మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jun 15, 2020 , 23:12:30

వ్యూహాత్మక ప్రగతి

వ్యూహాత్మక ప్రగతి

ఆశయ సాధన కోసం లక్ష్య సాధకులు ఎల్లవేళలా కార్యోన్ముఖంగా ఉంటారు. అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూడకుండా అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా కృషిచేస్తారు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తున్నది. కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ సర్కార్‌ పారిశ్రామిక ప్రగతి కోసం ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. చైనా నుంచి తరలిపోతున్న పరిశ్రమలను తెలంగాణ రాష్ర్టానికి ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వనరులు, వసతుల కల్పనకు విశేష కృషిచేస్తున్నది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. ఇప్పటికే దీనిద్వారా 12వేల పరిశ్రమలు వచ్చాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈవోబీ)లో అగ్రస్థానం దక్కించుకున్న తెలంగాణ, ప్రస్తుత విధానంతో పారిశ్రామికాభివృద్ధిలో దూసుకుపోతుందనటంలో సందేహం లేదు.

ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్స్‌, వైద్యం, ఐటీ, ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌, ఏరోస్పేస్‌ రంగాల కంపెనీల స్థాపనకు రాష్ట్రం అనుకూలం. వీటికి అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు, మానవ వనరులు, భౌగోళిక వాతావరణ పరిస్థితులు, ఈవోడీబీ లాంటి అనుకూల అంశాలు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. భూమి లభ్యత, మానవ వనరులు, రవాణా తదితర సౌకర్యాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటులో వికేంద్రీకరణను పాటించింది. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కాకుండా పలు జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు పూనుకున్నది. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ ప్రధాన భూమిక పోషిస్తున్నది. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పరిశ్రమలను స్థాపించి వెంటనే వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించే అవకాశమున్న 21 పారిశ్రామిక పార్కులను పరిశ్రమల శాఖ గుర్తించింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవటం గమనార్హం.

రాష్ట్ర సమగ్ర, సంతులిత అభివృద్ధిలో వ్యవసాయానికి తోడు పారిశ్రామిక ప్రగతి కూడా ముఖ్యమైనది. సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. నియంత్రిత సాగు విధానంతో వ్యవసాయాన్ని అన్ని రకాల సమస్యల వలయం నుంచి విముక్తి దిశగా తీసుకుపోతున్నది. దీనికి తోడుగా పారిశ్రామిక ప్రగతి కూడా అత్యావశ్యకం. వివిధ రకాల కంపెనీల స్థాపన, పెట్టుబడులు తరలి రావటంలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు, సహ కారం అవసరం. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ను మంజూరు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. వీటిపై కేంద్రం సానుకూలంగా స్పందించి ‘కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, క్వాలిటీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌'పై దృష్టి సారించిన రాష్ర్టానికి చేయూతనందించాలి. రాష్ర్టాభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉన్నదనేది నిర్వివాదం. సమాఖ్య స్ఫూర్తితో రాష్ర్టాలు సాధిస్తున్న పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం అండగా నిలువాలి.


logo