మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jun 24, 2020 , 23:54:11

కరోనాకు పరిష్కారమెలా?

కరోనాకు పరిష్కారమెలా?

కరోనా ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉండబోతున్నది. త్వరలో మొత్తం వ్యాధిని నివారించగలిగే మందుగానీ, వ్యాక్సిన్‌గానీ వచ్చే అవకాశం లేదు.. మన దేశంలో కరోనా వ్యాధిని కట్టడి చేయడంలో లాక్‌డౌన్‌ విజయం సాధించింది. ఎత్తివేసిన తర్వాత కరోనా ఉధృతి పెరిగింది. ఇతర దేశాల్లో (జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, స్పెయిన్‌) లాక్‌డౌన్‌ కరోనా కర్వ్‌ (వక్రరేఖ)ను దిగువకు చేయడంలో విజయం సాధిస్తే, భారత్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత వాటి ఫలితాలను పూర్తిగా దక్కకుండా చేసింది. ఇప్పటివరకు కరోనాను కట్టడి చేయడంలో భౌతిక దూరం, మాస్క్‌, శుభ్రత అనే త్రిముఖ వ్యూహాలే అత్యంత కీలకమని మన అనుభవాలు చెప్తున్నాయి.

కరోనా మహమ్మారి మన దేశంలో మహోధృతంగా విస్తరిస్తున్నది. రోజుకు, గంటకు చొప్పున వైరస్‌ సోకిన కేసులు పెరిగిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. దేశం ఏమైపోతుందోననే ఆందోళన కలుగుతున్నది. వైరస్‌ సోకిన వారిసంఖ్య చూస్తే.. మనం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మరణాల శాతం 6.3 కాగా, మన దేశంలో 3.23 శాతం.

భారత్‌లో మొదటి కేసు జనవరి 30న నమోదైంది. ఆ తర్వాత క్రమంగా విస్తరిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో పాగా వేసింది. ముఖ్యంగా ఈ కేసులు ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌, పుణె, కోల్‌కతా.. ఈ ఆరు నగరాల్లో ఎక్కువ వెలుగుచూశాయి. 68,07,326 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 4,10,461 మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రతి పది లక్షల మందిలో 5033 మందికి పరీక్షలు నిర్వహిస్తే, 6.03 శాతం మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఇదే సరళి కొనసాగితే 8-10 రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు కావడం ఖాయం. ఆ రకంగా సెప్టెంబర్‌ ఆఖరి వరకు దాదాపు 12-24 కోట్ల మందికి కరోనా సోకుతుంది. దాదాపు ఒక లక్ష కేసులకు 3వేల మంది చనిపోతే కోటికి 3 లక్షల మంది, 10 కోట్ల కేసులు వస్తే 30 లక్షల మంది చనిపోయే అవకాశమున్నది. భారత్‌లో దాదాపు 30 కోట్ల కుటుంబాలు ఉంటే ఇంటికో కరోనా వ్యాధిగ్రస్థుడు ఉండే అవకాశం ఉన్నది. 

