సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jun 17, 2020 , 00:07:49

కదులుతున్న ట్రంప్‌ పునాది

కదులుతున్న ట్రంప్‌ పునాది

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానంతరం గత యాభై ఏండ్లలో ఎన్నడూ లేనంత సామాజిక అనిశ్చితి నెలకొన్నది.. అర్బన్‌ అమెరికా చెలరేగిపోతున్నదని, ఈ ప్రమాదం నుంచి అమెరికాను రక్షించేది తాను మాత్రమేనని ట్రంప్‌ ప్రచారం చేయదలుచుకున్నారు.. ట్రంప్‌ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం వివిధ సర్వేలలో బిడెన్‌దే పైచేయిగా ఉన్నది. ఇంతకూ ట్రంప్‌ అంచనాలు తలకిందులు కావడానికి కారణాలేమిటి? ట్రంప్‌ మ్యాజిక్‌ ఎందుకు పనిచేయడం లేదన్నది ప్రశ్న..

అమెరికా పలువిధాల సంక్షోభాలు ఎదుర్కొంటున్నది. కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్నది. ఆర్థిక సంక్షోభం కల్లోలం సృష్టిస్తున్నది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానంతరం గత యాభై ఏండ్లలో ఎన్నడూ లేనంత సామాజిక అనిశ్చితి నెలకొన్నది. తన వ్యతిరేకతను కూడా సొమ్ము చేసుకోవడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటే. ఈ సంక్షోభాలు కూడా తనకు మేలే చేస్తాయనే ధీమా ట్రంప్‌కు ఉన్నది. ఈ అనిశ్చితి తన పునాదిని మరింత గట్టి పరుస్తుందని ఆయన భావిస్తున్నారు. అర్బన్‌ అమెరికా చెలరేగిపోతున్నదని ఈ ప్రమాదం నుంచి అమెరికాను రక్షించేది ట్రంప్‌ మాత్రమేనని ప్రచారం చేయదలుచుకున్నారు. లాక్‌డౌన్‌ ఉండాలని కోరుతున్న డెమొక్రటిక్‌ పార్టీ శిష్ఠవర్గానికి వ్యతిరేకంగా అమెరికా కార్మికులు విరుచుకుపడుతారనేది ఆయన భావన. తన ప్రత్యర్థి జో బిడెన్‌ను అరాచకానికి, అల్లర్లకు, పర్యాయపదంగా ప్రజలను భావిస్తారనేది ట్రంప్‌ అంచనా.

ట్రంప్‌ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం వివిధ సర్వేలలో బిడెన్‌దే పైచేయిగా ఉన్నది. ఇంతకూ ట్రంప్‌ అంచనాలు తలకిందులు కావడానికి కారణాలేమిటి? ట్రంప్‌ మ్యాజిక్‌ ఎందుకు పనిచేయడం లేదు? నేటి కోన్‌ ఇందుకు సంబంధించి కొన్ని విశ్లేషణలు అందించారు.

ట్రంప్‌ విజయానికి ప్రధానమైన పునాది తెల్ల జాతి ఓటర్లు. ఇప్పుడు ఆ తెల్ల ఓటర్లే ట్రంప్‌కు దూరమవుతున్నారు. కొద్దికాలం కిందట ట్రంప్‌కన్నా బిడెన్‌కు ఆరు పాయింట్ల ఆధిక్యం ఉండేది. ఇప్పుడది పది పాయింట్లకు పెరిగింది. కాలేజీ చదువని ఓటర్లలో ట్రంప్‌కు ఉన్న ఆధిక్యం పది పాయింట్లు తగ్గింది. 2016 ఎన్నికల్లో ఈ వర్గం ఓటర్లు భారీగా ట్రంప్‌ వైపు మొగ్గు చూపారు. కొద్దికాలం కిందట కూడా ఈ వర్గంలో ట్రంప్‌ బిడెన్‌ కన్నా 31 పాయింట్ల ఆధిక్యం ఉండేది. ఇప్పుడది 21 పాయింట్లకు తగ్గింది.

ఈ వర్గం ఓటర్ల మొగ్గు బిడెన్‌ స్థానాన్ని సుస్థిరపరుస్తున్నది. ఎందుకంటే శ్వేతజాతి పట్టభద్రులు ఇప్పటికే బిడెన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. 2016 ఎన్నికల్లో శ్వేతజాతి పట్టభద్రులు ట్రంప్‌కు అండగా నిలిచారు. రెండు నెలల కిందట ఈ వర్గంలో బిడెన్‌కు మద్దతు 4 పాయింట్లు ఉండేది. ఇప్పుడది 20 పాయింట్లకు చేరుకున్నది. వృద్ధులలో కూడా బిడెన్‌ 7 పాయింట్ల సగటు ఆధిక్యంతో కొనసాగుతున్నది. ఈ పరిణామాలు ఒకప్పుడు ఊహకందనివి. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తుంటే అమెరికా సమాజమే సాంస్కృతిక పరివర్తనకు గురవుతున్నదా అనిపిస్తున్నది. పోస్ట్‌ స్కార్‌ స్కూల్‌ అధ్యయనం ప్రకారం చూస్తే-ఇప్పుడు సాగుతున్న నిరసనల పట్ల శ్వేతజాతి ఓటర్ల దృక్కోణం మారినట్టు కనిపిస్తున్నది. మొత్తం సమాజాన్ని పరిగణనలోకి తీసుకుంటే- ఈ నిరసన ప్రదర్శనల పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరును ముప్ఫై ఐదు శాతం అమెరికన్‌ ఓటర్లే ఆమోదిస్తున్నారు. 74 శాతం మంది నిరసనలకు మద్దతునిస్తున్నారు. ఫ్లాయిడ్‌ మరణం నల్లజాతీయుల పట్ల పోలీసు వైఖరిని ప్రతిబింబిస్తున్నదని 69 శాతం మంది భావిస్తున్నారు. 

