ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 19, 2020 , 00:04:44

మోసపూరితం చైనా దౌత్యం

మోసపూరితం చైనా దౌత్యం

లఢక్‌లో చైనా కనబర్చిన సైనిక దుందుడుకుతనం ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా తదితర దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాల దృష్టి హాంకాంగ్‌ నిరసనల మీద, కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో చైనా వైఫల్యం పైనా ఉండేది. చైనా ప్రభుత్వం భారత్‌తో సరిహద్దు తగాదాకు దిగి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చగలిగింది.

అత్యంత శక్తిమంతుడైన చైనా పరిపాలకుడు జిన్‌పింగ్‌కు కరోనా వైరస్‌ను కట్టడి చేయటం పెద్ద సవాల్‌గా మారింది. కొన్ని నగరాల్లో ఈ వైరస్‌ మళ్లీ పడగ ఎత్తింది. కొవిడ్‌-19కు కేంద్ర బింధువైన వూహాన్‌లో కూడా వైరస్‌ మళ్లీ తన ఉనికిని చాటుకుంటున్నది. చైనాలో సాధారణంగా కమ్యూనిస్టు పార్టీ చెప్పిందే వేదంగా భావిస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం కరోనాను కట్టడి చేయటంలో విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ప్రభుత్వ వైఫల్యం మూలంగా లక్షలాదిమంది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రజలను అప్రమత్తం చేయదల్చుకున్న వారి నోళ్లను నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో ప్రజలు అసహనంతో ఉన్నారు. ఫాంగ్‌ ఫాంగ్‌ ఇటీవల ప్రచురించిన వూహాన్‌ డైరీ ఈ పరిస్థితికి అద్దం పడుతున్నది. చైనా ఆర్థికవ్యవస్థకు కార్మికులే వెన్నెముక. దాదాపు 20 కోట్ల మంది వలస కార్మికులు చైనా వివిధ పాంతాల్లో పనిచేస్తున్నారు. రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించటంతో చైనాలో వలస కార్మికుల సమస్య భారత్‌కన్నా తీవ్రంగా మారింది. వలస కార్మికుల పరిస్థితిపై భిన్నరకాల అంచనాలున్నాయి. కరోనా వైరస్‌ మూలంగా కనీసం 13 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని ఒక అధ్యయన సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో గణాంకాల విషయమై పారదర్శకత ఉండదు. చైనా ప్రభుత్వం నిరుద్యోగ భృతి కోసం కేటాయింపును 28 బిలియన్‌ డాలర్ల నుంచి 82 బిలియన్లకు పెంచింది. దీన్నిబట్టి భారీ ఎత్తున కార్మికుల ఉపాధి కోల్పోయారని తెలిసిపోతున్నది.

గ్రామీణ వలస కార్మికులు చైనా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు సాగిస్తున్నారు. హాంకాంగ్‌కు చెందిన అధ్యయన సంస్థ వెలువరించిన చైనా లేబర్‌ బులెటిన్‌ ద్వారా ఈ నిరసనల వివరాలు కొంతమేర తెలుస్తున్నాయి. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కాలంలో చైనా వ్యాప్తంగా 50 నిరసనల ప్రదర్శనలు జరిగినట్లుగా ఈ బులెటిన్‌ వెల్లడించింది. కొవిడ్‌-19 రోగుల కోసం దవాఖాన భవనాలను నిర్మించిన కార్మికులు కూడా వేతనాలు అందకపోవటం వల్ల ప్రదర్శనలు జరిపారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనటంలో చైనా తలమునకలై ఉన్నది. మరోవైపు హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీసేవిధంగా చైనా పార్లమెంట్‌ కొత్త చట్టం చేసింది. దీంతో అక్కడ నిరసనలు పెల్లుబుకాయి. 1997 సంవత్సరంలో బ్రిటన్‌ హాంకాంగ్‌ను చైనాకు అప్పగించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అనే సూత్రాన్ని అమలుపరుస్తామని ఈ సందర్భంగా చైనా హామీ ఇచ్చింది. ఇంతకాలం హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని దెబ్బతీయటానికి చైనా అనేక ప్రయత్నాలు చేసింది. హాంకాంగ్‌ ప్రజలు ఈ కుట్రలను ప్రతిఘటిస్తున్నారు. అయినా చైనా హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని  హరించే చట్టం చేసింది. ‘ లిబరేట్‌ హాంకాంగ్‌', ‘రివెల్యూషన్‌ ఆఫ్‌ అవర్‌ టైమ్స్‌..’ మొదలైన నినాదాలతో హాంకాంగ్‌ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం పలు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. చైనాకు, అమెరికాకు మధ్య వాణిజ్యయుద్ధం సాగుతున్నది. దీనివల్ల చైనాను పెద్ద ఆర్థిక శకిగా నిలుపాలన్న జీ జిన్‌పింగ్‌ ప్రయత్నాలు పటాపంచలయ్యాయి. చైనా ఎత్తుగడలేమీ పారటం లేదు. అమెరికాతో ఏదో ఒకస్థాయిలో మొదటి ఒప్పందం చేసుకోగలిగింది. కానీ ఈలోగా కరోనా వైరస్‌ ప్రబలింది.