కరోనా విషయంలో గుర్తించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. 1. కరోనా ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉండబోతున్నది. మనం విధించే కాలపరిమితి లేదా మానసిక పరిమితికి కరోనా కట్టుబడి ఉండదు. 2. త్వరలో మొత్తం వ్యాధిని నివారించగలిగే మందుగానీ, వ్యాక్సిన్‌గానీ వచ్చే అవకాశం లేదు. వస్తే అది అద్భుతమే. ఎందుకంటే ఇదే జాతికి చెందిన ఎయిడ్స్‌, ఎబోలా లాంటి వైరస్‌లకు గత 30 ఏండ్లుగా వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. 3. ఇది ఒక వైద్య సమస్య కానీ రాజకీయ సమస్య కాదు. కాబట్టి తీసుకునే చర్యలు కచ్చితంగా వైద్య సలహాల మేరకు అమలు చేయాల్సిన అవసరం ఉంటది. 4. ఇది ఒక సామాజిక సమస్య కాకూడదు. ఎందుకంటే ఇదే ఉధృతి కొనసాగితే సెప్టెంబర్‌, అక్టోబర్‌ వరకు ఇంటికో కరోనా వ్యాధి సోకినవారు ఉంటారు. 5. మార్చి 24న మొదలైన లాక్‌డౌన్‌ను జూన్‌ 1 నుంచి దాదాపు మొత్తం ఎత్తివేశారు. కానీ లాక్‌డౌన్‌ ఎత్తివేయడమంటే చేతులెత్తేయడం కాదు. కాకూడదు. 6. కరోనా వ్యాధిని కట్టడి చేయడంలో లాక్‌డౌన్‌ విజయం సాధించింది. ఎత్తివేసిన తర్వాత కరోనా ఉధృతి పెరిగింది. 7. ఇతర దేశాల్లో (జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, స్పెయిన్‌) లాక్‌డౌన్‌ కరోనా కర్వ్‌ (వక్రరేఖ)ను దిగువకు చేయడంలో విజయం సాధిస్తే, భారత్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత వాటి ఫలితాలను పూర్తిగా దక్కకుండా చేసింది. 8. భారత్‌ను ఇతర ధనిక దేశాలతో పోల్చలేము. ఉదాహరణకు న్యూజిలాండ్‌ మొత్తం దేశ జనాభా 48 లక్షలు. ప్రతి కుటుంబ వార్షిక ఆదాయం 1.2 కోట్లు. అక్కడి ప్రజలు ప్రభుత్వ సూచనలను తూచా తప్పక పాటిస్తారు. భారత్‌ జనాభా 137 కోట్లు. ప్రతి కుటుంబ ఆదాయం కేవలం 2 లక్షలు. ఇక్కడ చట్టపరమైన చర్యలు ఉంటేనే సూచనలు అమలవుతాయి. అందువల్ల భారత్‌ వ్యూహం భారత్‌కు ఉండాలి. 9. అందరి సూచనలు, ఇతర దేశాల అనుభవాలు చూసి మొత్తం భారతదేశం ఒక నిర్దుష్టమైన విధానాన్ని అమలుచేయాలి. 10. ఇప్పటివరకు కరోనాను కట్టడి చేయడంలో భౌతిక దూరం, మాస్క్‌, శుభ్రత అనే త్రిముఖ వ్యూహాలే అత్యంత కీలకమని మన అనుభవాలు చెప్తున్నాయి. వాటిని అమలు చేయడమే ప్రభుత్వ, ప్రజల కర్తవ్యం.

కరోనా కమ్యూనిటీ వ్యాప్తి చెందిందనడంలో సందేహం లేదు. రేటు తగ్గిందని గణాంకాల ఆధారంగా సంతృప్తి చెందలేం. కేసుల సంఖ్య తగ్గాలి. మరణాలు తగ్గాలి. కరోనా వక్రరేఖ చదును కావాలి. తర్వాత దిగువకు పోవాలి. కరోనారహిత దేశంగా (కేవలం ఒక రాష్ట్రం అయినా లాభం ఉండదు) కావడమే మన లక్ష్యం కావాలి. భౌతిక దూరం, మాస్క్‌, శుభ్రత అమలుచేయడం తప్పనిసరి చేయాలి. మాస్కులు పేద వర్గాలకు ప్రభుత్వం పంచడం కరోనా కట్టడిలో భాగం కావాలి. (మాస్క్‌ 50-70 శాతం వ్యాధిని నిరోధిస్తుంది). ఇవి పై నుంచి కింది వరకు అమలు చేయాలి. వ్యాధి తీవ్రత వైరల్‌ లోడ్‌ మీద ఆధారపడి ఉంటది. కాబట్టి త్రిముఖ వ్యూహంలో కరోనా సోకినా వ్యాధి తీవ్రత తక్కువ ఉంటది. డిజిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

