ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 18, 2020 , 00:21:14

చైనా దూకుడును నిలువరించాలి

చైనా దూకుడును నిలువరించాలి

భారత- అమెరికా న్యూక్లియర్‌ ఒప్పందం సమయంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా చాలా ప్రయత్నాలు చేసింది. భారత భూభాగాన్ని ఆక్రమించి, పాకిస్థాన్‌కు అణు పరిజ్ఞానాన్ని, క్షిపణి పరిజ్ఞానాన్ని అందించి భారత భద్రతకు భంగం కలిగిస్తున్నది. మన్మోహన్‌సింగ్‌, జార్జిబుష్‌ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో, భారత పార్లమెంటులో ఒప్పందం ఆమోదం పొందకుండా చైనా కుటిల ప్రయత్నాలు చేసింది.

భారతదేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇప్పటిదాకా అందుతున్న సమాచారాన్ని బట్టి చైనా సామ్రాజ్యవాద కాంక్షకు సరిహద్దులో సుమారు 20 మంది భారత సైనికులు బలైపోయారు. రెండో ప్రపంచయుద్ధంలో రష్యా ఎర్రసైన్యం జయించిన మంచూరియా, జింజియాంగ్‌ ప్రాంతాల్లో లక్షల చదరపు మైళ్ల భూభాగాన్ని అప్పగించి, ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కల్పిస్తే చివరికి రష్యాకు మావో వెన్నుపోటు పొడిచాడు. విప్లవం తర్వాత మావో.. ప్రపంచంలో చైనా కోల్పోయిన స్థానాన్ని పొందుతుందని ప్రకటించాడు. పొరుగు దేశాలను ఆక్రమించుకోవడం ప్రారంభించాడు. 1949 తర్వాత ప్రపంచంలో లక్షల చదరపు మైళ్ల ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఏకైక దేశం చైనా. 1949లో 6,42,800 చదరపు మైళ్ల జింజియాంగ్‌ ప్రదేశాన్ని, 1950లో 4,74,300 చదరపు మైళ్ల టిబెట్‌ను ఆక్రమించుకున్నది. ఈ రెండు ప్రాంతాలు కలిసి దాదాపు భారత భూభాగం అంత పెద్దవి. కార్మికవర్గ స్వర్గధామాన్ని నిర్మిస్తానని ప్రకటించి 15 రోజులకు ఒక బిలియనీర్‌ను ఉత్పత్తిచేసే పెట్టుబడిదారుల ఊహా ప్రపంచాన్ని నిర్మించాడు. ఆశ్చర్యకరంగా చైనాలో కమ్యూనిస్టు వ్యవస్థ ఉన్నదని ఇప్పటికీ కొంతమంది భారతదేశంలో నమ్ముతున్నారు. యూపీఏ ప్రభుత్వం భారతదేశ కీలకరంగాల్లో చైనా కంపెనీలను నిషేధించినప్పుడు, భారత పారిశ్రామికరంగాన్ని ఆక్రమించుకునే చైనా కంపెనీల ప్రయత్నాన్ని ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం నిరోధించినప్పుడు కొంతమంది వామపక్ష వాదులు నిరసించారు. చైనా తరహా వ్యవస్థనే సోషలిస్టు వ్యవస్థగా భావిస్తే ఇంతకంటే భావదారిద్య్రం ఇంకొకటి లేదు. 

