సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jun 24, 2020 , 23:53:14

సత్పురుషుడి స్మరణ

సత్పురుషుడి స్మరణ

ఢిల్లీ గద్దెనెక్కి దేశాన్ని పాలించిన తెలంగాణ ముద్దు బిడ్డడు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని  రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం సముచితమైన నిర్ణయం. ఈ నెల 28వ తేదీన పీవీ జయంతి నుంచి ఏడాది పాటు రాష్ట్రంలోను, దేశవ్యాప్తంగానే కాకుండా యాభై దేశాలలో విస్తృతమైన రీతిలో కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించారు. రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన పీవీ దక్షిణాది నుంచి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. నెహ్రూ కుటుంబానికి చెందని నేత ఒకరు పూర్తి పదవీ కాలం పరిపాలించిన ఘనతను దక్కించుకున్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినప్పటికీ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వాతంత్య్రోద్యమకారుడిగా, పత్రికా సంపాదకునిగా, సాహితీవేత్తగా, రాజకీయ దురంధరుడిగా, పరిపాలనాదక్షుడిగా పీవీ ప్రజ్ఞ బహుముఖీయమైనది, కార్యక్షేత్రం విస్తృతమైనది. ఈ మహామహుడిని భారత రత్నతో సత్కరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ స్వాభిమానం దెబ్బతీసి, మన సమాజాన్ని ఆత్మన్యూనతకు గురి చేయాలనే కుట్రలు సాగాయి. బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవడాన్ని కూడా నీతిబాహ్యంగా చిత్రీకరించే కుటిలయత్నాలు సాగాయి. తెలంగాణ వైతాళికులు కూడా విస్మరణకు గురయ్యారు. కొందరు మహోన్నతుల వ్యక్తిత్వంపై బురద జల్లే ప్రయత్నం జరిగింది. ఇక పీవీ పరిస్థితి మరింత విషాదకరం. జాతీయ రాజకీయ రంగలో కొందరి కుత్సితాల మూలంగా ఆయన అనేక రీతుల్లో వేధింపులకు గురయ్యారు. రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఢిల్లీ దేవరల ప్రాపకం కోసం పీవీ పట్ల అంటీ ముంటనట్టు వ్యవహరించారు. ఎన్ని వేధింపులు సాగినా పీవీ మౌనంగా, గంభీరంగా ఎదుర్కొని సచ్ఛరితునిగా బయటపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా మసకబారలేదు. చరిత్రలో ఆయన పాత్ర చెరిగిపోనిది.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఆయనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదు. 

అనేక ఆక్షేపణలను, అవరోధాలను అధిగమించి తెలంగాణ సమాజం స్వాభిమానాన్ని, అస్తిత్వాన్ని చాటుకున్నది. తెలంగాణ రాష్ర్టాన్నీ సాధించుకున్నాం. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నాం. స్వీయ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ పునర్నిర్మాణానికే పరిమితం కాలేదు. మన భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. మన పండుగలను అధికారికంగా జరుపుతున్నారు. మన వైతాళికులను సగర్వంగా స్మరించుకుందామని ఉద్బోధిస్తున్నారు. కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేయడం, దాశరథి అవార్డును నెలకొల్పడం ఇందుకు ఉదాహరణలు. దేశ చరిత్రను మలుపు తిప్పిన పీవీ శత జయంత్యుత్సవాలను నిర్వహించ తలపెట్టడం కొనసాగింపు. ఈ ఉత్సవాల నిర్వహణ ఆ మహనీయుడిని స్మరించుకోవడమే కాదు, మన తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుకోవడం. 


logo