బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Jun 21, 2020 , 23:13:26

చైనా కుతకుత.. కయ్యమే కథ!

చైనా కుతకుత.. కయ్యమే కథ!

భారత్‌ చైనా సరిహద్దుల ఘర్షణలకు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. రెండు అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు. అణ్వస్త్ర రాజ్యాలు. హఠాత్తుగా ఈ రెండుదేశాల మధ్యన ఉద్రిక్తతలకు కారణమేమిటనేది సాధారణ ప్రజలకు అంతుచిక్కని విషయం. వాస్తవానికి ఈ ఉద్రిక్తతలకు కారణాలు సరిహద్దుల్లో లేవు. అసలు సమస్య చైనా పాలకుల వైఫల్యంలో ఉన్నది. చైనా ప్రభుత్వ అసమర్థత పాలన మూలంగా ఆర్థికసంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. నిరుద్యోగం పెచ్చరిల్లింది. చైనా ప్రభుత్వ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పౌరసమాజం అట్టుడికిపోతున్నది. కరోనా వైరస్‌ ఆర్థికపరిస్థితిని మరింత కకావికలం చేసింది. అమెరికాతో వాణిజ్యయుద్ధం మూలంగా పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో చెలరేగిపోతున్న అసంతృప్తిని అణిచివేయడంతో పాటు వారి దృష్టిని మళ్లించేందుకు చైనా ప్రభుత్వం చుట్టుపక్కల దేశాలతో కయ్యాలకు దిగుతున్నది. దేశం ప్రమాదంలో పడిపోయిందంటూ జాత్యభిమానం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో నెలకొన్నదే భారత్‌తో సరిహద్దు ఘర్షణ. చైనా పరిస్థితి ఏమైనప్పటికీ భారత్‌ దీటుగా స్పందిస్తున్నది. ఆర్థికంగా, ఆయుధపరంగా బలంగా ఉన్న భారత్‌ చైనా దాడులను తిప్పకొట్టడానికి సంసిద్ధంగా ఉన్నది.

ఏదైనా దేశానికి అణ్వస్ర్తాలు ఉండగానే సరిపోదు. శత్రుదేశమే మొదటగా అణ్వస్త్ర దాడి జరిపి సర్వనాశనం చేస్తే చేయగలిగేదేమీ ఉండదు. అందువల్ల అణ్వస్త్ర పాటవం ఉన్న దేశానికి ఎదురుదెబ్బ తీసే సామర్థ్యం కూడా ఉండాలి. అంటే అణ్వస్త్ర దాడిని తట్టుకొని మళ్ళీ శత్రుదేశం మీద ప్రతిదాడి (సెకండ్‌ స్ట్రైక్‌ కాపబిలిటీ) చేయగలగే సామర్థ్యం ఉండాలి. లేకపోతే మనకు అణ్వస్ర్తాలు ఉన్నప్పటికీ శత్రుదేశాలు భయపడవు. భారత్‌కు ప్రతిదాడి సామర్థ్యం ఉన్నది. ప్రతిదాడిలో అణ్వస్ర్తాలు ప్రయోగించగలిగిన జలాంతర్గాములు కీలకమైనవి.

మూడు రకాలుగా అణ్వస్ర్తాలను ప్రయోగించే వ్యవస్థను నూక్లియర్‌ ట్రయాడ్‌ (అణ్వస్త్ర త్రయం) అంటారు. భూతలం నుంచి, యుద్ధ విమానాల చేత, జలాంతర్గముల ద్వారా అణ్వస్ర్తాలను ప్రయోగించే సామర్థ్యాలు ఉంటేనే ఈ కాలంలో శక్తిమంతమైన దేశంగా చెప్పుకోవచ్చు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ అణ్వస్ర్తాలను ప్రయోగించగలిగిన జలాంతర్గామి. దీనిద్వారా మన దేశానికి అణ్వస్త్ర త్రయం పూర్తయింది. మన దేశానికి ప్రతి దాడి సామర్థ్యం కూడా ఏర్పడింది. 

అగ్ని 5 ద్వారా భారత్‌ 2012 ఏప్రిల్‌ 19వ తేదీన ఖండాంతర క్షిపణులను కలిగిన దేశాల సరసన చేరింది. ఒక్కో క్షిపణికి రెండు నుంచి పది అణ్వస్ర్తాలను ఒకేసారి మోసుకొనిపోయే ప్రత్యేకత ఉన్నది. ఈ క్షిపణులు ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. అందువల్ల చైనా ఉపయోగించే ద్రవ ఇంధన క్షిపణుల కన్నా వేగంగా ప్రయోగించడం సాధ్యమవుతుంది. అగ్ని 5 క్షిపణి ఐదు వేల కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బకొట్టగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నది. ఈ లెక్కన దక్షిణాది నుంచి ప్రయోగించి చైనాలోని ఏ ప్రాంతాన్నయినా దెబ్బతీయవచ్చు. అయితే అగ్ని 5 సామర్థ్యం ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని, ఆ విషయం భారత్‌ పైకి చెప్పడం లేదని చైనా ఆరోపిస్తున్నది. 

