గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jun 14, 2020 , 23:44:47

పెట్టుబడిలేని గిట్టుబాటు

పెట్టుబడిలేని గిట్టుబాటు

గతంతో పోల్చితే నాలుగైదేండ్లలో తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా మారాయి. సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సాగునీటి లభ్యత భారీగా పెరిగింది. దీంతో తెలంగాణలో ఆయిల్‌ పామ్‌ సాగు పెరుగుతుందని, రైతులకు ఈ పంట సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుందని 3ఎఫ్‌ ఆయిల్‌పామ్‌ అగ్రోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎండీ అండ్‌ సీఈవో సంజయ్‌ గోయెంకా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో 25 జిల్లాల్లో 7లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నది. ఆయిల్‌పామ్‌ సాగు విధానాలు, రైతులకు లాభాలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై సంజయ్‌ గోయెంకా తన అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆ వివరాలు..

  • రాష్ట్రంలో సాగుకు సానుకూల అంశాలు
  • నీటి వసతి పెరుగడం ముఖ్య కారణం 
  • 24 గంటల ఉచిత విద్యుత్‌ అదనం 
  • 25 జిల్లాల్లో నేలలు సాగుకు అనుకూలం
  • ఒక్కసారి నాటితే 25 ఏండ్ల వరకు దిగుబడి 
  • ఏటా కనిష్ఠంగా రూ.70-90 వేల లాభం
  • ప్రతి పనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సబ్సిడీల ప్రోత్సాహం 
  • సాగు పెరిగితే ఆయిల్‌పామ్‌ ఇండస్ట్రీకి ఊతం.. 
  • యువత పెరుగనున్న ఉపాధి అవకాశాలు 

ప్రస్తుతం దేశంలో 16 రాష్ర్టాల్లో 3 లక్షల హెక్టార్లలో మాత్రమే ఆయిల్‌పామ్‌ను సాగు చేస్తున్నారు. ఇది దేశ అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. ప్రస్తుతం 250 లక్షల హెక్టార్లలో నూనె పంటలను సాగుచేస్తుండగా వీటినుంచి 100 లక్షల టన్నుల ఆయిల్‌ ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 125 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే 500 లక్షల టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేయొచ్చు. తద్వారా మన దేశ అవసరాలు తీరడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ చేరుకుంటుంది. 

దేశ, విదేశాల్లో పామాయిల్‌ డిమాండ్‌ ఏ విధంగా ఉంది?

సంజయ్‌ గోయెంకా: దేశ, విదేశాల్లో పామాయిల్‌కు భారీ డిమాండ్‌ ఉన్నది. చాలా దేశాల్లో 70శాతం మేర కూడా వారి అవసరాలకు సరిపడా పామాయిల్‌ను ఉత్పత్తి చేసుకోవడం లేదు. మన దేశం ఏటా 75వేల కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నది. దేశంలో ప్రతి వ్యక్తి సగటున 18కిలోల ఆయిల్‌ను ఉపయోగిస్తున్నారు. అదే అంతర్జాతీయ సగటు 27 కేజీలుగా ఉన్నది. ఇందుకు కారణం మన వద్ద నూనెల ధర అధికంగా ఉండటమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నూనెల వాడకం మరింత తక్కువగా ఉన్నది. ప్రతి వ్యక్తి శరీరానికి సరిపడా నూనెను తీసుకోవాల్సిందే. దీని ప్రకారం దేశంలో ఆయిల్‌ వాడకం పెరిగితే దిగుమతి మరింతగా పెంచాల్సి ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది. మరోవైపు నూనె పంటల దిగుబడి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో పామాయిల్‌ నూనె ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును ప్రొత్సహిస్తున్నది. దేశవ్యాప్తంగా 20 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. 

ప్రశ్న: పామాయిల్‌ అనగానే కొందరికి నిరాసక్తి. కారణమేమిటి?

