శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jun 23, 2020 , 23:14:23

చేతలు చూడలేని చేతకానితనం

చేతలు చూడలేని చేతకానితనం

అస్తవ్యస్తంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆరేండ్ల కాలంలోనే అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇలా ఒక రాష్ర్టానికి జవసత్వాలు నింపి పునరుజ్జీవనం కల్పించినవారు దేశంలో ఎవరైనా ఉన్నారా? పనులు చేయకున్నా కనీసం సంకల్పమైనా నిర్దేశించుకున్న రాష్ర్టాధినేత గతంలో, వర్తమానంలో కేసీఆర్‌ తప్ప ఎవరైనా ఉన్నారా? అంటే లేరనే చెప్పాలి. సుదీర్ఘ పోరాటంతో రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి సంక్షేమ పాలనలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేతపై నీలాపనిందలా? సద్విమర్శ అయితే ఫర్వాలేదు. కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలన్నీ ఈర్ష్య, అసూయలతో కూడుకున్నవే. విమర్శలు చేస్తున్న వారికి తమ పేరు పత్రికల్లో, మీడియాలో కనిపించాలన్న తపన తప్ప ఇంకేంలేదు.

1956 నుంచి చూస్తున్నా.. కేసీఆర్‌ కన్నా కార్య దక్షుడు, నిత్యం రాష్ర్టాభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. ఏ నాయకుడ వచ్చినా, తమ వారికి దోచిపెట్టడం తప్ప మరొకటి కనిపించలేదు. పురాణాల్లో ఒక సామెత.. ‘పటంచింద్యత్‌.. ఘటంబింద్యాత్‌..’ అని. కొంత మందికి పేరు రావాలి. ఎలా.. నాలుగు బజార్లు కలిసేచోట నిల్చుంటారు. వాళ్ల బట్టలు చించేసుకుంటారు. ఎందుకో ఎవరూ అడుగరు. మరికొందరు కొన్ని కుండలు తెచ్చి, పటపటా పగులగొడుతరు. ప్రజలు దీన్ని కూడా నిలబడి చూస్తరు. ఎవరూ పట్టించుకోరు. కానీ పత్రికల్లో, టీవీ చానళ్లలో మాత్రం..వాళ్లంతా చినిగిన గుడ్డలు, పగిలిన కుండలతో కనిపిస్తారు. ఇదే.. నేడు విమర్శనాస్ర్తాలు సంధిస్తున్న నాయకుల సంగతి. 

విమర్శలకూ ఓ స్థాయి హేతుబద్ధత ఉండాలి. విపక్షాల్లో ఇది కొరవడింది. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క ప్రాజెక్టు కట్టలేదంటారు. ఒక్క ఉద్యోగం కల్పించ లేదంటారు. మరి మొన్న తెలంగాణ పత్రికలో వచ్చిన 90 వేల ఉద్యోగాల వివరణ తర్వాత ఒక్కరూ నోరెందుకు విప్పలేదు? బలహీన వర్గాలకు, ఇతర వర్గాలకు ఒక్క అభివృద్ధి పథకం అమలు చేయలేదనడం ఎలా ఉంటుంది? వ్యవసాయదారులు, నేతపనివారు.. ఒకరేమిటి, సబ్బండ వర్ణాలవారు నెల నెలా తీసుకుంటున్న పెన్షన్ల మాటేమిటి? ఈ బట్టలు చించుకునేవారు బడుగు, బలహీనవర్గాల దగ్గరికి పోయి విమర్శలు చేస్తే బాగుండేది. 

64 ఏండ్లుగా ప్రతి అంశాన్ని పరికిస్తూ, ఉద్యమాల్లో పాల్గొంటూ పరిశీలిస్తున్న మాబోటి వాళ్లు, ఈ విమర్శలకు ఏమి జవాబు చెప్పాలి? తెల్సినవాడికి చెప్పొచ్చు. ప్రతిదాన్ని రాజకీయ దృష్టితో చూస్తూ విమర్శలకు దిగేవారికి విచక్షణ ఉండదు. తెలియని వాడికి చెప్పొచ్చు. తెలిసీ తెలియకుండా నటించే వాడికి ఏం చెప్తాం. వీరికి తెలంగాణ అభివృద్ధి కాంక్ష ఏ మాత్రం లేదు. ఉంటే ఇలాంటి వేషాలు వేయరు. ఇటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. భగవంతుడు ఇలాంటివారికి బుద్ధి, జ్ఞానం ఇచ్చుగాక..

(వ్యాసకర్త: రిటైర్డ్‌ సివిల్‌ సర్జన్‌) 


logo