ప్రపంచంలోని రెండవ పెద్ద ఆర్థికవ్యవస్థగా చైనాకు పేరున్నది. కానీ ఇప్పుడది 6.8 శాతం కుంచించుకుపోయింది. 1976లో మావో మరణించిన తర్వాత చైనా ఆర్థికవ్యవస్థ ఇంతగా కుంచించుకపోవడం ఇదే మొదటిసారి. వస్తు వినియోగం, ఎగుమతులు, పెట్టుబడులు ఈ మూడు చోదకశక్తులు కుదేలు కావడంతో చైనా ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతున్నది. కరోనా వైరస్‌ మూలంగా లాక్‌డౌన్‌ విధించవలసి వచ్చింది. దీంతో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రిటైల్‌ కొనుగోళ్లు 19 శాతం, ఎగుమతులు 13 శాతం ఫిక్స్‌డ్‌ అసెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 16 శాతం తగ్గిపోయాయి. 

చైనాలో ఉపాధి అవకాశాలు 5.9 శాతం తగ్గిపోయినట్టు చెబుతున్నారు. ఈ లెక్కన చూసినా 36 లక్షల మంది ఉపాధి కోల్పోయారనేది స్పష్టం. కానీ, చైనాలో గణాంకాలు, వాస్తవిక పరిస్థితులు బయటికి తెలువదు. నిరుద్యోగం పైకి చెప్పేదానికన్నా భారీగా ఉం టుందని అంచనా భవన నిర్మాణం, ఉత్పత్తి, ఇతర రంగాల్లో దాదాపు 30 కోట్ల మంది వలస కార్మికులు పనిచేస్తుంటారు. వీరిలో మార్చి చివరినాటి వరకు కనీసం 8 కోట్ల మంది వీధిన పడి ఉంటారని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఆ ఆర్థిక కల్లోలం నుంచి చైనా ఇప్పట్లో బయటపడలేదని అంచనా. 

భగ్గుమన్న ఆందోళనలు: 

చైనా ఆర్థికపరిస్థితి క్షీణించడం వల్ల ఉత్పత్తిరంగం పడిపోయింది. అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి ఉన్న కార్మికులకు వేతనాలు తగ్గిపోయాయి. దీంతో పలు ఫ్యాక్టరీల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. కార్మికులందరూ ఏకతాటిపై నిలిచి సమ్మెలు చేయకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నది. 2019 మొదటి ఆరు నెలల్లో 95 సమ్మెలు జరిగాయి. చైనా ప్రైవేట్‌ కంపెనీలలో 615 గొడవలు జరిగాయి. భవన నిర్మాణ, రవాణా, సేవల రంగాల్లో వేతనాలు సరిపోక నిరసనలకు దిగుతున్నారు. అయితే భారీ నిరసన ప్రదర్శనలు మాత్రం 2014లో జరిగింది. యూయె యుయెన్‌ పాదరక్షల కర్మాగారంలో 40 వేల మంది కార్మికులు 2 వారాల నిరసన ప్రదర్శనలు జరిపారు. ఇటీవలి కాలంలో బీజింగ్‌, షాంఘై, షెంజెన్‌ నగరాల్లో ప్రదర్శనలు ఉన్నత వృత్తులలో ఉన్నవారు కూడా నిరసనలు తెలిపారు. హెనాన్‌లో వంద మంది పారిశుద్ధ్య కార్మికులు ఏప్రిల్‌ 23న సమ్మెకు దిగారు. సఫాయి కార్మికులు, అకౌంటెంట్లు వైద్య కార్మికులు, హోటల్‌ రెస్టారెంట్‌ సిబ్బంది, జిమ్‌, బ్యూటీ సెలూన్‌ ఉద్యోగులు, సేల్స్‌ ఏజెంట్లు నిరసనలు తెలిపారు. చైనాలో సేవారంగంలోని కార్మికులకు చాలా తక్కువ వేతనాలున్నాయి. ఈ నిరసనలు సంఘటితంగా, విస్తృతంగా సాగితే ప్రమాదకరమని చైనా పాలకులు భయపడుతున్నారు. 

