గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jun 20, 2020 , 00:24:13

జీవితమే ఒక ఉద్యమం

జీవితమే ఒక ఉద్యమం

1957లో ఒక సామాన్య పాఠశాల ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టిన జయశంకర్‌ 2011 జూన్‌ 21న కన్నుమూసే సమయానికి కొద్దిమంది ఆత్మీయులను వందలమంది స్నేహితులను వేలమంది పరిచయస్థులను లక్షల మంది అభిమానులను సంపాదించుకుని నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గౌరవాన్ని, అభిమానాన్ని పొందారు. ఒక వ్యక్తి జీవితం సఫలమవడమంటే ఇదే..!

జయశంకర్‌ గారు ఒక ఉపాధ్యాయుడిగా, పాలకుడిగా ఎలా ఉన్నారో, ఆ ప్రయాణంతో తగిలిన ఎదురుదెబ్బలను ఎలా విజయాలుగా మలచుకున్నారో అన్న విషయం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 1957లో హైస్కూల్‌ టీచర్‌గా వారి జీవితం మొదలైంది. ఉపాధ్యాయుల సంఘాలలో చురుగ్గా పాల్గొనడం, సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వాన్ని ఎదుర్కోవలసి రావటంతో ఆదిలాబాద్‌ దగ్గర్నించీ, ఖమ్మం దాకా అన్ని జిల్లాల్లో పనిచేశారు. తరచూ బదిలీలతో ప్రభుత్వం విసిగించింది. దాదాపు తెలంగాణ ప్రాంతంలో స్కూళ్ళన్నీ చూశారు. ఎదుగుదల కోసం పై చదువులు చదివారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ నుంచి, బెనారస్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాలు పొంది కళాశాల ఉపాధ్యాయునిగా ఎదిగారు. అక్కడ కూడా జీసీటీఏ (గవర్నమెంట్‌ కాలేజీ టీచర్స్‌ అసోయేషన్‌)లో ముఖ్య పాత్ర పోషించటంతో మళ్ళీ బదిలీలు తప్పలేదు. ఈ బదిలీలు, యూనియన్‌ పనులు ఆయనలోని ఆదర్శ ఉపాధ్యాయుడి పనికి అడ్డు రాలేదు. ఇంటిర్మీడియెట్‌ దాకా ఉర్దూ మీడియంలో చదివి, ఇంగ్లీషుతో కొద్ది పరిచయం ఉన్న జయశంకర్‌ డిగ్రీ లెవెల్‌లో విద్యార్థులకు నాలుగు మాధ్యమాలలో పాఠాలు చెప్పారు. హిందీ, తెలుగు, ఇంగ్లీషుల్లో ఎంత ప్రావీణ్యం సంపాదించారంటే డిగ్రీ లెవెల్లో ఎకనామిక్స్‌ వంటి కష్టతరమైన సబ్జెక్టులో ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు బహుశా ఆయన ఒక్కరే. విద్యార్థుల పట్ల బాధ్యత, వృత్తి పట్ల నిబద్ధత ఆయనలో ఏ స్థాయిలో ఉండేవో తెలుసుకోవటానికి అది ఒక కొలమానం. ఆయనకు ఉత్సాహం లేని సబ్జెక్టే ఉండేది కాదు. ఎడ్యుకేషన్‌, సోషల్‌ సైన్సెస్‌, లిటరేచర్‌, లాంగ్వేజెస్‌, లింగ్విస్టిక్స్‌.. ఏ విషయమైనా ఆసక్తే! ఎవరితో ఏ విషయం గురించి మాట్లాడినా తెలిసిన విషయాలు ఎంత స్పష్టంగా, ఓపికగా చెప్పేవారో, తనకు తెలియని అంశాలు నిజాయితీగా తెలియదని చెప్పి, ఎదుటివారితో విశదీకరించుకునేవారు. అది వారి మేధాశక్తి, ఉత్సుకత, నిజాయితీలకు నిదర్శనం.