ఇక తెల్లజాతి ఓటర్లను పరిగణిస్తే-నిరసనల పట్ల ట్రంప్‌ వ్యవహార సరళిని 39 శాతం మంది ఆమోదిస్తున్నారు. 57 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. 69 శాతం నిరసన ప్రదర్శకులకు అనుకూలంగా ఉన్నారు. 68 శాతం నల్లజాతీయుల పట్ల పోలీసుల వైఖరిని తప్పుబడుతున్నారు. ఈ విషయంలో విద్యావంతులకు సంబంధించి పెద్దగా తేడా లేదు. నిరసనల పట్ల ట్రంప్‌ వైఖరిని కాలేజీ చదువులేని తెల్లవారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఫ్లాయిడ్‌ హత్యను కూడా చదువుతో తేడా లేకుండా తెల్లజాతీ వారంతా ఖండిస్తున్నారు. ఫ్లాయిడ్‌ హత్య వ్యవస్థాగత లోపానికి సూచనగా 60 శాతం మంది భావిస్తున్నారు. 2014 నాటి శ్వేతజాతీయుల మనోభావాలతో పోలిస్తే ఇది భారీ మార్పుగా చెప్పవచ్చు. శ్వేతజాతి మహిళలలో ట్రంప్‌కు వ్యతిరేకంగా 38 శాతం మొగ్గు కనిపిస్తున్నది. నిరసన ఉద్యమకారులతో శ్వేతజాతీయులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పలు ఇతర అధ్యయనాల్లో కూడా స్పష్టమైంది. దేశవ్యాప్తంగా నల్లజాతీయుల ప్రదర్శనల్లో పేద, గ్రామీణ తెల్లజాతీయులు పాల్గొంటున్నారని రియాన్‌ కూపర్‌ పరిశీలనలో వెల్లడైంది. నల్ల, తెల్ల జాతీయుల మధ్యలో ఆర్థికపరమైన వ్యత్యాసాలు భారీగా ఉన్నాయి. ఈ తేడాలు ఆగ్రహావేశాలకు కారణమవుతున్నది. ఈ అసమానతలను తొలిగించడం కోసం చేపట్టే సంస్కరణలకు శ్వేతజాతీయులు ఎంతమేర మద్దతిస్తారనేది ఇప్పుడే చెప్పలేం. ఇప్పుడు వేధిస్తున్న సమస్యల పట్ల అమెరికా శ్వేతజాతి సమాజం వైఖరిలో మార్పు కనిపిస్తున్నది. ఇది సాంస్కృతికపరమైన పరివర్తనకు సూచన. ఈ అంశాల పట్ల సమతుల్యతతో విజ్ఞతతో వ్యవహరిస్తే బిడెన్‌ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. నిరసన ప్రదర్శనల సందర్భంగా చెలరేగిన హింసను బిడెన్‌ ఖండించారు. సమస్యల పరిష్కారానికి సంస్కరణలు చేపట్టాలని కూడా అన్నారు. ఈ వాదనతో శ్వేతజాతీయులు కూడా ఏకీభవిస్తున్నారు.

ట్రంప్‌ వెనుకబడటానికి ఇటీవల పరిణామాలే కారణమా? అనేది కచ్చితంగా చెప్పలేం. అయితే పూర్వం మాదిరిగా ఆయన వాక్చాతుర్యం పనిచేయడం లేదు. ఆయన వాదనలు ఆమోదం పొందడం లేదు. ప్రజలను ఆకట్టుకోగల తన శక్తికి తిరుగులేదని ట్రంప్‌ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నిరసన ప్రదర్శనలు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. కానీ ప్రజల అసమ్మతి మాత్రం ఇంకా దట్టంగా పెరిగిపోతున్నది. ఈ పరిణామం ట్రంప్‌ను మరింత ఏకాకిని చేయవచ్చు-శ్వేతజాతి టర్లలో కూడా. 

(‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌' సౌజన్యంతో....)

ఇప్పుడు వేధిస్తున్న సమస్యల పట్ల అమెరికా శ్వేతజాతి సమాజం వైఖరిలో మార్పు కనిపిస్తున్నది. ఇది సాంస్కృతిక పరమైన పరివర్తనకు సూచన. ఈ అంశాల పట్ల సమతుల్యతతో విజ్ఞతతో వ్యవహరిస్తే బిడెన్‌ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. నిరసన ప్రదర్శనల సందర్భంగా చెలరేగిన హింసను బిడెన్‌ ఖండించారు. సమస్యల పరిష్కారానికి సంస్కరణలు చేపట్టాలని కూడా అన్నారు. ఈ వాదనతో శ్వేతజాతీయులు కూడా ఏకీభవిస్తున్నారు.

తాజావార్తలు


logo