దయ్యాల నగరాలు:

అదొక మహానగరం.. ఆకాశ హర్మ్యాలు.. సుందరవనాలు.. ఆకట్టుకునే కొలనులు.. విశాలమైన రహదారులు.. వీధి దీపాలు.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు.. ఒక మహానగరానికి ఇంతకుమించి కావాల్సిందేమిటనిపిస్తు న్నదా? అందమైన ఆ నగరంలో లేనిదల్లా మనుషులే. చైనాలో ఇటువంటి మనుషుల్లేని కొత్త నగరాలు అనేకం ఉన్నాయి. భవనాలు, వీధులన్నీ ఖాళీగానే ఉంటాయి. మనుషుల్లేని ఈ నివాస సముదాయాలకే దయ్యాల నగరాలని పేరొచ్చింది. చైనా అమెరికాను తలదన్నే విధంగా అభివృద్ధి చెందుతుందని చూపడానికి ఈ నగరాల్లోని భవనాలు ఉదాహరణగా కనిపిస్తాయి. కానీ చైనా ఆర్థిక అభివృద్ధిలోని డొల్లతనానికి ఈ భవనాలు నిలువెత్తు నిదర్శనం. ఈ నగరాలలో సుమారు ఆరున్నర కోట్ల అపార్ట్‌మెంట్లు ఉంటాయని అంచనా. కానీ, కచ్చితమైన లెక్కలు చైనాలో లభించడం కష్టం. దేశం ఆర్థికంగా అతివేగంగా అభివృద్ధి చెందుతుందని, పల్లెటూర్ల నుంచి కోట్లాదిగా ప్రజలు నగరాలకు వలసవస్తారని, వారికి నివాసాలు అవసరమని చైనా పాలకులు భారీగా ఆలోచించారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. చైనా మధ్య తరగతి ప్రజలు పాలకుల మాటలు నమ్మి అప్పు తీసుకొని ఇందులో ప్లాట్లు కొనుక్కున్నారు. భారీ ఎత్తున ఈ నగరాల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రైవేట్‌ కంపెనీలకు అప్పుల భారమై చిప్ప చేతికొచ్చింది. నగర శివారుల్లోని పల్లెటూర్లలో ఈ భవన సముదాయాలు  మరో నగరాన్ని తలపించేలా నిర్మితమయ్యాయి. యూరప్‌ నగరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని అధునాతనంగా నిర్మించారు. ఒకచోట అపార్ట్‌మెంట్స్‌ సముదాయం పక్కన ఈఫిల్‌ టవర్‌ నమూనాను కూడా నిర్మించిపెట్టారు. కొన్ని నగరాల్లో కొంతమేర జనం వచ్చిచేరారు. కానీ, అనేకం ఖాళీగానే ఉన్నాయి. గోబీ ఏడారి అంచున 90 వేల ఎకరాల స్థలంలో ఒక నగరం నిర్మించారు. ఈ అధునాతన నగరాన్ని దుబాయికి ప్రత్యామ్నాయంగా ప్రచారం చేశారు. కానీ ఈ దయ్యాల నగరం కూడా గోబీ ఏడారి మాదిరిగానే మిగిలిపోయింది. 

కరడుకట్టిన నిరంకుశత్వం:

చైనాలో కమ్యూనిస్టు పార్టీ తప్ప మరే రాజకీయపక్షానికి స్థానం లేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైల్లో పడి చిప్పకూడు తినాల్సిందే. అసమ్మతి వ్యక్తం చేసిన నాయకులు మాయమైపోతూ ఉంటారు. ఇది చాలదన్నట్లు చైనా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తనకు తాను జీవితకాలపు నాయకుడిగా ప్రకటించుకున్నారు. మావో, డెంగ్‌ల తర్వాత తానొక సిద్ధాంతవేత్తగా రాజ్యాంగంలో లిఖించుకున్నారు. పార్టీ ఉన్నత పదవుల్లో తాను నియమించుకున్నవారు కూడా పదవీకాల పరిమితిని రద్దుచేశాడు. ఈయన పెత్తనానికి వ్యతిరేకంగా పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. మధ్యతరగతి వర్గం అంతా కమ్యూనిస్టు పార్టీ పెత్తనాన్ని జీ జిన్‌ పింగ్‌ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సోషల్‌ మీడియా ద్వారా ఈ ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకోవడం కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌  దేశ సైనికులను యుద్ధానికి సన్నద్ధం కావలసిందిగా పిలుపునిచ్చారు. చైనాను ప్రపంచంలోకెల్లా అగ్రరాజ్యంగా నిలబెట్టే మహానాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నాడు. చుట్టూరా దేశాలతో కయ్యానికి దిగుతున్నాడు. 

దురాక్రమణలు..