మన్మోహన్‌ ప్రభుత్వం భారత- అమెరికా న్యూక్లియర్‌ ఒప్పందం చేసుకున్నప్పుడు చైనా సూచనల ప్రకారం వామపక్షాలు సోమనాథ్‌ చటర్జీ అభిప్రాయానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం విచారకర సంఘటన. తమ పెట్టుబడుల పరిరక్షణకు బహుళజాతి కంపెనీలు చైనా ప్రభుత్వ దుశ్చర్యలను సమ ర్థిస్తూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న దశలో కూడా ఈ కంపెనీలు చైనాపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కట్టడి చేశాయి. సరిహద్దు దేశాలైన కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, బర్మా మాత్రమే కాకుండా ఆఫ్రికా దేశాలలో ప్రభుత్వాలను అవినీతితో కొనుగోలు చేసి సహజవనరులను, అడవులను దోపిడీ చేస్తూ ప్రపంచ మార్కెట్‌ను శాసించేస్థాయికి చైనా ఎదిగింది. ఆఫ్రికాలో సైనిక స్థావరాన్ని ఏర్పాటుచేసుకొని, అనేక దేశాలకు అప్పులు ఇచ్చి ఓడరేవులను ఆక్రమించుకొని, 138 దేశాల గుండా బెల్ట్‌ రోడ్డును నిర్మిస్తున్నది. తమ వస్తువుల ప్రపంచ రవాణాకు మార్గం ఏర్పాటు చేసుకుంటున్నది. బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని మించిన ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నిస్తున్నది. 

మావో పాలనలో పొరుగు దేశాలను ఆక్రమించుకొని విస్తరణవాదంగా ప్రవర్తించిన చైనా ఇప్పుడు హాన్‌ జాత్యహంకారం తలకెక్కిన కొద్దిమంది సైనిక, కమ్యూనిస్టు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సామ్రాజ్యవాద లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నది. ప్రజాస్వామ్యవ్యవస్థలో ఉన్న బలహీనతలను చైనా అనుకూలంగా ఉపయోగించుకుంటున్నది. చైనా విపరీత ధోరణులను అరికట్టడానికి ఇదివరలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ అనే కూటమిని (సింగపూర్‌, బ్రునై న్యూజీలాండ్‌, చిలీ, ఆస్ట్రేలియా, పెరూ, వియత్నాం , మలేషియా, మెక్సికో, కెనడా, జపాన్‌ దేశాలతో కలిపి) ఏర్పాటుచేశాడు. ఆ తర్వాత భారత్‌ లాంటి పొరుగు దేశాలను ఆ కూటమిలో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ట్రంప్‌ అధికారంలోకి రాగానే చైనా లాబీకి తలొగ్గి కూటమిని రద్దుచేశాడు. డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు చైనా ఆధిపత్యానికి మార్గం సుగమం చేశాయి.

ఆర్థికరంగంలో విదేశీ వ్యవహారాలలో ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ లేదు. 1967లో సిక్కిం ప్రాంతాన్నిఆక్రమించుకోవాలని చైనా చూస్తే ఇందిరాగాంధీ ప్రభుత్వం గట్టిగా సమాధానం చెప్పింది. ఆమె నేర్పుగా రష్యాతో సైనిక ఒడంబడిక చేసుకొని 1975లో చైనాను కట్టడిచేసి సిక్కింను విలీనం చేసుకున్నది. చరిత్రలో చైనా ఆశించి కోల్పోయిన ప్రాంతం సిక్కిం మాత్రమే. 

