గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jun 18, 2020 , 00:21:15

చైనా కుత్సితం

చైనా కుత్సితం

ఒకవైపు చర్చలు సాగిస్తున్నట్టు నటిస్తూనే, సరిహద్దులో దాడులకు దిగడం చైనా కుత్సితత్వాన్ని వెల్లడిస్తున్నది. కొద్దికాలంగా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతను భారత్‌ గమనిస్తూనే ఉన్నది. శాంతికాముక దేశంగా చర్చల ద్వారానే పరిష్కారానికి సిద్ధపడ్డది. సరిహద్దు గొడవలు అంత తొందరగా తేలేవి కాదు కనుక, సుదీర్ఘ సంభాషణకు దిగింది. కానీ అంతలోనే చైనా దాడులకు దిగి ఉద్రిక్తతలను మరింత రగిలింపజేసింది. కొంతకాలంగా భారత్‌ను చైనా పలువిధాలుగా రెచ్చగొడుతున్నది. భారత్‌కు వ్యతికరేకంగా నేపాల్‌ సరిహద్దు తగాదాకు దిగడం, కాల్పులు జరుపడం వెనుక చైనా ప్రేరణ ఉన్నదనేది స్పష్టం. శ్రీలంక, మాల్దీవు లలో కూడా భారత దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధకాలపు ఎత్తుగడలకు దిగింది. సోమవారం రాత్రి ఘటనల నేపథ్యంలో భారత్‌ త్రివిధ దళాలను అప్రమత్తం చేయక తప్పలేదు. సైనిక బలగాల మోహరింపును చైనా సరిహద్దుకే పరిమితం చేయకుండా, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలోనూ దృష్టిసారించి నౌకాదళాలను మలాకా జలసంధికి తరలిస్తున్నది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనడానికైనా భారత్‌ సర్వసన్నద్ధంగా ఉండక తప్పదు.

చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. ఆసియాలోని పెద్ద దేశాలలో చైనా ఒకటి. ప్రపంచంలోని పెద్ద ఆర్థికవ్యవస్థల్లో అమెరికా తర్వాత రెండవ స్థానంలో ఉన్నది. పారిశ్రామిక దేశాలు బడుగుదేశాలను ఎదుగనివ్వవనేది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలనే కాదు, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలలోని మూడవ ప్రపంచదేశాలకు అండగా నిలబడవలసిన పెద్దరికాన్ని చైనా సంతరించుకోవలసింది. ప్రపంచవాణిజ్య సంస్థలో పారిశ్రామిక రాజ్యాలకు, ఇతర దేశాలకు వ్యాపార వివాదాలు తలెత్తినప్పుడు భారత్‌, చైనా సహకరించుకోక తప్పని పరిస్థితులున్నాయి. కానీ ఈ సౌహార్దతను విస్మరించి సరిహద్దు కయ్యాలకు పాల్పడటం చైనాకు కూడా మంచిది కాదు. భారత్‌తో  ఘర్షణ మూలంగా చైనా మరింత ఒంటరిగా మారుతుంది. భారత్‌ వంటి పెద్ద మార్కెట్‌ను కోల్పోవడం చైనా ఆర్థికవ్యవస్థకూ నష్టమే. ఇప్పటికే అమెరికా మొదలుకొని పలు ఐరోపా రాజ్యాలు చైనా కంపెనీలను దూరం పెడుతున్నాయి. 

చైనాలో పరిపాలకులు అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్నది. ఇప్పటికే నగరాలలో పలు ఆందోళనలు చెలరేగాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలోనూ ప్రభుత్వం అప్రతిష్ఠపాలైంది. ఈ పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరల్చడానికి చైనా లేని గొడవలను సృష్టిస్తున్నది. కానీ ఘర్షణల వల్ల చైనా ఆర్థికవ్యవస్థ, ప్రతిష్ఠ దెబ్బతింటాయే తప్ప ఆంతరంగిక సమస్యలు పరిష్కారం కావు. చైనా ప్రజాస్వామిక, పారదర్శక, సమ్మిళిత విధానాలను అమలుచేసినప్పుడు మాత్రమే ప్రజలను శాంతింపజేయగలుగుతుంది. ఘర్షణ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఆందోళనలు మరింత పెచ్చరిల్లుతాయి. చైనా ఘర్షణలకు దిగుతున్న నేపథ్యంలో భారత్‌ కఠినంగా వ్యవహరించడంలో తప్పు లేదు. చైనా అతిక్రమణలను తిప్పికొట్టడమే కాకుండా, అంతర్జాతీయ మద్దతును కూడగడుతూ చైనాపై ఒత్తిడి తీసుకురావాలి. ఒకవైపు సైనిక సన్నాహాలు సాగిస్తూనే దౌత్య మార్గంలో చైనాను దారికి తేవాలి. ఇరుగుపొరుగు దేశాలలో చైనా ప్రాబల్యం బలపడకుండా చూడటం కూడా ప్రధానమే. 


logo