కొవిడ్‌-19 తర్వాత చైనా ఇరుకున పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి  విషయంలో చైనా సరైనవిధంగా స్పందించలేదని, కరో నాను కట్టడి చేయటానికి తగిన సమాచారం అందించలేదని ప్రపంచ దేశాలన్నీ చైనాను తప్పుబట్టాయి. దీంతో పోయిన ప్రతిష్ఠను నిలుపుకోవటానికి తంటాలు పడుతున్నది. అదే సమయంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో కూడా స్వదేశంలోనూ వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న స్థితిలో ఏదోవిధంగా ప్రజల దృష్టి మళ్లించటానికి చైనా ప్రయత్నాలు చేస్తున్నది. ఒక భారత్‌తోనే కాదు, ఇతర దేశాలతోనూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నది. దక్షిణ చైనా సముద్రజలాల్లో వియెత్నాం నౌకను ముంచివేసింది. మలేషియా నౌకను వేధించింది. తైవాన్‌ను బెదిరిస్తున్నది.  చైనా, జపాన్‌ దేశాలు తమ ప్రాంతంగా ప్రకటించుకుంటున్న జలాల్లోకి చైనాకు చెందిన చేపల వేట పడవలు ప్రవేశించాయి.

రెండురోజుల కిందట ఆస్ట్రేలియాపై తీవ్రమైన సైబర్‌ దాడి జరిగింది. పరిపాలన, పరిశ్రమలు, విద్య, అత్యవసర సేవలు, వ్యూహాత్మకంగా కీలకమైన మౌలిక వసతులు, రాజకీయసంస్థలు ఇలా అన్నిరంగాలపైనా ఈ దాడి జరిగింది. ఈ దాడి వెనుక 95 శాతం చైనా హస్తమే ఉందనేది ఆస్ట్రేలియా  ఆరోపణ. ఈ క్రమంలోంచే.. భారత సరిహద్దులో చైనా చొరబాట్లకు పాల్పడింది.వాతావరణం శాంతియుతంగా సద్దుమణగని పక్షంలో, యుద్ధమే అనివార్యమైతే ఫలితం ఎలా ఉంటుందనే చర్చ సాగడం సహజం. 1962 నాటి పరిస్థితి ఉండదని మాత్రం రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు భారత్‌ సైనికంగా, ఆర్థికంగా బలంగా ఉన్నది. రక్షణ పాటవాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. బలాబలాలను పరిశీలిస్తే భారత్‌దే పైచేయి అని కూడా రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. 

నాలుగు దేశాల కూటమి: 

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేయాలని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ భావిస్తున్నాయి. ఈ నాలుగు దేశాల కూటమి బలంగా చైనాను ఎదుర్కొనగలదు. దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలు చైనా పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నాయి. అవన్నీ ఈ నాలుగు దేశాల కూటమి సహాయం పొందుతాయి. చైనా కనుక భారత్‌ సరిహద్దు ప్రాంతంలో ఒక చోట దాడి చేస్తే, దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్‌ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారుతుంది. చైనాకు దీటుగా భారత్‌ స్పందిస్తుంది. 

తోడేలు దౌత్యనీతి..

ఈ మధ్యకాలంలో చైనా అనుసరిస్తున్న దౌత్యవిధానాన్ని తోడేలు దౌత్యవిధానం (వుల్ఫ్‌ వారియర్‌ డిప్లమెసీ)గా ప్రచారంలోకి వచ్చింది.  వుల్ఫ్‌ వారియర్‌ అంటే దురాశాపూరితమైన అన్న అర్థం కూడా ఉన్నది. నిజానికి ‘వుల్ఫ్‌ వారియర్‌' ఈ మధ్య కాలంలో చైనా దేశ భక్తిని, వీరోచిత స్వభావాన్ని చాటుతూ వచ్చిన సినిమాల పేరు. ఈ పేరుతో 2015లో విడుదలైన సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయం సాధించింది. దీంతో వుల్ఫ్‌ వారియర్‌ సిరీస్‌ వచ్చాయి. దక్షిణాఫ్రికాలో చిక్కుకుపోయిన చైనీయులను రక్షించేందుకు రాంబో తరహాలో వీరోచితంగా రక్షించినట్లుగా వచ్చిన సినిమా పెద్ద హిట్‌ సాధించింది. ఈ సినిమా ఇచ్చే సందేశం- ‘వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా చైనా నుంచి తప్పించుకోలేరు..’ అనేది. సరిగ్గా ఇదే తరహ దౌత్యవిధానాన్ని ఈ మధ్యకాలంలో చైనా అనుసరిస్తున్నది.


logo