శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jun 18, 2020 , 00:21:13

దేశం గర్వించేలా!

దేశం గర్వించేలా!

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగి పంటల దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం తెలంగాణ రాష్ర్టానిదే. అంటే ఇక్కడి దిగుబడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

నియంత్రిత వ్యవసాయ విధానాన్ని దేశంలో మొట్టమొదట అమలుచేసే రాష్ట్రం తెలంగాణనే కావడం గర్వకారణం. ఈ విధానం అన్ని రకాలుగా రైతులకు మేలు చేస్తుంది. దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌ అవుతుంది. కేసీఆర్‌ పట్టుపడితే ఏదేమైనా సరే విజయం సాధించి తీరాలనుకుంటారు. ఆయన ఇప్పుడు వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ముందుకుపోతున్నారు. రైతులు కూడా  కేసీఆర్‌ చెప్పిన నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతున్నారు.

లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థ కుదేలైంది. కోలుకోవడానికి సమయం  పడుతుంది. 2020లో ప్రపంచ జీడీపీ మైనస్‌లోకి పోతుందని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. మన దేశ వృద్ధిరేటు కూడా మైనస్‌ 3.2 శాతానికి పడిపోతుందని చెప్పింది. దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నది. దీని నుంచి కోలుకోవడం సులభం కాదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ అన్నారు.  మరోవైపు 170 దేశాల్లో తలసరి ఆదాయం పడిపోయే ప్రమాదం ఉందని  ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. అయితే లాక్‌డౌన్‌కు ముందే దేశ ఆర్థిక పరిస్థితి  సంక్షోభంలో ఉన్నది. ఇందుకు కారణం కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, అశాస్త్రీయ పద్ధతుల్లో జీఎస్టీ విధానాన్ని తీసుకురావడమే. దీనివల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. దేశ సగటు తలసరి ఆదాయం, ప్రజల కొనుగోలుశక్తి పడిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు జాతీయ తలసరి ఆదాయం, కొనుగోలుశక్తితో పోలిస్తే తెలంగాణలో ఇవి ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,432. తెలంగాణలో అయితే రూ.2,28,216 గా ఉన్నది. అలాగే రాష్ట్ర వృద్ధిరేటు 11.8 శాతంగా ఉంటే ఆల్‌ ఇండియా వృద్ధిరేటు కేవలం 6.3 శాతంగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టి, త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. అందుకే ఇది సాధ్యమైంది. కాబట్టి లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆదాయం పడిపోయినా, వ్యవసాయరంగం కొద్దోగొప్పో ఆదుకున్నదని చెప్పవచ్చు. ఇప్పుడు వ్యవసాయరంగమే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుందని రంగరాజన్‌తో సహా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగి పంటల దిగుబడులు రికార్డుస్థాయిలో పెరిగాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా సేకరించిన  ధాన్యంలో 55 శాతం తెలంగాణ రాష్ర్టానిదే. అంటే ఇక్కడి దిగుబడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మక్కజొన్న కూడా రికార్డు స్థాయిలో ఉత్పత్తయ్యింది. దీని దృష్ట్యా కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానాన్ని తేవాలనుకున్నారు. లేదంటే రైతాంగం నష్టపోతుందని భావించారు. ముందుచూపుతో కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం దృష్ట్యా కూడా వ్యవసాయరంగాన్ని లాభాల బాట పట్టించాలని భావించి ప్రాధాన్య పంటలు వేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయరంగానికి అనుబంధంగా పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటికోసం సెజ్‌ల ఏర్పాటుకు భూ సేకరణ చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతు పంటదిగుబడిని ప్రాసెసింగ్‌ చేసి అమ్మితే మంచి ధర వస్తుంది. దీంతో రైతులకు లాభం జరుగుతుంది. మరో వైపు చిన్న, మధ్యతరహా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు రావడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. 

నియంత్రిత వ్యవసాయ విధానాన్ని దేశంలో మొట్టమొదట అమలుచేసే రాష్ట్రం తెలంగాణనే కావడం గర్వకారణం. ఈ విధానం అన్నిరకాలుగా రైతులకు మేలు చేస్తుంది. దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌ అవుతుంది. కేసీఆర్‌ పట్టుపడితే ఏదేమైనా సరే విజయం సాధించి తీరాలనుకుంటారు. ఆయన ఇప్పుడు వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ముందుకుపోతున్నారు. రైతులు కూడా  కేసీఆర్‌ చెప్పిన నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువస్తుంటే మోదీ నేతృత్వంలోని కేంద్రం కార్పొరేట్‌ సంస్థలు ఆర్థికంగా బలపడే సంస్కరణలు తీసుకువచ్చింది. కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్‌ దీనినే తెలియజేస్తున్నది. ‘ఒకే దేశం ఒకే మార్కెట్‌' పేరుతో తెచ్చిన చట్టం నిత్యావసర సరుకుల నుంచి పప్పు ధాన్యాలను, నూనెగింజలను, ఆలు, ఉల్లిగడ్డలను మినహాయిస్తూ చట్టం తెచ్చింది. అలాగే పరిమిత నిల్వల చట్టాన్ని కూడా సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ ఇందుకు నిదర్శనం. వ్యవసాయరంగ నిపుణులు దేవిందర్‌శర్మ, సుధీర్‌ పన్వర్‌లతోపాటు మరికొంత మంది కూడా ఇవి కచ్చితంగా కార్పొరేట్‌ సంస్థలకు, వ్యాపారులకు లాభాన్ని చేకూర్చేవే తప్ప  రైతుకు మేలుచేసేవి కావంటున్నారు. నిత్యావసర చట్టాన్ని సవరించి పప్పుధాన్యాలను , నూనె గింజలను, ఉల్లి, ఆలుగడ్డలను మినహాయిస్తే జరిగేది బ్లాక్‌ మార్కెట్‌ తప్ప మరొకటి కాదు. దానివల్ల వ్యాపారులకే లాభం. రైతుకు మిగిలేది ఏముండదు. 

సరుకు నిల్వల మీద ఉన్న నియంత్రణను సడలించి వ్యాపారులే పెద్దఎత్తున శీతల గిడ్డంగులు గోదాంలు నిర్మాణం చేసుకొని సరుకు నిల్వ చేసుకునే అవకాశం కల్పిస్తే, ధరల నియంత్రణ మీద ప్రభుత్వానికి ఏం అజమాయిషీ ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్ట్టించరనే గ్యారంటీ ఏముందని నిలదీస్తున్నారు. రైతు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నా.. చిన్న, సన్నకారు రైతులు రవాణా ఖర్చులు పెట్టుకొని దూరప్రాంతానికి వెళ్లి అమ్ముకోవటం అసాధ్యం. పైగా ప్రభుత్వ మార్కెట్లలో ఉండే నియంత్రణ బయట ఉండదు. దానివల్ల రైతు నష్టపోతాడు. ఈ సంస్కరణలు రైతుకు, వినియోగదారుడికి నష్టం తెచ్చేవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనివల్ల వ్యవసాయరంగం సంక్షోభంలో పడటం, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఇప్పుడు దేశానికి కావాల్సింది నియంత్రిత సాగు విధానం. తద్వారా రైతు పండించిన పంటకు మద్దతు ధర దొరుకడంతోపాటు వినియోగదారుడికి సరసమైన ధరకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి. ఆ వైపుగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 

(వ్యాసకర్త: టీ న్యూస్‌ ఇన్‌పుట్‌ ఎడిటర్‌)
logo