గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jun 20, 2020 , 23:57:24

శ్రీకైవల్య.. పద్యంబు

శ్రీకైవల్య.. పద్యంబు

‘నిర్విఘ్న పరిసమాప్తి కామో మంగళమాచరేత్‌' అని కావ్య సంప్రదాయం. మంగళాచరణం అంటే ప్రారంభించిన గ్రంథం నిర్విఘ్నంగా పూర్తికావాలని పరమాత్మను ప్రార్థించడం. ఈ మంగళాచరణానికి మూడు ముఖాలు!  ప్రార్థనలో పాఠకలోకానికి ఆశీర్వచనం కానీ, పరమాత్మకు ప్రణామాలు కానీ, గ్రంథం ప్రతిపాదించే కథావస్తువు గురించి సూచన కానీ ఉండాలి అని దాని లక్షణం. తెలుగు పద్యాలలో ఇది మాణిక్యం లాంటిది. భాగవత భారతికే కాక, ఆంధ్ర కవితా కళ్యాణికి కూడా నుదుట చెరగని కుంకుమ బొట్టు వంటిది.

శా. శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్‌ లోకర

క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్‌ దానవో

ద్రేక స్తంభకు, గేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్‌.

భాగవతానికి మోక్షమే పురుషార్థమైతే, ఆ ముక్తి ప్రదాత అయిన కృష్ణుడే కథానాయకుడు, కృష్ణ తత్వమే ఈ పురాణ పారిజాతానికి మూలం. కనుకనే, కృష్ణ నామ చింతన, గుణకీర్తనతో భాగవతానికి శ్రీకారం చుట్టాడు పోతన. కావ్యారంభంలో ‘శ్రీ’ శబ్దప్రయోగం, ‘మ’ గుణం- రెండూ మంగళకరాలు.

‘లోక రక్షణే ప్రధాన లక్షణంగా గల సకల లోకపాలకుడు, సాధుజన సంరక్షకుడు, దుష్టశిక్షకుడు, నిఖిల బ్రహ్మాండ భాండ నిర్మాత అయిన నంద-యశోదా నందనుడైన శ్రీ కృష్ణుని కైవల్య పద ప్రాప్తికై నిరంతరం ధ్యానిస్తాను’ అని ఈ పద్యానికి సామాన్య అర్థం. సంస్కృత భాగవతంలోని ప్రార్థనా శ్లోకంలో కూడా వ్యాసుడు- ‘సత్యంపర ధీమహి’ అని పారమార్థిక సత్య వస్తువు (పరబ్రహ్మనే) ధ్యానించాడు. ఆ సత్యమే ఇక్కడ శ్రీ కృష్ణుడు. మూలంలోని నవవిధ భక్తిలో మూడవదైన ‘స్మరణ’మే తెలుగు భాగవతంలోని తొమ్మిదవదైన ‘చింతనం’. శ్రవణాది మిగిలిన 8 భక్తుల చరమఫలం ఈ చింతనమే! గీతలో భగవంతుడు ఆదేశించిన ‘సర్వేషు కాలేషు మా మనుస్మర’ లోని అనుస్మరణమే- అఖండ స్మరణమే చింతనం. ధ్యానరూప చింతనమే సాధనం. నమస్కరింపబడేవాడు ఎవడు? ‘మహానందాంగనా డింభకుడు’. ఇది విరోధాభాసతో కూడిన పదగుంఫనం, ఆలోచనామృతం. సంగీతం ఆపాత మధురమైతే సాహిత్యం ఆలోచనామృతం కదా. సంగీతం చెవినబడి, ఇసుకలో పడిన నీటి బిందువు వలె వెంటనే చెవిలోకి ఇంకిపోతుంది. కానీ ‘సూక్తిః కవేరేన సదా సుగంధా’- కవి సూక్తులు అంతరంగంలోకి ప్రవేశించి, ఆలోచించే కొద్దీ ఆనంద తరంగాలను రేకొడుతూ అమృతమయాలై ఉంటాయి.

భగవదవతార ప్రయోజనమేమి? సాధు రక్షణ, అసాధు శిక్షణ, ధర్మసంరక్షణేగా. భాగవత కథలు, ఘట్టాలన్నిటికీ ఇదే సామాన్య ప్రయోజనం. ద్వితీయ స్కంధంలో సంక్షేప లీలావతార కథనంలో మహాకవి పోతన, కృష్ణుడు తన అవతార కాలంలో చంపిన దానవ వీరులందరినీ చంపకమాలా వృత్తంలో గుదిగుచ్చి ఒకే గుక్కలో వర్ణించిన తీరు కవి కౌశలానికి, అద్భుత ప్రతిభా పాటవాలకి నిదర్శనం-

చ. నరక ముర ప్రలంబ యవన ద్విప ముష్టిక మల్ల కంస శం

బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్త్ర వా

నర ఖర సాల్వ వత్స బక నాగ విడూరధ రుక్మి కేశి ద

ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటుల ద్రుంచె వ్రేల్మిడిన్‌.