సంజయ్‌ గోయెంకా: నిజమే.. పామాయిల్‌ అనగానే చాలామంది అంతగా ఆసక్తి చూపరు. మిగతా నూనెలకు, పామాయిల్‌కు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. మిగతా వాటిలాగానే ఇందులో కూడా విటమిన్‌-ఇ, బీటా కెరోటిన్‌తోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు ఉంటాయి. పామాయిల్‌లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. ఇది ఆరోగ్యానికి మంచిది. పామాయిల్‌ ధర కొంత తక్కువగా ఉండటం కూడా వినియోగదారులు తక్కువ తీసుకోవడానికి కారణమేమో అనిపిస్తుంది. పామాయిల్‌ ధర తక్కువగా ఉండటానికి కారణం.. మిగతా నూనెలతో పోల్చితే ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకే ధర తక్కువ ఉంటుంది. దేశంలో ఆయిల్‌ను ఉత్పత్తి చేసే పంటలను పరిశీలిస్తే.. సన్‌ఫ్లవర్‌, గ్రౌండ్‌నట్‌ ఇంకా వేరేది ఏదైనా హెక్టారుకు గరిష్ఠంగా 500 కేజీల ఆయిల్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అదే ఆయిల్‌పామ్‌ హెక్టారుకు కనీసంగా 4వేల కేజీల మేరకు ఉత్పత్తి అవుతుంది. ఇతర ఆయిల్‌ పంటలతో పోల్చితే ఆయిల్‌పామ్‌లో దిగుబడి ఎనిమిది రెట్లు ఎక్కువ. 

ప్రశ్న: ఆయిల్‌పామ్‌ సాగుకు తెలంగాణ అనుకూలమేనా? భవిష్యత్‌ అవకాశాలు ఎలా ఉన్నాయి? 

సంజయ్‌ గోయెంకా: గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితులు ఆయిల్‌పామ్‌ సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఆయిల్‌పామ్‌ సాగుకు సంవత్సరం పొడవునా నీరు పెట్టాలి. సీఎం కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి కష్టాలు పోయాయి. ప్రస్తుతం ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే ఆయిల్‌పామ్‌ను సాగుచేస్తున్నారు. ఈ జిల్లాల్లో 45వేల ఎకరాల్లో సుమారు 30వేల టన్నుల ముడి పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించింది. దీని సాగుకు కొత్తగా 21 జిల్లాలను గుర్తించింది. సుమారు 7 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4  లక్షల టన్నుల నూనె అవసరమని అంచనా. 3లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేస్తే సుమారు 5లక్షల టన్నుల నూనెను ఉత్పత్తి చేయొచ్చు. అంటే పామాయిల్‌ను 3లక్షల ఎకరాల్లో సాగు చేస్తేనే మన అవసరాలు తీరుతాయి. అదే ప్రణాళిక ప్రకారం 7లక్షల ఎకరాల్లో సాగు చేస్తే రాష్ట్రం పామాయిల్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుంది.

ప్రశ్న: పెట్టుబడి, ఆదాయం ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వాల నుంచి ఏమైనా సహకారం లభిస్తుందా? 

సంజయ్‌ గోయెంకా: ఆయిల్‌పామ్‌ సాగు వల్ల రైతులకు అనేక రకాలుగా లాభాలున్నాయి. పెట్టుబడి ఖర్చు కూడా తక్కువ. ఒకవిధంగా చెప్పాలంటే రైతుకు పెట్టుబడి ఖర్చు అవసరం లేదు. అందుకు అవసరమైన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలుగా అందజేస్తున్నాయి. మొదటి ఏడాది ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరముంటుంది. ఆ తర్వాత క్రమంగా ఖర్చు తగ్గుతుంది. మూడేండ్ల తర్వాత ఒక ఎకరాకు అన్ని పనులకు కలిపి సుమారు రూ.21వేలు అవసరం ఉంటుంది. ఇక ఆదాయం ఒక టన్నుకు రూ.9500 వస్తుంది. ఎకరాకు కనీసంగా 10 టన్నుల ఆయిల్‌పామ్‌ ఉత్పత్తి అయితే రైతుకు రూ.95వేలు వస్తాయి. ఇదే కాకుండా ఆయిల్‌పామ్‌ సాగులో అంతర పంటగా కోకో పంటను సాగుచేయాలి.  

ఆయిల్‌పామ్‌ సాగులో ముఖ్యమైంది.. చెట్టుపై గెల పక్వానికి రాగానే సరైన సమయంలో కోయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యంగా కోసినా, ముందు కోసినా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అదే విధంగా గెల కోసిన 24 గంటల్లో గింజలను ప్రాసెస్‌ చేయాలి. కోసిన పంటను తక్కువ సమయంలో మిల్లుకు చేర్చాలి. ఈ నేపథ్యంలో రైతులకు మార్కెటింగ్‌ సులువుగా ఉండేందుకు పలు జిల్లాల్లో ఆయిల్‌ మిల్లులను ఏర్పాటు చేయాలి. ఇందులో భాగంగానే మా కంపెనీ కూడా తెలంగాణలో ప్లాంట్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ప్లాంట్లవల్ల తెలంగాణలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. లక్ష ఎకరాల ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే కనీసంగా 10వేల మందికి ప్రత్యక్ష ఉపాధి,  మరో 20వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. ప్రశ్న: మార్కెటింగ్‌ సౌకర్యం ఎలా ఉంది? ఆయిల్‌ మిల్లులను పెంచాల్సి ఉందా? 

