శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jun 23, 2020 , 23:14:24

యువతా, నిరాశ వలదు

యువతా, నిరాశ వలదు

కొన్ని నెలలుగా ఊహిస్తున్నట్టుగానే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గ్రీన్‌కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తూనే, పలురకాల వర్క్‌ వీసాల జారీని నిలిపివేశారు. హెచ్‌1బి, హెచ్‌-4తో సహా పలు రకాల వీసాల జారీని డిసెంబర్‌ చివరి వరకు రద్దు చేశారు. ఇప్పటికే వీసాలు పొంది అమెరికాలో ఉన్నవారికి ఈ రద్దు వర్తించదు. చదువుకుంటూ ఉపాధి పొందే ఓపీటీ అవకాశాన్ని కొనసాగించడం కూడా ఊరట కలిగిస్తున్నది. ఓపీటీ వల్ల లబ్ధి పొందేవారిలో చైనీయులతోపాటు భారతీయ యువతనే ఎక్కువ. కొత్తవీసాల జారీ నిలిపివేయడం వల్ల ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలు స్థానికులకు లభిస్తాయనేది ప్రభుత్వ వర్గాల వాదన. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం అమెరికావైపు చూసే మనదేశ యువతకు ఇది నిరాశను కలిగిస్తుందనేది వాస్తవమే. మొత్తం వీసా విధానాలనే సమూలంగా మార్చివేస్తామని ట్రంప్‌ గతంలో ప్రకటించారు. ఈ సమూల మార్పులు భారతీయులకు అనుకూలమనే భావన కూడా వ్యక్తమవుతున్నది. అయితే ప్రస్తుతం వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేయడం మాత్రం నిరాశను కలిగిస్తున్నది. 

కరోనా వైరస్‌ పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో అమెరికా వీసాల జారీ డిసెంబర్‌ వరకు ఆగినా బాధపడవలసిందేమీ లేదు. అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. జాత్యభిమానాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది ట్రంప్‌ విధానం. అందువల్ల ఎన్నికలు ముగిసిన తరువాత వీసాల జారీపై ఉన్న నిషేధాన్ని పొడిగించకపోవడమో, నీరుగార్చడమో జరుగుతుందనే అభిప్రాయం ఉన్నది. అమెరికాలోని వ్యాపార వర్గాలు కూడా వీసాల జారీపై నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వీసాల జారీపై నిషేధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని సాఫ్ట్‌వేర్‌ వ్యాపార కూటమి (బీఎస్‌ఏ) ఒక ప్రకటనలో అభ్యంతరం తెలిపింది. వివిధ కంపెనీలు అమెరికా కార్మికులను చేర్చుకోవడానికి ప్రయత్నించిన తరువాతనే, విదేశీ కార్మికులను నియమించుకుంటాయని ఇమిగ్రేషన్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సారా పియెర్స్‌ అనే అధ్యయనవేత్త ఇచ్చిన వివరణ గమనార్హమైనది. 

పిల్లలు పుట్టగానే ఎంట్రన్స్‌లు, ప్యాకేజీలు, వీసాల గురించి ఉగ్గుబాలతోనే నేర్పించే కాలమిది. లోపం సగటు తల్లిదండ్రులదో, వ్యవస్థదో కానీ నేటి దుస్థితి ఇది. అయినంత మాత్రాన అమెరికా వీసాలు ఇవ్వడం ఆపివేసిందనగానే హతాశులై పోవలసిన అవసరం లేదు. అమెరికాకు శ్రమజీవులు అవసరమైనప్పుడు కుటుంబసభ్యులకు, గొలుసుకట్టు సంబంధీకులకు తలుపులు తెరిచిపెట్టిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు అమెరికా దిగజారుతున్న ఆర్థిక శక్తి. భవిష్యత్తులో వీసా నిబంధనలు మరింత కఠినంగా మారవచ్చు. విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువడంలో, ఉన్నతమైన జీవితాలు గడపడంలో తప్పేమీ లేదు. కానీ అదే జీవిత పరమార్థం అనుకోకూడదు. భారత్‌ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. నవీన ఆర్థిక వ్యవస్థ పాదుకుంటున్నది. మన మేధాశక్తిని, సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. యువత నిరాశ చెందకుండా ఇక్కడే ఉండి తాము వృద్ధి చెందుతూ దేశాభివృద్ధి కోసం పాటుపడవలసిన తరుణమిదని గుర్తించాలి. 


logo