మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Jun 17, 2020 , 00:07:50

‘ఆన్‌లైన్‌' అంత సులభమా?

‘ఆన్‌లైన్‌' అంత సులభమా?

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ నర్సరీ నుంచి పరిశోధన విద్యార్థుల దాకా ఇప్పుడు వినిపించే మాట వర్చువల్‌ క్లాస్‌రూం. ఆన్‌లైన్‌ విద్య మూలాల్లోకి వెళ్లి చూస్తే-విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలు ఎంతవరకు మెరుగుపరుచగలదు, దీనిద్వారా విద్యార్థులను ఈ పోటీ ప్రపంచంలో నిలపగలమా అనే చర్చ ముందుకువస్తుంది.

టీచర్లు, అధ్యాపకులు, విద్యార్థులంతా భౌతికంగా కలుసుకోలేని పరిస్థితి. ఈ సమయంలో విద్యార్థుల చదువు ముందుకు తీసుకుపోవడం కోసం ప్రత్యామ్నాయ పరిస్థితులేవీ లేకపోవడంతో ఆన్‌లైన్‌ విద్య అంశం తెరమీదికి వచ్చింది. అయితే మన దేశంలో ఉన్న అవసరాలకు ఆన్‌లైన్‌ విద్య అనేది సమంజసమా కాదా అనేది మేధావులు అభిప్రాయం. దేశంలో అనేక గ్రామాల్లో కనీసం ఫోన్‌ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం ఎలా లభిస్తుంది? ఆన్‌లైన్‌ పాఠాల ద్వారా ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడి తట్టుకోగలరా అనేది అతిపెద్ద ప్రశ్న. యూజీసీ పరిధిలోని విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ క్లాసెస్‌ తప్పనిసరిచేసి విద్యార్థులంతా  ఆన్‌లైన్‌ క్లాసుల్లో పాల్గొనాలని నిబంధనలను విధించాయి. ఆన్‌లైన్‌ విద్య అనేది ఆప్షన్‌ మాత్రమే, అది ఎప్పటికీ సమాధానం కాదు. ఇదిలా ఉంటే మూడేండ్ల చిన్నపాపను మొదలుకొని 14 ఏండ్ల విద్యార్థి దాకా గంటల తరబడి మొబైళ్లు, కంప్యూటర్ల ముందు కూర్చొని క్లాసులు వినడం విద్యార్థుల ఆలోచింపగలిగే శక్తిని దెబ్బతీస్తుంది. దీంతో విద్యార్థులకు ఆరోగ్య, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడు తున్నారు.

దేశంలో ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీలో, ఇతర విశ్వవిద్యాలయాలలో దూర విద్య అనే పేరుతో ఒక నూతన విద్యను ఆర్జించే పద్ధతి 20 ఏండ్ల నుంచి అందుబాటులో ఉన్నది. దీనిద్వారా అనేకమంది విద్యార్థులు తమ విద్యను పూర్తిచేసుకున్నారు. పట్టాలు పొంది అత్యున్నత  ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇట్లా అనేకమంది పలురంగాల్లో మన దేశానికి సేవలు అందిస్తున్నారు. దూర విద్య ద్వారా విద్యార్థులు సంవత్సరం మొత్తం కేవలం పది రోజుల క్రాష్‌ కోర్సు పూర్తిచేసి మిగతా సమయంలో పోస్టు ద్వారా అందిన పుస్తకాలు చదువుకొని ప్రతి రెండు నెలలకు ఒకసారి వారి ప్రగతిని చూపుతారు. పుస్తకాలు తెరిచి పరీక్ష రాయటం మనకు కొత్త. అయినా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. మన దేశంలో కూడా ఓపెన్‌ బుక్‌ విధానం ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించే నైపుణ్యాలను అధ్యాపకులకు అందించవలసిన అవసరం ఉన్నది. అంతేకానీ ఆన్‌లైన్‌ విద్య అనేది ఎప్పటికీ ప్రోత్సహించదగినది కాదు.

(వ్యాసకర్త: మాస్టర్స్‌ లా విద్యార్థి, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌)


logo