సంజయ్‌ గోయెంకా: మిగతా పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌ దిగుబడి ఎక్కువ. మార్కెటింగ్‌ సులువుగా ఉంటుంది. ఈ పంట సాగులో మధ్యవర్తులు, దళారుల బెడద ఉండదు. కేంద్రమే నేరుగా సీఏసీపీ ద్వారా ధర నిర్ణయిస్తుంది. పరిస్థితులను, డిమాండ్‌ను బట్టి ధరలో హెచ్చుతగ్గులుంటాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ద్వారానే మెజార్టీ కొనుగోళ్లు చేస్తున్నారు. 

ఒక చెట్టు జీవితకాలం 25-30 ఏండ్లు. 15ఏండ్ల వరకు మంచి దిగుబడి వస్తుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. చెట్ల జీవితకాలం మరో మూడు నాలుగేండ్లలో ముగుస్తుందనే సమయంలో ఆదే భూమిలో కొత్త చెట్లు కూడా పెట్టుకోవచ్చు. తద్వారా ప్రస్తుత చెట్ల జీవితకాలం ముగియగానే కొత్త చెట్ల పంట చేతికొస్తుంది. రైతుకు ఇబ్బంది ఉండదు. ఈ చెట్లను ఎకరాకు 57 మాత్రమే నాటాలి. ఒక్కో చెట్టు మధ్య దూరం తొమ్మిది మీటర్ల దూరం ఉండాలి. 

ప్రశ్న: పంట కాలం ఎంత? ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది? చీడపీడల బాధ.. ? 

సంజయ్‌ గోయెంకా: మొక్క నాటిన నుంచి మూడేండ్ల దాకా ఎలాంటి ఆదాయం ఉండదు. నాలుగేండ్ల నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మొదటి ఏడాది సుమారుగా ఎకరాకు ఆరుటన్నుల కాయలు ఉత్పత్తి అవుతాయి. తర్వాత ఏటా పెరుగుతూ గరిష్ఠంగా ఏడాదికి 16 టన్నుల ఉత్పత్తి వస్తుంది. రైతు అమలుచేసే సాగు విధానంపై ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఆర్గానిక్‌ ఎరువులతో మంచి దిగుబడి వస్తుంది.  చెట్లకు ఎలాంటి చీడ పీడల బాధ ఉండదు. నేను 20 ఏండ్లుగా ఇదే సాగు చేస్తున్నాను. ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు. ఈ చెట్లు తుఫాన్లను, భారీ వర్షాలను, ఈదురు గాలులను తట్టుకొంటాయి. కోతులు, ఇతర పశువుల నుంచి ఎలాంటి హాని ఉండదు. వాతావరణానికి కూడా ఈ చెట్లు మంచి చేస్తాయి.

చివరగా మీ కంపెనీ గురించి.. 

3ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌ ఆగ్రోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని 2010లో స్థాపించాం. భారత్‌లో ఆయిల్‌ పామ్‌ తొలితరం కంపెనీల్లో మాది ఉంటుంది. ప్రస్తుతం ఏపీతోపాటు గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడు, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశాలో, ఇతర దేశాల్లోనూ మా ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో త్వరలోనే ప్లాంట్‌ ప్రారంభించాలనుకుంటున్నాం. మొదట మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్లాంట్స్‌ను నెలకొల్పాలనుకుంటున్నాం. ఇక ఆయిల్‌పామ్‌ సాగులో మా సంస్థ తరుపున రైతులకు అవసరమైన సేవలను అందిస్తాం. విత్తనాలు, మొక్కలు, ఎరువులు, క్రాప్‌ కటింగ్‌, మార్కెటింగ్‌ ఇలా అన్ని రకాల సేవలకు సంబంధించి సహకరిస్తాం.

ఇంటర్వ్యూ: కె.స్వామిరెడ్డి


logo