వివిధ దేశాల్లో ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నదో కరోనా వైరస్‌ ఎత్తిచూపింది. కరోనా సవాల్‌ను ఎదుర్కోలేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా చేతులెత్తేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మళ్లీ గెలుస్తాడా అన్నది అనుమానమే. దీంతో తనను దెబ్బకొట్టడానికి ఇదంతా చైనా పన్నుతున్న కుట్ర అని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో చైనాపై ఒత్తిడి పెంచుతున్నాడు.

సైన్యం యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ చైనా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పార్లమెంటులో పిలుపునివ్వటం గమనార్హం. సాధారణంగా దేశ నాయకులెవరూ సైన్యాన్ని సన్నద్ధంగా ఉండాలంటూ బహిరంగంగా పిలుపునివ్వరు. దీనివల్ల శత్రు దేశాలు అప్రమత్తమవుతాయి. ఈ విషయం చైనా ప్రభుత్వానికి తెలియక కాదు. కావాలనే బహిరంగంగా పిలుపునిచ్చారు. అప్పటికే భారత సరిహద్దుల్లో చైనా తన బలగాలను మోహరించింది. చైనా అధ్యక్షుడు బహిరంగంగా యుద్ధానికి పిలుపునివ్వటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది.

అంతర్జాతీయ సమాజంలో చైనా ఏకాకి కావటానికి తైవాన్‌ సమస్య కూడా కారణమే. కరోనా వైరస్‌ ప్రబలడంపై ప్రపంచ ఆరోగ్య మండలిలో కూడా చైనా ఒంటరిగా మారింది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు చెందిన కొన్ని దీవులను చైనా సైన్యం స్వాధీనం చేసుకోబోతున్నదనే వార్తలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్‌ పీడిస్తున్న నేపథ్యంలో కూడా తైవాన్‌ను గుర్తించటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతున్నది. చైనా ఒత్తిడి మేరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైఖరిని అవలంబించిందనే అభిప్రాయం ఉన్నది. మొత్తంగా చూస్తే చైనా ఆంతరింగికంగా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిలు ఎదుర్కొంటున్నదనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే చైనా భారత్‌ సరిహద్దు తగాదాలు చోటుచేసుకోవటం గమనార్హం. భారత్‌ సైనికులతో చైనా జవాన్లు ముష్టి యుద్ధానికి దిగారు. చైనా భారీ ఎత్తున బలగాలను మోహరించటం గమనిస్తే.. ఇదంతా పథకం ప్రకారమే జరిగినట్లు అర్థమవుతున్నది. తక్కువ వేతనాలతో ఉత్పత్తి సాగించటం, వైషమ్య పూరిత సైనిక విధానాలు చైనా లక్షణాలు. సైన్యం యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ చైనా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పార్లమెంటులో పిలుపునివ్వటం గమనార్హం. సాధారణంగా దేశ నాయకులెవరూ సైన్యాన్ని సన్నద్ధంగా ఉండాలంటూ బహిరంగంగా పిలుపునివ్వరు. దీనివల్ల శత్రు దేశాలు అప్రమత్తమవుతాయి. ఈ విషయం చైనా ప్రభుత్వానికి తెలియక కాదు. కావాలనే బహిరంగంగా పిలుపునిచ్చారు. అప్పటికే భారత సరిహద్దుల్లో చైనా తన బలగాలను మోహరించింది. చైనా అధ్యక్షుడు బహిరంగంగా యుద్ధానికి పిలుపునివ్వటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. 

భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత ప్రపంచదేశాలను కలవరపరుస్తున్నది. భారత్‌ ప్రజాస్వామిక దేశం. ఇక్కడ స్వేచ్ఛా వాణిజ్యం అమలులో ఉన్నది. ప్రపంచంలోనే పెద్ద మార్కెట్లలో ఇదొకటి. చైనాతో భారత్‌ ఘర్షణలో కూరుకుపోవటం పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. సహజంగానే అమెరికా, ఐరాస ఆందోళన వెలిబుచ్చాయి. పనిలో పనిగా ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా ముందుకువచ్చారు. సరిహద్దులో ప్రశాంత పరిస్థితులు నెలకొల్పాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.

ఆంతరంగిక సమస్యల నుంచి ప్రపంచ ప్రజల దృష్టిని మళ్లించటానికే చైనా భారత్‌తో సరిహద్దు తగాదాలకు దిగిందనేది వాస్తవం. హాంకాంగ్‌ నిరసనలను కప్పిపుచ్చాలని కూడా చైనా ప్రయత్నిస్తున్నది. ఈ సందర్భంగా ప్రముఖ పార్లమెంటేరియన్‌ మానిష్‌ తివారి ట్వీట్‌ గమనార్హమైనది. ‘మోసపూరిత దౌత్యంలో చైనా అందెవేసిన చేయి. 1962లో కూడా ‘హిందీ-చీనీ భాయి భాయి అంటూ మభ్యపెట్టి యుద్ధానికి దిగింది’. 

(‘ఇండియా టు డే’ సౌజన్యంతో..)
logo