శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jun 18, 2020 , 00:21:22

రిజర్వేషన్లు-షెడ్యూళ్లు

రిజర్వేషన్లు-షెడ్యూళ్లు

రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని ఇటీవల సుప్రీంకోర్టు అన్నది! వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం కేంద్రం ‘జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)’ అని పెట్టి రాష్ర్టాల వారీగా ఉన్న రిజర్వేషన్లను అమలుజరుప నిరాకరిస్తే, న్యాయం చెప్పండి అని తమిళనాడు, దేశంలోని అన్ని పార్టీలు కోరితే సుప్రీంకోర్టు అసలుకే ఎసరుతెచ్చింది. రాజ్యాంగంలోని 14, 15, 16, 31బి ఆర్టికల్స్‌లో గల రక్షణల క్లాజులను ప్రశ్నించింది. ఆ రక్షణ క్లాజులను తిరుగతోడటం అంటే ప్రాథమిక హక్కుల పేర సామాజిక న్యాయాన్ని, రిజర్వేషన్‌ రక్షణల కిందికి వచ్చే 75-80 శాతం ప్రజల ప్రాథమిక హక్కులను హరించడమే కాకుండా, ప్రాథమిక హక్కుల పేరిట ఆదేశిక సూత్రాల లక్ష్యాలను వదిలేయడమే. 

భారతదేశం ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌' అని రాజ్యాగంలో ఉన్నది. కానీ ఇటీవల ‘యూనియన్‌ ఒక్కటే, ఒకే దేశం.. ఒకే చట్టం’ వంటి నినాదాలు పెరిగాయి. ఆ క్రమంలో కేంద్రం రాష్ర్టాల హక్కులను హరిస్తూ ఫెడరలిజం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది. విద్యుత్‌ చట్టం తెచ్చి రాష్ర్టాలను ఇరుకునపెట్టజూస్తున్నది. నీట్‌, జీఎస్టీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపు మొదలైనవి ఢిల్లీ హస్తగతమైనాయి. ఇలా ఫెడరల్‌ స్ఫూర్తికి భిన్నంగా రాజ్యాంగాన్ని కేంద్రీకృతం చేస్తున్నారు.

రాజ్యాంగంలోని షెడ్యూళ్లు కూడా ఫెడరల్‌ నిర్మాణాన్ని తెలుపుతాయి. ఫెడరలిజానికి సాక్ష్యంగా భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లున్నాయి. వీటిని గమనించినట్లయితే ఇండియాలోని ఫెడరలిజం స్వభావం కొంత అర్థమవుతుంది. 8వ షెడ్యూల్‌లోని భాషలతోపాటు 9వ షెడ్యూల్‌ ప్రత్యేకంగా ఫెడరలిజం స్వభావాన్ని తెలుపుతాయి. మరో అతి ముఖ్యమైనది 9వ షెడ్యూల్‌ 31బి ఆర్టికల్‌కు అనుబంధ పట్టిక. ఈ పట్టికలో 285కు పైగా చట్టాలను చేర్చారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు కూడా ఈ 9వ షెడ్యూల్లో ఉన్నాయి.

బీసీ రిజర్వేషన్లను పెంచుకునేందుకు వీలుగా ఆ అంశాన్ని కోర్టు పరిధి నుంచి మినహాయించి రక్షణ కల్పించడానికి 14, 15, 16 ఆర్టికల్స్‌లో సవరణలు చేర్చారు. పైగా ఆర్టికల్‌ 31(బి)లో చేర్చి 9వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. సుప్రీంకోర్టు ఈ తొమ్మిదవ షెడ్యూల్‌ను కూడా విచారించే అధికారం ఉందని ప్రకటించుకున్నది.

న్యాయవ్యవస్థ నిర్మాణంలో పెద్ద పొరపాటు జరిగిపోయింది. రాజ్యసభ వలె సుప్రీంకోర్టుతో సమానంగా మరొక ఫెడరలిజం సుప్రీంకోర్టును ఏర్పాటుచేయవలసి ఉండింది. ఇలాంటి ఏర్పాటు అమెరికాలో ఉంది. ఒక రాష్ట్ర హైకోర్టు తీర్పును దేశమంతటికి వర్తింపజేయడం ఫెడరల్‌ స్పూర్తికి భిన్నం. కేంద్రం బలంగా ఉండాలనే సాకుతో నియంతృత్వ పోకడలు సాగుతుంటాయి. రాష్ర్టాలు బలంగా ఉన్నపుడే యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌కు సరైన అర్థం.


logo