1998లో అధికారంలోకి వచ్చిన వాజపేయి ప్రభుత్వం పాకిస్థాన్‌ కేంద్రంగా ఉన్న భారత విదేశాంగ విధానాన్ని మార్చి చైనా కేంద్రంగా రూపొందించింది. అందుకే రెండోసారి అణుబాంబులను పరీక్షించింది. పాశ్చాత్య దేశాల విమర్శలకు సమాధానమిస్తూ చైనా నుంచి భారత భద్రతకు ఉన్న ముప్పు గురించి తెలియజెప్పింది. అణు పరీక్షల తర్వాత ప్రసిద్ధిచెందిన జస్వంత్‌సింగ్‌ టాల్‌బాట్‌ సమావేశాలు భారత- అమెరికా సంబంధాలను మలుపుతిప్పాయి. తర్వాత వచ్చిన మన్మోహన్‌ ప్రభుత్వం కూడా పాత విధానాన్నే అమలుపరిచింది. భారత- అమెరికా న్యూక్లియర్‌ ఒప్పందం సమయంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా చాలా ప్రయత్నాలు చేసింది. భారత భూభాగాన్ని ఆక్రమించి, పాకిస్థాన్‌కు అణు పరిజ్ఞానాన్ని, క్షిపణి పరిజ్ఞానాన్ని అందించి భారత భద్రతకు భంగం కలిగిస్తున్నది. మన్మోహన్‌సింగ్‌, జార్జిబుష్‌ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో, భారత పార్లమెంటులో ఒప్పందం ఆమోదం పొందకుండా చైనా కుటిల ప్రయత్నాలు చేసింది. ఆ ఒప్పందం తర్వాత పాశ్చాత్య దేశాలు భారతదేశాన్ని పాకిస్థాన్‌ను విడదీసి చూస్తున్నాయి.

చైనాకు ఆర్థికరంగంలో గట్టిగా పోటీ ఇవ్వాల్సిన భారత్‌.. మోదీ విధానాల వల్ల విఫలమైంది. ఆర్థికాభివృద్ధి పడిపోయి, ఉత్పత్తి రంగం దెబ్బతిని కుదేలైంది. కరోనా వైరస్‌ వ్యాప్తితో పారిశ్రామికరంగం కుంటుపడింది. భారత్‌ ఎదుగాలని ఆశించిన అంతర్జాతీయ సంస్థలు కూడా నిరాశచెందాయి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల కురిపిస్తున్న లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఆర్థికరంగాన్ని క్షీణింపజేస్తున్నాయి. చలామణిలో ఉండాల్సిన డబ్బులు ధనవంతుల బ్యాంకు ఖాతాలలో నిశ్చలంగా ఉన్నాయి. మధ్యతరగతి వర్గంపై ఎక్కువ పన్నుల భారం పడింది. కొనుగోలుశక్తి రాను రాను తగ్గిపోతున్నది. బౌద్ధ శ్రీలంక ఇప్పుడు చైనా ప్రభావంలోకి వెళ్లింది. నేపాల్‌ సైతం సరిహద్దులను మారుస్తూ భారత్‌కు సవాల్‌ విసురుతున్నది. సిటిజెన్‌షిప్‌ చట్టం వల్ల బంగ్లాదేశ్‌ అసహనంగా ఉన్నది. దక్షిణాసియాలో మిత్రులు లేని పరిస్థితి నెలకొన్నది.

ఆర్థికరంగంలో విదేశీ వ్యవహారాలలో ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ లేదు. 1967లో సిక్కిం ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చైనా చూస్తే ఇందిరాగాంధీ ప్రభుత్వం గట్టిగా సమాధానం చెప్పింది. ఆమె నేర్పుగా రష్యాతో సైనిక ఒడంబడిక చేసుకొని 1975లో చైనాను కట్టడిచేసి సిక్కింను విలీనం చేసుకున్నది. చరిత్రలో చైనా ఆశించి కోల్పోయిన ప్రాంతం సిక్కిం మాత్రమే. చైనా ఆర్థిక, సైనిక శక్తి ముందు భారత్‌ నిలువటం కష్టతరమే. ఆర్థిక ప్రగతికి, దేశ రక్షణకు అంతర్జాతీయ కూటమిలో చేరడం అవసరం. పాశ్చాత్య దేశాలతో ఆర్థిక సైనిక ఒడంబడికలను చేసుకొని ఆర్థికపరిస్థితిని మెరుగుపరుస్తూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకత నేడున్నది. ప్రభుత్వానికి సరైన విదేశాంగ విధానం లేని కారణంగా ఈ క్లిష్ట సమయంలో దేశం ఒంటరైపోవటం ఆందోళనకరం.

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు, వాషింగ్టన్‌ డీసీ)logo