ సీఎం అని చెప్పలేం.. కానీ ఫెయిల్యూర్‌ సీఎం మాత్రం కాదు

పీవీ ఏపీ ముఖ్యమంత్రి కావడం కూడా ప్రత్యేక పరిస్థితుల్లోనే జరిగింది. నాటి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకు చెందిన వ్యక్తికే సీఎంగా అవకాశం ఇవ్వాలని ఇందిరా గాంధీ భావించారు. ఆ విధంగా పీవీని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. ఏపీ నాయకుల పెత్తనం ఎక్కువగా ఉండేది. దీనికి తోడు ప్రభుత్వంలో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగేవి. అయినప్పటికీ గ్రూపు రాజకీయాలను ఎదుర్కొంటూనే ఏపీ నాయకులను కలుపుకొని ప్రభుత్వాన్ని సాగించారు. సీఎంగా రాష్ట్రంలో విద్యా, భూ సంస్కరణలను తీసుకొచ్చారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పేదల పక్షాన నిలిచారు. పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే భూ సంస్కరణలను తీసుకొచ్చారు. కానీ అదే ఆయనకు  నష్టం చేసింది. అయినప్పటికీ పేదలకు న్యాయం చేయడంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. దీనికి తోడుగా అప్పుడే ముల్కీ నిబంధనలను అప్‌హెల్డ్‌ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఏపీలో భూ సంస్కరణల ప్రభావంతో, గ్రూపు రాజకీయాలతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రిగా తక్కువ కాలమే ఉన్నప్పటికీ కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. పీవీ విజయవంతమైన సీఎంగా చెప్పలేం, కానీ ఫెయిల్యూర్‌ సీఎం మాత్రం కాదు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకేమీ కాదు.. 

ఒక తెలుగు వ్యక్తిగా పీవీ ఆంధ్రులంతా కలిసి ఉండాలనుకునే వారు. అలా అని తెలంగాణకు వ్యతిరేకం కాదు. తెలంగాణకు అనుకూలంగానే ఉండేవారు. తెలంగాణ కోసం మాట్లాడేవారిని ప్రోత్సహించేవారు. ఏదైనా సమాచారం కావాలంటే ఇచ్చేవారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని మోసింది పీవీనే. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనకపోయినా పరోక్షంగా తెలంగాణకు చాలానే చేశారు. ఆయన సమయంలోనే ఆరు సూత్రాల పథకం అమలు చేయాల్సి వచ్చింది. అదే విధంగా తెలంగాణ రైతుల్ని దృష్టిలో పెట్టుకునే భూ సంస్కరణలు తీసుకొచ్చారు.

నాకు గురుతుల్యులు..

పీవీ నాకు గురువులాంటి వారు. రాజకీయాల్లో అనేక సందర్భాల్లో అండగా నిలువడంతో పాటు మార్గనిర్దేశం చేశారు. పీవీ కుమారుడు రంగారావు నేను కలిసే తిరిగే వాళ్లం. క్రమం తప్పకుండా పీవీ ఇంటికి కూడా వెళ్లేవాడిని. నన్ను కూడా కుటుంబ సభ్యునిగా చూసేవారు. ఒక విధంగా చెప్పాలంటే కొడుకులా ఆదరించేవారు.


పీవీ మన ఠీవి బాబ్రీ విషయంలో వాళ్లను నమ్మారు...

 పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన బాబ్రీ మసీదు ఘటన చాలా క్లిష్టమైంది. దీనిలో పీవీ వైఫల్యం ఉందని అంతా ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పీవీ నాటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌ను, బీజేపీ నాయకులను నమ్మారు. కానీ వారు పీవీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఆ ఘటన జరిగిన సమయంలో పీవీ తన గదిలో ఒంటరిగా కూర్చున్నారు. దీనిపై ఒక సెక్యులరిస్టుగా పీవీ గట్టిగా స్పందించారు. బాబ్రీ మసీదు ఘటనలో పరిణామాలు చాలా సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించారు. ఒక హిందువుగా, సెక్యులరిస్టుగా ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు పీవీ కృషి చేశారు.

హంగులు, ఆర్భాటాలకు దూరం...

ముఖ్యమంత్రిగా ఉన్నా... ప్రధానిగా ఉన్నా పీవీ సాధారణంగా ఉండేవారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. కూలీతో అయినా అమెరికా అధ్యక్షుడితోనైనా ఒకే విధంగా మాట్లాడేవారు. ముఖ్యంగా పీవీ మితభాషి. ఆయన మనసులో ఏముందో ఎవరికీ చెప్పేవారు కాదు. కానీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేవారు. ఎల్లప్పుడూ శాంతంగా ఉండే పీవీకి చాలా  అరుదుగా కోపం వచ్చేది.

నెహ్రూ తర్వాత ఆ స్థాయి వ్యక్తి పీవీనే..

భారత రాజకీయాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఆ స్థాయి వ్యక్తి పీవీనే. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఆర్థిక సంస్కర్తగా, భూ సంస్కరణల ఆధ్యునిగా, విద్యా సంస్కర్తగా తన రాజనీతిని చాటుకున్నారు. దేశ చరిత్రలో ఐదేళ్లు ప్రధానిగా ఉండి సరైన గౌరవం దక్కని ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావే. ఐదేళ్లు ప్రధానిగా చేసిన తర్వాత కూడా అతన్ని తక్కువ చేసి చూపారు. ప్రధానిగా అతని సక్సెస్‌ను ప్రచారం కాకుండా అడ్డుకున్నారు. 


logo