శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jun 21, 2020 , 00:11:26

తెలంగాణ నాయిన

తెలంగాణ నాయిన

నాన్నను మూడు నెలలకు ఒకరు తీసుకుపోయి సాకడమనే చర్య అతని శారీరక, మానసిక ఆరోగ్యాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, చివరికి ఆయన ఎంత క్షోభ పడుతూ మరణించాడో తెలిపే హదయ విదారకమైన కథ  బెజ్జారపు వినోద్‌ కుమార్‌ రాసిన ‘నాణానికి మూడో వైపు’(2000).

అమ్మ ప్రపంచానికి 

నిన్ను పరిచయం చేస్తుంది. నాన్న ప్రపంచాన్నే నీకు 

పరిచయం చేస్తాడు. 

జీవితం అమ్మది. 

జీవనం నాన్నది... 

అందుకే ‘అమ్మకు బ్రహ్మకు నడుమ నాన్నే ఒక నిచ్చెన’ అన్నారు ఒక సినీ కవి. 

ఆకాశమంత ప్రేమ గుండెల్లో గూడుకట్టుకున్నా ,కనిపించని చెమట చుక్కలాగే 

మిగిలిపోతాడు నాన్న. 

కానీ తెలుగులో అమ్మ చుట్టూ వచ్చినంత సాహిత్యం నాన్న ఔదార్యంపై రాలేదు. చాలా కథల్లో నాన్న ఒక పాత్రగా ఉంటాడు కానీ నాన్నను 

కేంద్ర బిందువుగా తీసుకొని రాసిన కథలు తక్కువ. 

పితృ దినోత్సవం 

సందర్భంగా.... 

ఆ అరుదైన కథలను 

తడిమి చూసే 

ప్రయత్నమిది.

ఏకాంశంపై కథలు రాయడంలో చేయి తిరిగిన రచయిత కె. వి. నరేందర్‌ తండ్రి పాత్ర చూట్టూ 14 కథలు రాసి 2002లో ‘నాన్న’ అనే కథా సంపుటి తీసుకువచ్చారు. వీటిలో ‘డియర్‌ ఫా’, ‘కొడుకు నేర్పిన పాఠం’, ‘నాన్న డైరీ’, ‘వై3కె’  వంటి కథలు మన కాళ్ళ కింది నేలను, మన గుండె మీది పెంకులను పగులగొడుతాయి. కానీ అందుకు ముందూ, ఆ తర్వాతా తెలంగాణ కథల్లో నాయిన అప్పుడప్పుడూ పలకరిస్తూనే ఉన్నాడు. 

తండ్రులు రోల్‌ మోడల్‌గా ఉండాలనే సూచనతో ఇల్లిందల సరస్వతీ దేవి 1958లోనే ‘తండ్రి పోలిక’ అనే కథను రాశారు. ‘అన్నల్లో’ కలిసిన కొడుకును పోలీసులు చంపేస్తే మౌనంగా రోదించే తండ్రి కథ అల్లం రాజయ్య ‘ఒక తండ్రి’ (1977) అప్పట్లో ఓ సంచలనం. నేనే తప్పటడుగు వేస్తే నా పిల్లలు కూడా తప్పటడుగులు వేస్తారని మద్యపానాన్ని దూరం చేసుకున్న తండ్రి కథ జయధీర్‌ తిరుమలరావు ‘తండ్రి ప్రేమ’ (1977). ప్రతి తరంలో తన తండ్రి కోసం సర్వస్వం ధార పోసే మూడు తరాల కొడుకుల (తండ్రుల) కథ దోరవేటి ‘నాన్నకు జేజే’ (2004) తండ్రి పాత్రగా వెలువడిన వినూత్నమైన కథలు.

