సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jun 15, 2020 , 23:12:28

సాయానికి ప్రతిఫలం

సాయానికి ప్రతిఫలం

వేగంగా మారుతున్న కుటుంబవ్యవస్థ, సామాజిక ధోరణుల్లో గృహసహాయకుల పాత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. వారు ఒక్కపూట రాలేదంటే కొందరి కార్యాచరణ కాలం తప్పుతుంది. అంతర్జాతీయంగా గృహ సహాయకుల పనితనానికి ఎంతో విలువ ఉన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2011 జూన్‌ 16న జెనీవా సమావేశంలో ప్రవేశపెట్టిన ఐఎల్‌ఓ కన్వెన్షన్‌-సీ 189 గుర్తుగా ఏటా జూన్‌ 16న అంతర్జాతీయ గృహ సహాయకుల దినోత్సవం నిర్వహించు కుంటున్నాం.

గృహ సహాయకులు ప్రపంచ శ్రామికశక్తిలో అంతర్భాగం.  ఈ పనిలో శుభ్రపరుచడం, వంట చేయడంతో పాటు పిల్లలు, వృద్ధులు, కుటుంబంలోని అనారోగ్యం పాలైన వారి సంరక్షణ, తోట పని, ఇంటికి కాపలా వంటి ఎన్నోరకాల పనులు ఉండవచ్చు. గృహ కార్మికుల్లో శాశ్వత లేదా తాత్కాలిక ఉద్యోగులున్నారు.

గృహ సహాయకులు ఎక్కువగా బలహీనవర్గాలు, వెనుకబడిన ప్రాంతాల నుంచి వస్తుంటారు.  ఇళ్లు పనిప్రదేశంగా ప్రజల అంగీకారం పొందడమనేది ఒక సవాల్‌. కనీస వేతనాలు, పరిమిత పని గంటలు వంటి కార్మికచట్టాల అమలుఅంశాలు సవాలుగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా లేదా జాతీయంగా గృహ సహాయకుల సంఖ్యపై తాజా సమాచారం లేదు. ఐఎల్‌ఓ-2015 అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 67 మిలియన్ల మంది గృహ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నది. 2004-05లో దేశంలో గృహాలలో పనిచేసేవారి సంఖ్య 4.2 మిలియన్లు. మొత్తం ఉపాధిలో ఒక శాతం అని నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో తేలింది. అనధికారిక అంచనాల ప్రకారం ఈ సంఖ్య దాదాపు 90 మిలియన్లు. భారత ప్రభుత్వ 2009- 10 ఉపాధి, నిరుద్యోగ సర్వే నివేదిక.. దేశంలో కోటిమందికిపైగా ప్రజలు ప్రైవేట్‌ గృహాల్లో పనిచేస్తున్నట్లు పేర్కొన్నది. 

గృహ సహాయకులపై శారీరక, లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటాయి. వీటి నివారణకు ఏకైక మార్గం చట్టం ద్వారా గృహ పనిని నియంత్రించడం. అసంఘటిత సామాజిక భద్రతా చట్టం-2008, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధ, పరిష్కార) చట్టం-2013, వివిధ రాష్ర్టాల్లో నోటిఫై చేసిన కనీస వేతనాల వంటి అనేక చట్టాలు ఉన్నప్పటికీ నిబద్ధత లేకపోవడం, న్యాయమైన ఉపాధి నిబంధనలకు హామీ ఇచ్చే జాతీయ చట్టం లేకపోవటం పెద్ద లోపంగా మారింది.

నైపుణ్యాలను ప్రతిబింబించే కనీస వేతనాలు, సామాజిక రక్షణ పథకాల లబ్ధి, పని గంటలను నియంత్రించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని అమలుచేయడం పెద్ద సవాలు. గృహ సహాయకుల పిల్లల సంరక్షణ అవసరాలను ఎలా తీర్చాలనేది ఒక ముఖ్యమైన సమస్య. 

 ఆర్థిక మద్దతు లేని గృహ సహాయకులు.. ప్రభుత్వం లేదా యజమానుల నుంచి సహాయం లేనప్పుడు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. యజమానుల ఇండ్లలో పనిచేసే గృహసహాయకులకు గౌరవం, వేతనం, సదుపాయాలు ఉండాలి. ఈ పని ఆధునిక బానిసత్వంగా మారకూడదు. గృహ సహాయకుల హక్కులను పరిరక్షించడంలో పరిపాలనాయంత్రాంగాలు, పౌర సమాజం కలిసి పనిచేయాలి. 

(వ్యాసకర్త: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలనాశాస్త్ర విభాగాధిపతి)

(నేడు అంతర్జాతీయ గృహ సహాయకుల దినోత్సవం)


logo