రాష్ట్రంలోని ప్రతి ఇంటిని (కోటి కుటుంబాలు) క్లస్టర్‌గా విభజించి, పోలీస్‌స్టేషన్‌వారీగా ఒక నియమావళి తయారుచేసుకుంటే మంచి ఫలితం ఉంటది. ఆర్థికంగా అన్ని రాష్ర్టాలు కష్టంగా ఉన్న సమయంలో ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, వ్యవసాయ భద్రత, పని భద్రతకే పూర్తి ప్రాముఖ్యమిచ్చి ఇతర ఖర్చులను తగ్గించుకుంటే కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటది. కొవిడ్‌ వైరస్‌ నివారణ, నిర్మూలన గురించి సందర్భానుసారంగా డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలి. టెస్ట్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, టయింగ్‌ (క్వారంటైన్‌) అనే చతుర్ముఖ వ్యూహం ప్రపంచం మొత్తం అవలంబిస్తున్న విధానం. ప్రపంచంలో అతి తక్కువ టెస్టులు చేస్తున్న 5 దేశాల్లో భారత్‌ ఒకటి. పాజిటివ్‌ కేసులను ఎ, బి, సి గా విభజించి, కేవలం సీరియస్‌ పేషెంట్లను మాత్రమే హయ్యర్‌ సెంటర్లకు పంపితే పని ఒత్తిడి తగ్గడం, మెరుగైన వైద్యం ఇవ్వడం వీలవుతది. అనుమానితుల టెస్ట్‌ వలన కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ సులభం అవుతుంది. తద్వారా కమ్యూనిటీ వ్యాప్తిని నిరోధించవచ్చు. 

ట్రీట్‌మెంట్‌లో భాగంగా హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి పల్స్‌, ఆక్సిమీటర్‌ పరికరం అందుబాటులో ఉంచితే ఆక్సిజన్‌ స్థాయి తగినప్పుడు వారిని హాస్పిటల్‌కు మార్చే అవకాశం ఉంటది. ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఇప్పుడున్న క్లోరోక్విన్‌, కొత్తగా వస్తున్న ఫ్యావిపిరవిర్‌లను ప్రయత్నం చేయవచ్చు. కానీ తీవ్రమైన కేసుల్లో ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. కరోనా నుంచి కోలుకున్నవారు తప్పక రక్తదానం చేసేవిధంగా స్ఫూర్తి నింపాలి. హాస్పిటల్‌ సదుపాయాలు మున్ముందు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌తో కూడిన కొవిడ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేయడం అవసరం. ఒక అనుమానిత రోగి వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలో ఫోన్‌ కాల్‌ ద్వారా సమాచారాన్ని, సదుపాయాన్ని కల్పించేలా కొవిడ్‌ హాస్పిటల్స్‌ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేస్తే ఉపయోగం. కమ్యూనిటీ, జిల్లా, రెఫరల్‌ హాస్పిటల్స్‌గా మూడంచెల విధానముండాలి. కరోనా నియంత్రణ, నివారణ, నిర్మూలనకు దీర్ఘకాలిక ఆర్థిక, వైద్య, మానసిక ప్రణాళిక రచించినప్పుడే మనం గెలువగలం. కరోనా పూర్తిగా పోవాలంటే కాలానుగుణంగా వైరస్‌ తీవ్రత తగ్గిపోవాలి. లేదా ఎక్కువ మందికి ఇమ్యూనిటీ రావాలి. ముఖ్యంగా కరోనా వైరస్‌ సోకకుండా జాగ్రత్తపడటం అవసరం.

(వ్యాసకర్త: మాజీ ఎంపీ, భువనగిరి)

హాస్పిటల్‌ సదుపాయాలు మున్ముందు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌తో కూడిన కొవిడ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేయడం అవసరం. ఒక అనుమానిత రోగి వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలో ఫోన్‌ కాల్‌ ద్వారా సమాచారాన్ని, సదుపాయాన్ని కల్పించేలా కొవిడ్‌ హాస్పిటల్స్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తే ఉపయోగం. కమ్యూనిటీ, జిల్లా, రెఫరల్‌ హాస్పిటల్స్‌గా మూడంచెల విధానం అవసరం. కరోనా నియంత్రణ, నివారణ, నిర్మూలనకు ఒక దీర్ఘకాలిక ఆర్థిక, వైద్య, మానసిక ప్రణాళిక రచించాలి.


logo