ఓ కొడుకు నాన్న కష్టాల్ని నెమరు వేసుకొంటూ కనీసం ఒక పాటనైనా కానుకగా ఇద్దామని అనుకుంటాడు. కానీ అప్పటికే మత్యువు ఆయనను కబళిస్తుంది. కొడుకు ఆరాటమంతా కన్నీటి చుక్కగా మారిన ఈ దశ్యమంతా పసునూరి రవీందర్‌ ‘వెంటాడే పాట’ (2016) కథలో కనిపిస్తుంది. బి. ఎస్‌. రాములు రాసిన ‘వరలక్ష్మి’, ‘మార్పు’, ఇల్లూవాకిలి’ కథల్లో కూడా తండ్రి ప్రేమ తొంగిచూస్తుంది. కాలువ మల్లయ్య ‘అడ్డాలనాడు’, ‘కరువు’, ‘మమతలే మరుగై’ అనే కథల్లో నాన్న పాత్ర చుట్టూ ఎంత సంక్లిష్టత ఉందో చిత్రించారు. చేనేత కుటుంబంలోని కష్టాల కడలినంతా పట్టి చూపిన కథ కొక్కుల భాస్కర్‌ ‘తెగిన పోగు’ (1999), పిల్లలు అడిగారని ఆ రాత్రి వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఆరటి పళ్ల కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్న కథ డా. కాంచనపల్లి ‘నాన్న - ఒక వర్షం రోజు’ (2012),  పిల్లలని విదేశాలకు పంపి ఒంటరిగా మిగిలిపోయిన ఓ తండ్రినీ, పిల్లలకు ఆత్మీయతానురాగాలు నేర్పి ఉన్న ఊళ్ళోనే ఆత్మగౌరవంతో బతకడం నేర్పిన మరో నాన్ననూ పరామర్శిస్తూ సాగిన కథ కటుకోజ్వాల మనోహరాచారి ‘దూర తీరాలు’ (2017) చెప్పుకోదగ్గవి.

రాలిపోయే పండుటాకులాంటి తన వైద్యం కోసం అయ్యే ఖర్చు, పిల్లల మీద భారం కాకూడదని ముందుచూపుతో మౌనంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన నాన్న కథ గుడిపల్లి నిరంజన్‌ రాసిన ‘ఊరు మెచ్చిన మనిషి’(2015). రాకాసి కరువుకు పొట్ట చేత పట్టుకొని మస్కట్‌ పోయినా చివరికి తనకు అప్పులే మిగిలాయని, ఇలాంటి పరిస్థితి తన కొడుక్కు కూడా రావద్దని కొడుకు పంపిన డబ్బును జాగ్రత్త చేసి అతని బంగారు భవితకు బాటలు వేసిన కథ పెద్దింటి అశోక్‌ ‘నాయిన్న’(2004). కంటికి రెప్పలా కాపాడిన తండ్రిని బాధ్యతా రహితంగా వద్ధాశ్రమంలో చేర్పించి, చేతులు దులుపుకొని అమెరికా వెళ్ళిన దగుల్బాజీ కొడుకు కథ చెన్నూరి సుదర్శన్‌ ‘కొసూపిరి’ (2016). నాన్న చుట్టూ, అతడిని వెంటాడిన జ్ఞాపకాల చుట్టూ కలిసి నడిచిన కొడుకు కథ వి. మల్లికార్జున్‌ ‘మా నాన్న మారయ్య’ (2020). జీవితం ప్రశ్నార్థకంగా మిగిలి  కొడుకు బాధ్యతా రహితంగా మారిపోతున్నప్పుడు ఒక తండ్రి పడుతున్న ఆవేదనకు అక్షర రూపం పూడూరి రాజిరెడ్డి ‘కొండ’ (2019), కుల వత్తిని కోల్పోయిన నాన్న చుట్టూ, కుల వృత్తి చుట్టూ అల్లుకున్న కూతుళ్ల కథ జ్వలిత ‘రూపాంతరం’.. ఇలా అనేక కథలు నాన్న మనసును కాగితం మీద పరిచే ప్రయత్నం చేశాయి. మత్యుముఖంలో ఉన్న నాన్న వింతగా ప్రవర్తిసుంటే  ఏం జరుగుతుందో అర్థంకాక కొడుకులు పడే ఆందోళనను రావులపాటి సీతారామారావు ‘పయనంలో ప్రాణి’ (2013) కథలో చెప్పారు. ఇవే కాకుండా 2017లో తెలుగు కథ రచయితల వేదిక సీనియర్‌ సిటిజన్స్‌ రాసిన 31 కథలను సేకరించి ‘మా నాన్నకు ప్రేమతో..’ అనే కథా సంకలనం వేశారు. 

ఇలా తెలంగాణ కథా సాహిత్యం నాన్నలోని అనేక రూపాల్ని చాలా బలంగా చిత్రించింది. అయితే ఆయన మార్గంలో మరిన్ని అడుగులు ముందుకు పడాల్సి ఉన్నది. నాన్నే మన హీరో కాబట్టి బంగారం లాటి నాన్న మనసును అర్థం చేసుకుందాం. నాన్న జీవితం చుట్టు మరిన్ని కథలు రావాలని ఆకాంక్షిద్దాం. నాన్నకు జేజే. 

డా. వెల్దండి శ్రీధర్‌ 

 9866977741logo