మహాడింభకుడంటే పెద్ద కుర్రవాడని అర్థం. ఎంత పెద్ద? మనమూహించలిగిన దానికంటే పెద్ద. ‘అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌' (ఆత్మ అణువు కంటే సూక్ష్మమైంది. మహత్తరమైన దానికంటే మహత్తరమైంది) అనే కఠోపనిషత్‌ ధ్వనికి ప్రతిధ్వని. ‘కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా కంజాత భవాండ కుంభకు’- లీలా విలాసార్థంగా ప్రసరింపజేసిన కటాక్షమాత్రం (క్రీగంటి చూపుతో) చేతనే ఏర్పడిన అనేక బ్రహ్మాండాలు గలవాడు. అనగా స్వామి విలాసంగా తిప్పే కండ్లలో నుంచే అనేక కంజాత భవాంతాలు (బ్రహ్మాండాలు) ఉద్భవిస్తాయి. అది ‘దృగ్జాల సంభూత’మట. దృక్‌ అంటే చూపు , జాలం అంటే మాయ. తన చైతన్యరూపమైన దృక్కును (నిత్య జ్ఞానాన్ని) నిరంతరం ఆశ్రయించి ఉన్న మాయాశక్తితో ఈ సృష్టి ఆవిర్భవించింది. ‘ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః’  కొంటె కృష్ణుడు కళ్లు తెరిచి చూస్తే అనంత కోటి బ్రహ్మాండ సృష్టి, కళ్లు మూస్తే సర్వ బ్రహ్మాండ లయం. ఇదే అద్వైతుల దృష్టి సృష్టివాదం. అజోపి సన్నవ్యవయాత్మా’- పరమాత్మ  పుట్టుక లేనివాడు.

అజాతుడైనా తాను నంద-యశోదలకు జన్మించినట్లు భాసిస్తున్నాడు. అదే ఆ మహేంద్రజాలికుని మాయాకేళి! ‘బాలా లీలా వినోదిన్‌'- బాలకృష్ణుని లీలావినోదం! ‘శ్రీ కృష్ణః శ్యామలాదేవ’ అని కదా శాస్త్ర పరమార్థం. సృష్టి, స్థితి, లయ ఆయనకు ఒక కేళి. ఇందులో నిత్యలోలుడు గాన ఈ సృష్టి- సంహార ప్రక్రియ ఇలా నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది. నందయశోదల ఇంటి ముంగిట బ్రహ్మానందమే శిశువుగా పారాడుతున్నది. ఆ శిశువునే నేను మంగళకరమైన కైవల్యపదం చేరుటకు ధ్యానిస్తున్నా ‘కేవలస్య భావః కైవల్యం’- శరీర ఇంద్రియ రహితమై ఆత్మ అద్వితీయమై ఉండుట.

జీవభావం తొలగగా ఆత్మ స్వభావంలో ప్రతిష్ఠితమవడం. అంటే ‘స్వస్వరూపానిర్భావః’ తన నిజస్థితిని పొందుట, భగవంతుడు జ్ఞానానంత స్వరూపుడు. జీవుడు కూడా భగంతుని అంశం కనుక జ్ఞానానంత స్వరూపుడే. కానీ, జీవునికి కర్మఫలంగా దేవమనుష్యాది ఉపాధి (శరీర) ధారణ ఉంది. ఈ నానాత్వం వదిలి జీవుడు పూర్వపు స్థితిని పొందడమే ‘ముక్తి’. ఇలా ఈ పద్యంలో మహాకవి పోతన ఆరంభకున్‌, సంరంభకున్‌, స్తంభకున్‌, కుంభకున్‌, డింభకున్‌ అంటూ తనకు అత్యంత ప్రియమైన అంత్యప్రాసల ద్వారా మనోవాక్కులకు అందరాని అచింత్య పరబ్రహ్మ తత్త్వాన్ని శబ్ద (నాద) బ్రహ్మోపాసన ద్వారా తన హృదిలో ఆవిష్కరించుకొని తాను అనుభవించి, మనకూ అందించి, అలరించిన తీరు అద్భుతం!

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006 logo