బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Jun 21, 2020 , 23:13:25

కళా సాహిత్యాల కల్పతరువు

కళా సాహిత్యాల కల్పతరువు

మా నాన్నగారు (కపిలవాయి లింగమూర్తి) గురించి శ్రీరంగాచార్య గారు ఒకేమాటలో చెప్పారు. దీనితో ఆయన జీవితం మొత్తం బోధపడుతుంది.‘పాత కాగితం కనిపిస్తే చదువుతారు కొత్త కాగితం కనిపిస్తే వ్రాస్తారు’

మాస్వగ్రామం జినుకుంట. మా ముత్తాత, రామయ్యగారికి సంగీతం సాహిత్యం, జ్యోతిషంలో ప్రవేశం ఉండేది. ఆయన దగ్గర నాలుగు వందల వరకు తాళపత్రాలు ఉండేవట. వారు ఆరు నెలలు మాత్రమే కులవృత్తి చేసి మిగతా ఆరు నెలలు సంగీత సాహిత్యాలతో గడిపేవారు. నాన్నగారికి వారసత్వంగా సాహిత్య అభినివేశం కలిగిందేమో. నాన్నగారి బాల్యమంతా మేనమామ పెదలచ్చయ్యగారి దగ్గర గడిచింది. సాయంత్రం ఇంటి దగ్గర శతకాలు, ఆంధ్రనామ సంగ్రహం మొదలైనవి చెప్పేవారట. ఒకటి రెండు సార్లు చదివితే చాలు పద్యాలు వచ్చేవి. అమరాబాదులో చదువు ముగిసిన తర్వాత మా స్వగ్రామమైన జినుకుంటలో కొంతకాలం వీధి బడికి వెళ్లారు. అప్పుడు కూడా సాయంత్రం ఇంటిలో భాగవతం, జోతిష్యం పాఠాలు చదివించేవారు. మా నాయనమ్మగారి ఆరోగ్యం బాగాలేక మేడిపూరు వెళ్ళినపుడు అక్కడ తాత ఈశ్వరయ్యగారు ఉత్తర రామాయణం చదివించి దానిలో ‘రాఘవా’ అనే మకుటంతో ఉన్న పద్యాలన్నీ ఎత్తి వ్రాయమని చెప్పారట. తర్వాత అదే కావ్య గణపతి, స్వర్ణశకలాలు, కళ్యాణ తారావళి సంకలనాలకు మార్గదర్శనం అయింది. అక్కడ ఈశ్వరయ్యగారు ‘మనుచరిత్ర’ చదివించారు. అది నాన్నగారి సాహిత్య జీవనానికి మార్గం చూపింది. ఏదైనా ఏకాగ్రతతో చదివేవారు. పూర్తిగా లీనమయ్యేవారు. ఇంటిలో ఆయన గ్రంథ పఠనం చేస్తూ ఉంటే పక్కన ఎంత శబ్దమైనా వినిపించేది కాదు. మేం పిలిచినా పలుకకపోయేవారు. తట్టి పిలువాల్సివచ్చేది. సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. ఆయన రచించిన, సంకలనం చేసిన గ్రంథాలు 160కి పైగా ఉంటాయి. 

తండ్రి చిన్నప్పుడే పోవడం వల్ల తల్లి జాగ్రత్తగా పెంచింది. బయట ఎవరితోనూ తిరుగనిచ్చేది కాదు. ఐదవ తరగతి వరకు బడికి వెళ్లి చదువుకున్నారు. బడిలో ఇతర పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఈయన పుస్తకాలు చదువుకుంటూ రాసుకునేవారట. నాడు ఇంకుబుడ్డిలో కలం ముంచి రాసుకునేవారు. ఆయన విస్తృత అధ్యయనం మూలంగా అనేకమంది పరిశోధకులు రచయితలు వచ్చి సమాచారం సేకరించుకుంటారు. కొందరు సమాచారం తెలిసినా చెప్పరు. కానీ నాన్నగారు ఎవరు ఏ వివరాలు అడిగినా చెప్పేవారు. తాను ఎవరిదగ్గర నుంచి చిన్న సమాచారం సేకరించినా ఆ విషయం ప్రస్తావించేవారు. నాన్నగారు తనకు ప్రేరణ ఇచ్చిన సంఘటనల్లో ఒకటి చెబుతుండేవారు. ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్‌లో విశారద పరీక్ష రాయడానికి వెళ్లారు. అక్కడ ఇన్విజిలేటర్‌ ఇరువెంటి కృష్ణమూర్తిగారు. సూపర్‌వైజర్‌గా గడియారం రామకృష్ణ శర్మగారు వచ్చారు. పరీక్ష ముగిసిన అనంతరం శర్మగారి ప్రసంగం ఏర్పాటుచేశారు. అందులో మన పలుకుబడులను మరువకూడదని శర్మగారు చెప్పారట. దాంతో దేశీయత మీద మక్కువ ఏర్పడిందట. 