ఉద్యోగ జీవనం సమర్థతతో చేయటంతోటే కాలేజీ లెక్చరర్‌గా ఉన్నప్పుడే సీకేఎం  కాలేజీ ప్రిన్సిపల్‌ పోస్టుకు సెలెక్టయ్యారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆ కాలేజీని జిల్లాకు ప్రథమంగా నిలిపారు. ఆ సమయంలో పీహెచ్‌డీ పూర్తిచేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో రీడర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా, మళ్లీ రాజకీయ శక్తులు అడ్డుపడ్డాయి. అయితే ఆ నిరాకరణ వారిని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రారుగా చేసింది. ఆ మూడేండ్లూ ఆ సంస్థ ఎదిగిన తీరు చూసి బెస్ట్‌ రిజిస్ట్రార్‌గా ఏషియన్‌ ఎడ్యుకేషన్‌ వారు అవార్డు ఇచ్చారు. తర్వాత 1982లో హైదరాబాద్‌ సీఫెల్‌లో రిజిస్ట్రారుగా దాదాపు పదేండ్లు పనిచేశారు. 1991లో కాకతీయ యూనివర్సిటీకి వైస్‌ చాన్స్‌లర్‌గా వెళ్లి అక్కడే రిటైరయ్యారు. రెండు విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏ ఉద్యోగంలో ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ పనిచేసేవారి సమస్యలు విచారణ చేయడం, తెలంగాణ ఉద్యమానికి కావలసిన పనిచేయటం నిరంతరంగా సాగింది. ఏ అధికారస్థాయిలో ఉన్నా, తన పరిశ్రమ, నిజాయితీ, నిబద్ధతల వలననే మంచి పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, సంస్థల నిబంధన వలయంలో ఉంటూనే ఆ సంస్థలో పనిచేసేవారికి చేయగలిగినంత సహాయం చేయటం ఆయన మానవతా తత్వానికి అద్దం పడుతుంది.

జయశంకర్‌ వ్యక్తిత్వం విశిష్టమైనది.     మొదటగా చెప్పాల్సినది వారు ఎదుటివారికిచ్చే గౌరవం. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఒకేరకమైన గౌరవం ఇచ్చేవారు.  నిజాయితీ, ఆ ఆత్మీయ భావనే కాకుండా వారి విశాలమైన ఆలోచనలు, విజ్ఞానం అందర్ని ఆకర్షించేవే!

ఇంటిర్మీడియెట్‌ దాకా ఉర్దూ మీడియంలో చదివి, ఇంగ్లీషుతో కొద్ది పరిచయం ఉన్న జయశంకర్‌ డిగ్రీ లెవెల్‌లో విద్యార్థులకు నాలుగు మాధ్యమాలలో పాఠాలు చెప్పారు. డిగ్రీ లెవెల్లో ఎకనామిక్స్‌ వంటి కష్టతరమైన సబ్జెక్టులో ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు బహుశా ఆయన ఒక్కరే. విద్యార్థుల పట్ల బాధ్యత, వృత్తి పట్ల నిబద్ధతకు ఆయన దర్శనం.  

ఇక వారి వ్యక్తిత్వం గురించి. మనిషి ఆశ, దురాశ, ధనం పట్ల అతని వ్యామోహం, కోరికలు అవి సాధించలేని స్థితిలో ఉన్నప్పుడు తెలియవు. కానీ పదవి, అధికారం సంపాదించేస్థాయి, శక్తి వచ్చినా, వాటిని తృణీకరించి లక్ష్య సాధన కోసమే బతుకటం సామాన్యమైన విషయం కాదు. పైస్థాయి ఉద్యోగాలు చేసి అన్ని సుఖకరమైన సాధనాలతో జీవించి, రిటైర్‌ అవగానే సామాన్య జీవితం గడపటానికి ైస్థెర్యం కావాలి. వీసీగా కాంటెస్సా కారులో తిరిగిన జయశంకర్‌, వరంగల్‌ నుంచి ఉప్పల్‌దాకా బస్సులో వచ్చి, ఆటోలో తనుండే ఇల్లు చేరుకునేవారు.

జయశంకర్‌ గారి జీవితంలో ఆయనను నిరాశపరిచినవారు ఇద్దరే మనుషులని ఆత్మీయులకు చెప్పేవారు. ‘సర్దార్‌ పటేల్‌ కాలేజీ’లో లెక్చరర్‌గా ఉన్న ఒకరికి డిప్యూటీ రిజిస్ట్రార్‌గా సీఫెల్‌లో పదవినిస్తే ఆయన జయశంకర్‌ గారి మీద అసూయతో వారి పింఛన్‌ను పదేండ్లు ఆపారు. అందుకు పింఛన్‌ రావటం లేదనే బాధకంటే, నమ్మినవాళ్ళు మోసం చేశారని బాధపడ్డారాయన. వారిని బాధపెట్టిన రెండవ మనిషి ప్రొఫెసర్‌ కోదండరాం. తానే కోదండరాంను జేఏసీ చైర్మన్‌గా ఉంచాలని చెప్పానని, కానీ ఆయనకు హిడెన్‌ ఎజెండా ఉందని, పైకి కనిపించే మనిషి కాదని ఆత్మీయుల దగ్గర చాలాసార్లు బాధపడ్డారు.

జయశంకర్‌గారి జీవితంలో చూడనిదేదైనా ఉందీ అంటే అది తెలంగాణ రాష్ట్రమే. 2011 జూన్‌ 21 పొద్దున్న వారు మరణించారు. మానవ సంబంధాలలో హుందాతనానికి, మనుషులతో సామాజిక బాధ్యతకు, ప్రతివారి ప్రగతి కోరుకునే అత్యున్నత వ్యక్తిత్వానికి డాక్టర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సాటిలేని ఉదాహరణ! (రేపు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి) logo