ఏ గుడికి, ఊరికి పోయినా అక్కడి చరిత్ర అడిగి తెలుసుకునేవారు. పెద్దమనుషులను వివరాలు అడిగి తెలుసుకోవడం ద్వారా చరిత్రను సేకరించవచ్చని అనేవారు. ఇమ్మడిజెట్టి చంద్రయ్య అనే ఆయన ఉండేవారు. ఆయనకు చదువు రాదు. కానీ అశువుగా కవిత్వం చెప్పేవారు. కావ్యాలు రాసేవారు. చంద్రమౌళీశ్వర శతకం మొదలైన శతకాలు, కర్పరాత్రి మహాత్యం మొదలైనవి ఐదారు పుస్తకాలు రాశారు. ఆయనకు గ్రామాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఎక్కువ. ఆయన ద్వారా నాన్నగారు గ్రామాల సమాచారం సేకరించేవారు. 

ఆయనలో సాహితీవేత్త మాత్రమే కాకుండా గొప్ప కళాకారుడూ ఉన్నారు. ఉద్యోగంలో చేరకముందు కులవృత్తిని నమ్ముకొని ఆభరణాలు చేసేవారు. ఆయన ఉత్తర, దక్షిణభారతంలోని గుడులు అనేకం తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడి శిల్పాల ఆభరణాలను పరిశీలించి నోట్స్‌ రాసుకునేవారు. ఇతర రాష్ర్టాలకు వెళ్లినప్పుడు అక్కడి మహిళలు ధరించిన ఆభరణాలను పరిశీలించేవారు. ఆయనకు చిత్రలేఖనంలో కూడా ప్రావీణ్యం ఉన్నది. ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు రామాయణ, మహాభారతం బొమ్మలు వేసి ట్రేస్‌ చేసి అల్బం తయారుచేశారు. ఒకటి, అరా నాటకాలలో పాత్రలు కూడా ధరించారు. కానీ ఎక్కువగా నాటకాలకు అవసరమైన బొమ్మలు తయారుచేసి ఇచ్చేవారు. పుస్తకాలకు ముఖచిత్రాలను రఫ్‌గా గీసి ఇస్తే ఆరిస్టులు వేసేవారు. మా ఊరు జినుకుంటలో గాంధీ విగ్రహాన్ని కూడా నాన్నగారే తయారుచేశారు. ఆభరణాలపైనా, సాహిత్యంపైనా ఉన్న పట్టు వల్ల రెండు పుస్తకాలు రాశారు. వివిధ గ్రంథాలలో ఉన్న బంగారం నగల ప్రస్తావనలను వెలికితీసి వంద పద్యాలతో ‘స్వర్ణ శకలం’ అనే పుస్తకం రాశారు. ఆభరణాల విశేషాల వివరిస్తూ ‘మాంగల్య శాస్త్రం’ అనే పుస్తకం (వచనం) రచించారు. మిగతా వృత్తి కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా ఇటువంటి పుస్తకాలు రాయాలని కోరేవారు. మాంగల్యశాస్త్రంలోని ఆభరణాల డిజైన్‌లను ఆయన గీసి ఇస్తే, ఆర్టిస్టులు మొత్తం బొమ్మలు వేశారు. 

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ డాక్టరేట్‌ రావడం సంతోషం. ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తతి పురస్కారం, తెలంగాణ ప్రభుత్వ విశిష్ట పురస్కారం మొదలైనవెన్నో వచ్చాయి. ఎప్పుడూ నాన్నగారు పురస్కారాలు రావాలని కోరుకోలేదు. నాకంటే ఇంకా చాలామంది గొప్ప పండితులు ఉన్నారు. వారికి దక్కని పురస్కారాలు నాకు వస్తున్నాయి అనేవారు.  

- కపిలవాయి అశోక్‌ బాబు 


logo